Land Registration: భూముల రిజిస్ట్రేషన్ విలువల.. సవరణ మళ్లీ మొదటికి!
ABN , Publish Date - Jul 08 , 2024 | 03:28 AM
రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. మధ్యతరగతి ప్రజలపై భారం పడకుండా భూముల ధరలను సవరించాలని, ఇందుకోసం విలువల నిర్ధారణ కమిటీలు మరోసారి క్షేత్రస్థాయుకి వెళ్లి అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు కారణం.

మరోసారి అధ్యయనానికి నిర్ణయం
తక్కువే పెంచాలన్న యోచనలో ప్రభుత్వం
మధ్యతరగతికి భారం కాకుండా పెంపు
50-60 శాతానికి మించవద్దన్న మంత్రి
శాస్త్రీయ పద్ధతిలో సవరణకు ఆదేశం
మార్గదర్శకాలను సమీక్షిస్తున్న కమిషనర్
ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. మధ్యతరగతి ప్రజలపై భారం పడకుండా భూముల ధరలను సవరించాలని, ఇందుకోసం విలువల నిర్ధారణ కమిటీలు మరోసారి క్షేత్రస్థాయుకి వెళ్లి అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు కారణం. వాస్తవానికి జూలై 1 నాటికే రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రక్రియను పూర్తిచేసి, కొత్త విలువలను ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెబ్‌సైట్‌లో పెట్టాల్సి ఉంది. ఇందుకు సంబంధించి గతంలో అప్పటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ నవీన్ మిత్తల్ జూన్ 14న గ్రామీణ, పట్టణ పరిధిలో విలువల నిర్ధారణ కమిటీలను నియమించారు.
ఆ కమిటీలకు కొన్ని మార్గదర్శకాలు, వాటిని అమలు చేసేందుకు షెడ్యూల్‌ను (తేదీలను) ఖరారు చేశారు. వీటి ప్రకారం.. విలువల నిర్ధారణ కమిటీలు జూన్ 18 నుంచి క్షేత్రస్థాయికి వెళ్లి, అక్కడ జరుగుతున్న రియల్‌ఎస్టేట్ వ్యాపార లావాదేవీలను తెలుసుకోవాలి. అనంతరం రిజిస్ట్రేషన్ విలువల రివిజన్, ప్రతిపాదించిన విలువలపై సమీక్షలు నిర్వహించాలి. ఆపై.. ప్రతిపాదిత రిజిస్ట్రేషన్ విలువలను ప్రజాభిప్రాయ సేకరణ కోసం జూలై 1న వెబ్‌సైట్‌లో పెట్టి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి. జూలై 15 వరకు ఈ అభ్యంతరాల స్వీకరణ కొనసాగాలి. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రక్రియ షెడ్యూలు ప్రకారం జరగకుండా ఆలస్యమయింది.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఐజీ జ్యోతి బుద్దప్రకాశ్.. భూముల విలువల సవరణ ప్రక్రియను మళ్లీ సమీక్షిస్తున్నారు. రిజిస్ట్రేషన్ విలువలు, చార్జీలను భారీగా పెంచకుండా కొంత మేరకే పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉండడమే ఇందుకు కారణం. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఈ నెల 5న అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సూచన చేశారు.
విమర్శలకు తావులేకుండా సవరణ..!
విలువల సవరణకు మరోమారు లోతైన పరిశీలన చేయాలని, ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీలు మరోసారి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి విలువలను ప్రతిపాదించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని నిర్దేశించారు. 50 నుంచి 60 శాతానికి మించి రిజిస్ట్రేషన్ విలువలు పెంచరాదని ఆయన సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం మార్కెట్ విలువలకు, రిజిస్ట్రేషన్ విలువలకు భారీగా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో ఎలాంటి విమర్శలకు తావులేకుండా శాస్ర్తీయ పద్ధతిలో భూముల ధరల సవరణ జరగాలని మంత్రి అన్నారు.
ఏయే ప్రాంతాల్లో మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ విలువల మధ్య వ్యత్యాసం ఉందో.. దానిని సవరిస్తూ, అక్కడ హేతుబద్ధంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉందో తెలుసుకునేందుకు లోతైన అధ్యయనం చేయాలన్నారు. బిల్డర్లతో కూడా మాట్లాడి అక్కడి బహిరంగ మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ విలువలను తెలుసుకోవాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే ప్రభుత్వ ధర అధికంగా ఉన్న నేపథ్యంలో.. అలాంటి ప్రాంతాలను గుర్తించి రిజిస్ట్రేషన్ విలువలను తగ్గించాలని సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు మరోసారి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించేందుకు సిద్ధమయ్యారు.
కమిషనర్ మారడంతో..
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌గా ఉన్న నవీన్ మిత్తల్‌ను తప్పించి మరో ఐఏఎస్ అధికారి జ్యోతి బుద్దప్రకాశ్‌కు బాధ్యతలు అప్పగించడంతో మార్గదర్శకాల అమల్లో జాప్యం జరిగిందని కొందరు అధికారులు అంటున్నారు. కొత్త కమిషనర్ ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు కూడా కొంత సమయం పట్టవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పలు ఇతర అధికారిక అంశాలపై కేంద్ర మంత్రులను కలిసేందుకు ఇటీవల ఢిల్లీకి వెళ్లడం వల్ల కూడా మార్గదర్శకాల అమల్లో జాప్యం జరిగిందని పేర్కొంటున్నారు.