Share News

Hyderabad: ఎంబీబీఎస్‌పై అస్పష్టత

ABN , Publish Date - May 21 , 2024 | 03:07 AM

: రాష్ట్రంలో వైద్య విద్య అడ్మిషన్ల విషయంలో స్థానికత, ఈడబ్ల్యూఎస్‌ కోటాపై సర్కారు నుంచి స్పష్టత కరువైంది. వీటిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. దేశవ్యాప్తంగా నీట్‌ ఫలితాలు జూన్‌ 14న రానున్నాయి. తర్వాత వారం, పది రోజుల్లోనే హెల్త్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. అంటే.. సరిగ్గా నెల రోజుల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

Hyderabad: ఎంబీబీఎస్‌పై అస్పష్టత

  • ప్రవేశాల్లో పాత విధానమా? కొత్తదా? అనే సందిగ్ధత

  • కన్వీనర్‌ కోటా సీట్లలో ఏపీ వారికి పదేళ్లుగా 15ు

  • గడువు తీరడంతో ‘స్థానికత’పై నిర్ణయం తెలంగాణదే

  • ఉన్నత విద్యా మండలి వద్ద పెండింగ్‌లో ఫైల్‌

  • జీవో జారీ చేయకుంటే 300 సీట్లు కోల్పోయినట్టే

  • ఈడబ్ల్యూఎస్‌పైనా నిర్ణయం తీసుకోని ప్రభుత్వం

  • నెలలో నోటిఫికేషన్‌! కొత్త విధానానికి విద్యార్థుల డిమాండ్‌

హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్య విద్య అడ్మిషన్ల విషయంలో స్థానికత, ఈడబ్ల్యూఎస్‌ కోటాపై సర్కారు నుంచి స్పష్టత కరువైంది. వీటిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. దేశవ్యాప్తంగా నీట్‌ ఫలితాలు జూన్‌ 14న రానున్నాయి. తర్వాత వారం, పది రోజుల్లోనే హెల్త్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. అంటే.. సరిగ్గా నెల రోజుల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఆలోగా వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన స్థానికతను తేల్చాల్సి ఉంది. వాస్తవానికి విభజన చట్టం ప్రకారం అన్ని రకాల ఉన్నత విద్యా సంస్థల్లో 15 శాతం కన్వీనర్‌ కోటా సీట్లను ఏపీ, తెలంగాణ విద్యార్థుల కోసం కేటాయుంచారు. మెరిట్‌ ఆధారంగా రెండు రాష్ట్రాల విద్యార్థులకూ సీట్లు కేటాయిస్తున్నారు. ఇదే తీరులో తెలంగాణ విద్యార్థులకు ఏపీలో అవకాశం ఉంటుంది. అయితే, అటు నుంచి ఇటు వైపు వస్తున్నారే తప్ప... రాష్ట్ర విద్యార్థులెవ్వరూ ఏపీకి వెళ్లడం లేదని నిపుణులు చెబుతున్నారు.


పదేళ్లుగా ఈ చట్టం కింద తెలంగాణలోని మెడికల్‌ కాలేజీల్లో ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. అయితే, రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటుతున్న నేపథ్యంలో జూన్‌ 2 తర్వాత జారీ చేసే నోటిఫికేషన్లకు కొత్త స్థానికత విధానం అమలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ‘స్థానికత’ను నిర్వచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. అయితే, ఈ ఏడాది పాత పద్ధతిలోనే ఇంజనీరింగ్‌ ప్రవేశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? స్థానికతను ఏ విధంగా నిర్ణయిస్తుంది? అనే అంశాలపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఎంబీబీఎస్‌ ప్రవేశాల గడువు ముంచుకొస్తుండటంతో స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వాలని విద్యా శాఖకు వైద్య శాఖ ఫైల్‌ పంపింది. సంబంధిత ఫైల్‌ ప్రస్తుతం ఉన్నత విద్యా మండలి వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల హడావుడి కారణంగా సంబంధిత ఫైల్‌ను పట్టించుకోలేదని తెలుస్తోంది. స్థానికతపై ఇప్పుడు జీవో ఇవ్వకుంటే పాత పద్ధతిలోనే ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అలా చేస్తే రాష్ట్ర విద్యార్థులు యూజీలో 300-400 సీట్లతోపాటు పీజీలోనూ కొన్ని సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య విద్య నిపుణులు చెబుతున్నారు.


ఈడబ్ల్యూఎస్‌ కోటా విషయంలోనూ..

స్థానికత అంశం ఇలా ఉంటే...ఈడబ్ల్యూఎ్‌స(ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్స్‌) కోటా విషయం మరోలా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆరు మెడికల్‌ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలవుతోంది. మిగతా కాలేజీల్లో అమలు చేయడం లేదు. ఈడబ్ల్యూఎ్‌సను అమలు చేయాలంటే సీట్ల సంఖ్యను 10శాతం మేర పెంచాలి. అప్పుడే మిగతా రిజర్వేషన్లు యథాతథంగా అమలు చేసే అవకాశం ఉంది. అయితే ఇంజనీరింగ్‌, నర్సింగ్‌, పారా మెడికల్‌ కాలేజీల్లో సీట్లు పెంచకుండానే ఈడబ్ల్యూఎస్‌ అమలు చేస్తున్నారు. కొత్తగా సీట్లు పెంచే అవకాశం లేనప్పుడు ఉన్న సీట్లలోనే ఆ కోటాను అమలు చేయాలని కొద్ది నెలల క్రితం జాతీయ వైద్య కమిషన్‌ స్పష్టం చేసింది. అంటే.. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరు కాలేజీలు సహా మిగతా 50 కాలేజీల్లో ( ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో)నూ ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేయాల్సి ఉంది. ఇందుకు అవసరమైన జీవోను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేయకుంటే ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ కోటాను కచ్చితంగా అమలు చేయాలని న్యాయస్థానాల్లోనూ కేసులు దాఖలయ్యే అవకాశాలూ లేకపోలేదని వైద్య విద్య నిపుణులు సర్కారును హెచ్చరిస్తున్నారు.

Updated Date - May 21 , 2024 | 03:07 AM