Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు
ABN , Publish Date - Dec 28 , 2024 | 05:00 AM
అంబేడ్కర్ ఆశయాల సాధనలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ వలన ఎవరికీ అన్యాయం జరగదన్నారు.

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ
హైదరాబాద్, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ ఆశయాల సాధనలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ వలన ఎవరికీ అన్యాయం జరగదన్నారు. బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న అధ్యక్షతన హైదరాబాద్‌లో నిర్వహించిన కళానేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంద కృష్ణ మాట్లాడుతూ.. మాలలు తమకున్న రాజకీయ పలుకుబడితో ఎస్సీ వర్గీకరణను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అడ్డంకులను ఎదుర్కొనడానికి ‘వెయ్యి గొంతులు.. లక్ష డప్పుల’తో మాదిగల మండే గుండెచప్పుళ్లను వినిపించడానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు.
ఫిబ్రవరి 3న నిర్వహించనున్న ‘వెయ్యి గొంతులు.. లక్ష డప్పుల’ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని సామాజిక వర్గాలకు చెందిన కళానేతలంతా ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం కళానేతలు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ న్యాయం కాబట్టే ఎమ్మార్పీఎ్‌సకు మద్దతు తెలుపుతున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కూడా గజ్జె కట్టి గళం విప్పుతామని తెలిపారు. సమావేశంలో ప్రజా గాయని విమలక్క, మధుప్రియ, నల్గొండ గద్దర్, దరువు అంజన్న తదితరులు పాల్గొన్నారు.