Share News

CM Revanth Reddy: ఉద్యోగులకు.. ఏడో గ్యారెంటీ!

ABN , Publish Date - Mar 11 , 2024 | 08:10 AM

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదేళ్లుగా తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం రాలేదని, వారి ఆవేదన వినేవారే లేక ఇబ్బందులు పడ్డారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే అంశాన్ని కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని తెలిపారు.

CM Revanth Reddy: ఉద్యోగులకు.. ఏడో గ్యారెంటీ!

అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ, సమస్యలు చెప్పుకొనే చాన్స్‌

సమస్యలను పరిష్కరిస్తాం.. డీఏ, పీఆర్సీపై త్వరలో నిర్ణయం

ప్రభుత్వ పాఠశాలల్లో కిందిస్థాయి సిబ్బందినీ నియమిస్తాం

సీపీఎస్‌, ఓపీఎస్‌పై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం

కోదండరాం మండలికి.. తెలంగాణ బాపు జయశంకర్‌ సార్‌

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి

2 గంటలపాటు సమస్యలను ఓపిగ్గా విన్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదేళ్లుగా తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం రాలేదని, వారి ఆవేదన వినేవారే లేక ఇబ్బందులు పడ్డారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే అంశాన్ని కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని తెలిపారు. దానిని నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వానిదని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను చెప్పుకొనే, అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉందని, ఇందుకు ఎటువంటి అడ్డంకులు ఉండబోవని ప్రకటించారు. ఇది తమ ప్రభుత్వ ఏడో గ్యారెంటీగా హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల డీఏ, పీఆర్సీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆదివారం ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఎంసీహెచ్‌ఆర్డీలో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్ని రోజులూ ఆయా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నది కేసీఆర్‌ కుటుంబమేనన్నారు. నిర్బంధాలతో పాలన సాగిస్తామనుకోవడం వారి భ్రమ అని, సమస్యలకు చర్చలే పరిష్కారం తప్ప.. నిర్భందాలు కావని అన్నారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు విశ్వాసం కల్పించడానికే చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామని గుర్తు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం శాఖల వారీగా సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుందని, సంఘాలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు. ఉద్యోగుల డీఏతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, వివిధ శాఖల్లో ఉన్న 1100 మంది రిటైర్డ్‌ ఉద్యోగుల కొనసాగింపుపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు ఉచితంగా విద్యుత్తు ఇచ్చే విషయంలోనూ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కిందిస్థాయి సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. ఉద్యోగులకు ఒకటో తారీకునే జీతాలు వేసినా తాము ప్రచారం చేసుకోవడం లేదన్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ పాలనను గాడిలో పెడుతున్నామని చెప్పారు.

తెలంగాణ బాపు కేసీఆర్‌ కాదు..

మాజీ సీఎం కేసీఆర్‌ తనకు తాను తెలంగాణ బాపుగా చెప్పుకొంటున్నారని, అలా చెప్పుకోవడానికి కనీస పోలిక ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ బాపు, సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని, తెలంగాణ ఆత్మను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆదాయం పడిపోతే.. మద్యంపై వచ్చే ఆదాయంపైనే ఆధారపడేలా కేసీఆర్‌ పాలన సాగిందని విమర్శించారు. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందరి రేవంత్‌ అన్నారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబంలో ఎవరి రక్తమూ చిందలేదని, కానీ.. కానిస్టేబుల్‌ కిష్టయ్య లాంటివారు రక్తాన్ని చిందించారని, శ్రీకాంతాచారి లాంటివారు మాంసపు ముద్దలయ్యారని అన్నారు. టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను శాసనమండలికి తప్పక పంపుతామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయన ఎమ్మెల్సీగా ఉంటే శాసనమండలికి గౌరవమన్నారు. ఈ విషయంపై గవర్నర్‌ తమిళిసైతో మాట్లాడతానన్నారు. ఈ సమావేశంలో మంత్రి డి.శ్రీధర్‌బాబు, కోదండరామ్‌, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

టీచర్లు, ఉద్యోగులలో సంతోషం..

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశం కావడం పట్ల ఆయా సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ప్రత్యేక చొరవతో ఏర్పాటైన ఈ సమావేశంలో.. ప్రధాన డిమాండ్లను సీఎం దృష్టికి టీజీవోఏ తీసుకెళ్లింది. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఎల్లో మూడింటిని ఇవ్వాలని, సీపీఎస్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరింది. వీటితోపాటు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న హెల్త్‌ కార్డులను వెంటనే ఇవ్వాలని, పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేయాలని విన్నవించింది. కాగా, ముఖ్యమంత్రి రెండు గంటలపాటు తమ సమస్యలపై మాట్లాడమే కాకుండా ఎంతో ఓపికగా విన్నారని సంఘాల నేతలు తెలిపారు. గతంలో కనీసం సమస్యలు వినే పరిస్థితి కూడా ఉండేది కాదన్నారు. కాగా, వైద్యశాఖలో పని చేస్తున్న మెడికల్‌ సూపరింటెండెంట్‌, ప్రిన్సిపాల్‌ అందరినీ బదిలీ చేయాలని మెడికల్‌ జేఏసీ.. ముఖ్యమంత్రిని కోరింది. ఉస్మానియాకు కొత్త భవనం కట్టాలని, అశాస్త్రీయంగా ఉన్న మెడికల్‌ కాలేజీల సంఖ్యను తగ్గించాలని సూచించింది. ఆస్పత్రుల్లో విధులకు వచ్చే నర్సులు దుస్తులు మార్చుకునేందుకు కనీసం రూమ్‌లు లేని విషయాన్ని నర్సుల అసోసియేషన్‌ సీఎం దృష్టికి తీసుకెళ్లింది. ఇక సాధారణ బదిలీలు, పదోన్నతులు, 317 సమస్యను పరిష్కరించాలని, ఉపాధ్యాయ, ఉద్యోగుల సీపీఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ పునరుద్ధరణపై ఆయా సంఘాల ప్రతినిధులు సీఎంకు వినతి పత్రం ఇచ్చారు. ప్రధానంగా టీచర్లకు సంబంఽధించిన మల్టీజోన్‌, స్పౌజ్‌ సమస్యలు, స్థానికత, బదిలీలు, ఆరోగ్య బీమా, పెండింగ్‌ డీఏ లాంటి సమస్యలను వివరించారు. కాగా వినతి పత్రాలను కొన్నింటిని సీఎం నేరుగా తీసుకున్నారు.

సీఎంకు పీఆర్‌టీయూ నేతల కృతజ్ఞతలు

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించడమే కాకుండా సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడం పట్ల పీఆర్‌టీయూ నేతలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Mar 11 , 2024 | 08:10 AM