Share News

KTR: తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ వెన్నుతట్టిన మన్మోహన్‌: కేటీఆర్‌

ABN , Publish Date - Dec 28 , 2024 | 05:09 AM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌లో న్యాయం ఉందని, ఆ ఆశయం ఫలించాలని మనస్ఫూర్తిగా ఆశించిన వ్యక్తి మన్మోహన్‌ సింగ్‌ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

KTR: తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ వెన్నుతట్టిన మన్మోహన్‌: కేటీఆర్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌లో న్యాయం ఉందని, ఆ ఆశయం ఫలించాలని మనస్ఫూర్తిగా ఆశించిన వ్యక్తి మన్మోహన్‌ సింగ్‌ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌కు మన్మోహన్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉందని.. తెలంగాణ ఉద్యమ సమయంలో అధైర్య పడొద్దని, వెన్నుతట్టి ధైర్యం చెప్పారని గుర్తు చేశారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్‌ పార్థివదేహానికి బీఆర్‌ఎస్‌ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్‌ సురేశ్‌ రెడ్డి, దామోదర్‌రావులతో కలిసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశాన్ని మన్మోహన్‌ ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకెళ్లారని, ప్రపంచంలో దేశ ఖ్యాతిని పెంచారని తెలిపారు. దాదాపు రెండేళ్లపాటు ఆయన కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్‌ పనిచేశారని గుర్తు చేశారు. 2004లో కేంద్ర మంత్రివర్గంలో చేరిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు ఆటుపోట్లు ఎదురైతే అధైర్య పడొద్దని ప్రోత్సహించారని చెప్పారు.


దేశం గొప్ప నాయకుడిని కోల్పోయింది: కూనంనేని

మన్మోహన్‌సింగ్‌ మరణంతో దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థిక వేత్తగా, అధ్యాపకుడిగా, రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నేతగా, ప్రధానిగా మన్మోహన్‌ దేశానికి ఎన్నో సేవలందించారని కొనియాడారు. మన్మోహన్‌ మరణం పట్ల ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రధానిగా ఆయన దేశానికి ఎనలేని సేవలు చేశారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 05:09 AM