Share News

Formula E Race Case: బిగుస్తున్న ఉచ్చు!

ABN , Publish Date - Dec 28 , 2024 | 04:19 AM

ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్‌ను ఏ1గా, అర్వింద కుమార్‌ ఏ2గా, బీఎల్‌ఎన్‌ రెడ్డి ఏ3గా కేసు నమోదు చేసిన ఏసీబీ, ఫిర్యాదులోని ప్రతి అంశానికి పక్కా ఆధారాలు సేకరించింది.

Formula E Race Case: బిగుస్తున్న ఉచ్చు!

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌ మీద 409 సెక్షన్‌

  • నోటీసులు ఇవ్వకుండా అరెస్టుకు అవకాశం

  • క్వాష్‌ పిటిషన్‌ తేలగానే ఏసీబీ కదిలే అవకాశం

  • కేటీఆర్‌ టీవీల ముందే తప్పు ఒప్పుకున్నారు

  • ప్రభుత్వ సొమ్మును దురుద్దేశంతో బదిలీ చేశారు

  • కోర్టు ముందు కౌంటర్‌ అఫిడవిట్‌లో ఏసీబీ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 27(ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్‌ను ఏ1గా, అర్వింద కుమార్‌ ఏ2గా, బీఎల్‌ఎన్‌ రెడ్డి ఏ3గా కేసు నమోదు చేసిన ఏసీబీ, ఫిర్యాదులోని ప్రతి అంశానికి పక్కా ఆధారాలు సేకరించింది. తాము సేకరించిన ఆధారాలు, మంత్రి హోదాలో కేటీఆర్‌ చేసిన తప్పులు, సచివాలయ బిజినెస్‌ రూల్స్‌ ఉల్లంఘన, ఆర్దిక శాఖను బేఖాతర్‌ చేసిన వైనాన్ని పూసగుచ్చినట్లు కౌంటర్‌ అఫిడవిట్‌ ద్వారా ఏసీబీ హైకోర్టు ముందుంచింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి అంతా తన కనుసన్నల్లోనే జరిగిందని, పూర్తి బాధ్యత తనదేనని టీవీల్లో కేటీఆర్‌ చెప్పిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఏ విధంగా నేరస్థుడు అవుతారో వివరాలను ఏసీబీ అధికారులు హైకోర్టు ముందు పెట్టారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఒకటి రెండు కాదని, అనేక ఉల్లంఘనలు జరిగాయని ఏసీబీ పేర్కొంది. ఒప్పందం చేసుకోవడానికి ముందే నిధులను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారని ప్రస్తావించింది.


2022లో తొలిసారి చేసుకున్న ఒప్పందంలోనూ గవర్నర్‌ అనుమతి తీసుకోలేదని, 2023లో చేసుకున్న ఒప్పందంలో ఒక అడుగు ముందుకు వేసి విదేశీ కరెన్సీ రూపంలో నిధుల చెల్లింపు చేయడం పూర్తిగా నేరపూరిత చర్యేనని ఏసీబీ స్పష్టం చేసింది. మొత్తం రూ.54.9 కోట్లను కేటీఆర్‌ నిర్దేశం ప్రకారమే ఖర్చు చేశారని ధ్రువీకరించింది. ఇందులో ప్రాథమికంగా ఆధారాలున్నాయి కాబట్టి కేసు నమోదు చేసినట్లు ఏసీబీ న్యాయస్థానానికి నివేదించింది. సచివాలయ బిజినెస్‌ రూల్స్‌ 9,11 ప్రకారం నిర్ణీత మొత్తం కన్నా ఎక్కువగా ఏ శాఖ అయినా ఖర్చు చేయాల్సి ఉంటే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని గుర్తు చేసింది. మంత్రివర్గం అనుమతి తర్వాతే ఆర్థిక శాఖ నిధులను విడుదల చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణ స్టేట్‌ ఫైనాన్స్‌ కోడ్‌లోని ఆర్టికల్‌ 51(బి), ఆర్టికల్‌ 299 ప్రకారం విదేశీ కంపెనీతో ఒప్పందం చేసుకోవాలి అంటే గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సిందేనని ఏసీబీ చెప్పింది.


వీటిని ఉల్లంఘించి ఆర్థిక ఒప్పందం చేసుకోవడమంటే విచారించ తగ్గ నేరమేనని వ్యాఖ్యానించింది. కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకోకుండా డబ్బు విడుదల చేయడం నేరమేనని ఏసీబీ అధికారులు వివరించారు. ప్రభుత్వ ఆస్తిపై ఆధిపత్యం కలిగి ఉన్న ప్రజాప్రతినిధిగా నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడితే సెక్షన్‌ 409 వర్తిస్తుందని తెలిపింది. ఈ సెక్షన్‌ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసేందుకు ఏసీబీకి అధికారం ఉంది. ఇదే విషయాన్ని పలువురు న్యాయ నిపుణులు ధ్రువీకరిస్తున్నారు. డిసెంబరు 31లోగా కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేస్తే సెక్షన్‌ 409 కింద ఏసీబీ నోటీసులు ఇవ్వకుండానే కేటీఆర్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. మంత్రివర్గం ఆమోదం లేకుండా, రిజర్వు బ్యాంకు అనుమతి తీసుకోకుండా వ్యవహరించడం సెక్షన్‌ 13(1)(ఏ) కింద నేరమని ఏసీబీ తన కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ విధంగా తాము నమోదు చేసిన ప్రతి సెక్షన్‌కు సంబంధించి కేటీఆర్‌ తదితరులు ఏ విధంగా కేసు విచారణకు అర్హులో వివరిస్తూ సుదీర్ఘ కౌంటర్‌ను ఏసీబీ హైకోర్టు ముందు ఉంచింది.

Updated Date - Dec 28 , 2024 | 04:19 AM