Share News

KTR: ముఖ్యమంత్రికి చేతకాక.. విద్యుత్తు ఉద్యోగులపై నిందలా?

ABN , Publish Date - May 16 , 2024 | 04:40 AM

రాష్ట్రంలో సక్రమంగా విద్యుత్తు సరఫరా చేయించడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చేతకావడంలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సీఎం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు విద్యుత్తు ఉద్యోగులపై నిందలు మోపుతూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యుత్తు ఉద్యోగులు బీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, తాము చెబితేనే కరెంటు కోతలకు పాల్పడుతున్నారంటూ సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం తగదని హితవు పలికారు. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో బుధవారం ఆ మూడు జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమావేశమయ్యారు.

KTR: ముఖ్యమంత్రికి చేతకాక.. విద్యుత్తు ఉద్యోగులపై నిందలా?

  • సీఎం రేవంత్‌రెడ్డివి చిల్లర రాజకీయాలు.. అప్పులు తప్పన్నవారు ఇప్పుడెందుకు తెస్తున్నారు?

  • రాజకీయాలు తప్ప రైతుల కష్టాలు పట్టించుకోరా?

  • తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

  • ఇప్పటికే ఓ బ్లాక్‌మెయిలర్‌ను గెలిపించాం

  • ఎమ్మెల్సీగా మరొక బ్లాక్‌మెయిలర్‌ వద్దు: కేటీఆర్‌

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సక్రమంగా విద్యుత్తు సరఫరా చేయించడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చేతకావడంలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సీఎం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు విద్యుత్తు ఉద్యోగులపై నిందలు మోపుతూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యుత్తు ఉద్యోగులు బీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, తాము చెబితేనే కరెంటు కోతలకు పాల్పడుతున్నారంటూ సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం తగదని హితవు పలికారు. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో బుధవారం ఆ మూడు జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. నారాయణఖేడ్‌లో మంగళవారం ఉపాధ్యాయుల మీద పోలీసులు దౌర్జన్యం, లాఠీచార్జికి పాల్పడ్డారని, ఎన్నికల విధుల్లో పాల్గొన్నందుకు తగిన వేతనం ఇవ్వాలని అడగడం తప్పా? అని ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వం అప్పులు చేయడమే తప్పు అన్నట్లుగా ప్రచారం చేసిన కాంగ్రెస్‌ సన్నాసులు ఇప్పుడు రూ.వేల కోట్ల అప్పులు ఎందుకు చేస్తున్నారు’’ అని కేటీఆర్‌ నిలదీశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారానికి పాల్పడిన కాంగ్రెస్‌ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.


రాజకీయాలు తప్ప.. రైతుల కష్టాలు పట్టవా?

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎన్నికలు, రాజకీయాలు తప్ప.. రైతాంగం కష్టాలు పట్టడంలేదని కేటీఆర్‌ విమర్శించారు. ఓవైపు అకాల వర్షాలతో, మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు స్తంభించిపోవడంతో రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 25 రోజులుగా మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం కొనకపోవడంతో అన్నదాతలు అవస్థపడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసినందున.. ప్రభుత్వం ఇప్పటికైనా ధాన్యం కొనుగోలుపై దృష్టి పెట్టాలని సూచించారు. తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధాన్యానికి మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ ఇవ్వాలని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఒక బ్లాక్‌ మెయిలర్‌ను అభ్యర్థిగా నిలబెడుతున్నారని, ఆయనను గెలిపిస్తే మరో నయీంలాగా మారతారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఒక బ్లాక్‌మెయిలర్‌ను గెలిపించామని, ఆయన పాలన ఎలా ఉందో చూస్తున్నామని పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా, అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్‌ నాయకులు దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.


సమావేశానికి పలువురు నేతల డుమ్మా

కేటీఆర్‌ నిర్వహించిన ఈ సమావేశానికి నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు నేతలు గైర్హాజరైనట్లు సమాచారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో వారు అసంతృప్తితో ఉన్నట్లు, పార్టీ కోసం పనిచేస్తున్న తమకు కాదని.. కొత్తగా పార్టీలో చేరిన రాకేశ్‌రెడ్డి టికెట్‌ ఇచ్చారంటూ అలకబూనినట్లు తెలుస్తోంది. సమావేశానికి 130 మంది నాయకులను ఆహ్వానించగా.. అందులో సగానికి పైగా నేతలు గైర్హాజరైనట్లు తెలుస్తోంది.

Updated Date - May 16 , 2024 | 05:37 AM