Share News

TS News: ‘ఆ పాపాలే కేసీఆర్‌కు తగిలాయి’

ABN , Publish Date - Mar 29 , 2024 | 01:13 PM

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ గతంలో చేసిన పాపాలే.. ప్రస్తుతం ఆయన్ని చుట్టుముడుతోన్నాయని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌గా మాట్లాడారు.

TS News: ‘ఆ పాపాలే కేసీఆర్‌కు తగిలాయి’

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ గతంలో చేసిన పాపాలే.. ప్రస్తుతం ఆయన్ని చుట్టుముడుతోన్నాయని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌గా మాట్లాడారు. గతంలో కేసీఆర్ పాలనను ఈ సందర్బంగా ఆయన తూర్పారబెట్టారు. యాదగిరిగుట్ట పేరు మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని ఆయన స్పష్టం చేశారు.

కేసీఆర్ చేసిన పాపాల వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే వర్షం.. వర్షం అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్లుగా ఉండేదని... కానీ కేసీఆర్ పాలనలో అలా లేదని చెప్పారు. ఎండిన పంటలను చూస్తుంటే ఏడుపు వస్తోందన్నారు. ఇక దేవుడి పేరు పేట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి సర్వనాశనం చేశారంటూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. మా జిల్లాను నాశనం చేసి మళ్లీ ఏ మొఖం పెట్టుకోని నల్గొండ వస్తారంటూ కేసీఆర్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు.

ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారులతో సైతం పాపపు పనులు చేయించారన్నారు. దీంతో ఆ పాపంలో భాగస్వామ్యలైన అధికారులు నిద్రపోవడం లేదని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అందరికి ఇండ్లు ఇచ్చామని.. అయితే కేసీఆర్ ఎవరికి ఇండ్లు ఇచ్చారో ఎవ్వరికీ తెలియదంటూ కోమటిరెడ్డి పేర్కొన్నారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దళితబందు, సీఎంఆర్ఎఫ్‌పై కమిషన్లు సైతం దండుకున్నారని గుర్తు చేశారు. అలాగే యాదగిరి గుట్టలో స్కాం జరిగిందని.. దీనిపై లోక్‌సభ ఎన్నికలు పూర్తైన తర్వాత విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. అలాగే యాదాద్రి పేరు మళ్ళీ యాదగిరి గుట్ట‌గా మారుస్తామని.. అయితే ఇది ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత దీనిపై ప్రభుత్వం జీవో జారీ చేస్తుందన్నారు.

కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌కు రహదారి కోసం ఆ ఊళ్లోని నివాసాలను సైతం కూల్చారని ఆరోపించారు. రూ. 2 వందల కోట్లు ఖర్చు చేస్తే ఆలేరు ప్రాజెక్ట్ పూర్తయ్యేదని.. కానీ కేసీఆర్ ఆ పని చేయలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ రాష్ట్రంలో చూడలేదని తెలిపారు. అయితే కేసీఆర్ ఫక్తు రాజకీయ నాయకుడయ్యారని ఈ సందర్బంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభివర్ణించారు. దాంతో ఆయన ప్రతీది రాజకీయ చేశారని విమర్శించారు. యాదగుట్టులో చేసిన పాపాలే కేసీఆర్‌కు తగిలిందని.. అందుకే బీఆర్ఆర్ పార్టీ ఖాళీ అవుతుందని.. ఆ క్రమంలోనే ఆయన మైండ్ బ్లాంక్ అయి ఏదేదో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

రైతు బంధు 97 శాతం మంది రైతులకు పడ్డాయని మాజీ మంత్రి హరీష్ రావు సంబంధం లేని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేదని.. అందుకే టికెట్ ఇచ్చినా వద్దు అని ప్రకటిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ తమ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించింది. అయితే తాను ఎన్నికల బరిలో నుంచి తప్పుకొంటున్నట్లు కడియం కావ్య.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.

అయితే మేము గేట్లు తెరవలేదని.. కానీ మా పార్టీ గేట్లు పగలకొట్టి మరీ వచ్చి చేరుతున్నారని తెలిపారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరూ కూడా మిగలరని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. కొత్త వాళ్లకు టికెట్ ఇవ్వడమంటే.. గెలిచే వాళ్లకు ఇస్తున్నారని.. అంతేకానీ.. పాత వాళ్లకు అన్యాయం చేయడం లేదని చెప్పారు. హైదరాబాద్ లాంటి లోక్‌సభ స్థానంలో గెలిచే బలమైన అభ్యర్థినే బరిలో నిలుపబోతున్నట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Mar 29 , 2024 | 01:17 PM