Share News

Water Problem: యాసంగికి సాగు నీటి కొరత.. ఎండుతున్న పంటలు

ABN , Publish Date - Mar 11 , 2024 | 07:33 AM

ఎండిపోతున్న చెరువులు.. అడుగంటుతున్న బావులు..! ముదురుతున్న ఎండలు.. లోలోతుకు భూగర్భ జలాలు..! పంటను కాపాడుకునేందుకు బోరు పక్కన బోరు..! గొంతు తడుపుకొనేందుకు ఇంటికి ట్యాంకర్లు..! వెరసి ఆయకట్టుకు కటకట.. తాగునీటికి తంటా..! ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితి..! వర్షాలు సమృద్ధిగా కురవని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

Water Problem:  యాసంగికి సాగు నీటి కొరత.. ఎండుతున్న పంటలు

రాష్ట్రవ్యాప్తంగా సగటున 8.7 మీటర్ల లోతుకు నీరు

యాసంగికి సాగు నీటి కొరత.. ఎండుతున్న పంటలు

ఒకటికి మూడు బోర్లు తవ్విస్తున్నా ఫలితం శూన్యం

రాష్ట్రంలో జలాశయాలన్నిటిలో కొడిగడుతున్న నిల్వలు

ఇప్పుడే ఇలాగైతే వచ్చే రెండు నెలలు పరిస్థితులు క్లిష్టం

పాలేరులో నీరు లేక గొంతెండుతున్న ఖమ్మం జిల్లా

నైరుతి, ఈశాన్య రుతుపవనాలతో చాలీచాలని వర్షాలు

జలాశయాల్లో నిరుటి కంటే 155 టీఎంసీలు తక్కువ

డెడ్‌ స్టోరేజీకి చేరువలో నాగార్జున సాగర్‌ నీటి మట్టం

సాగర్‌, ఏఎమ్మార్పీ, జూరాల కింద పంట విరామం

ఎస్సారెస్పీలో 25 టీఎంసీలే.. ఆన్‌ఆఫ్‌ పద్ధతిలో విడుదల

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఎండిపోతున్న చెరువులు.. అడుగంటుతున్న బావులు..! ముదురుతున్న ఎండలు.. లోలోతుకు భూగర్భ జలాలు..! పంటను కాపాడుకునేందుకు బోరు పక్కన బోరు..! గొంతు తడుపుకొనేందుకు ఇంటికి ట్యాంకర్లు..! వెరసి ఆయకట్టుకు కటకట.. తాగునీటికి తంటా..! ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితి..! వర్షాలు సమృద్ధిగా కురవని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఎండలు ముదిరే వచ్చే రెండు నెలలు ఇంకెన్ని ఇబ్బందులు తలెత్తుతాయోననే ఆందోళన నెలకొంది. వాస్తవానికి నాలుగైదేళ్లుగా రాష్ట్రంలో వర్షా కాలం సీజన్‌ ముగిసిన తర్వాత కూడా వానలు కురిశాయి. రెండు, మూడేళ్లు నైరుతి రుతు పవనాలు రాష్ట్రం నుంచి ఆలస్యంగా నిష్క్రమించాయి. ఈశాన్య రుతు పవనాల సమయంలో కూడా వర్షాలు ఎక్కువగా కురవడంతో నీటి నిల్వలు, భూగర్భ జలాలు పెరిగి సాగుకు కొరత ఏర్పడలేదు. జూన్‌, జులై, ఆగస్టు, సెప్టెంబరుల్లో కురిసిన వర్షాలతో రైతులు వానా కాలం పంటలు సాగు చేసేవారు. ఈ తర్వాత అక్టోబరు, నవంబరుల్లో వర్షాలు పడి మళ్లీ జలాశయాలు నిండిపోయేవి. దీంతో ఒకే సీజన్‌లో రెండు, మూడు సార్లు సాగునీటి వనరులు కళకళలాడాయి. అవే నీళ్లు యాసంగి సీజన్‌ వరకు ఉండడంతో సాగు నీటికి సమస్య ఏర్పడలేదు. కానీ, ఈ సంవత్సరం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు తక్కువగా పడటంతో నీటికి కొరత ఏర్పడింది.

వర్షపాతం సగటును మించినా..

రాష్ట్ర సగటు వర్షపాతం 866.40 మిల్లీ మీటర్లు. 2022–23లో 1,235 మి.మీ., ఈ సంవత్సరం (2023–24)లో 914.90 మి.మీ. నమోదైంది. గణాంకాల ప్రకారం.. నిరుటి కంటే సాధారణ వర్షపాతం కాస్త ఎక్కువే. అయితే, ఇదేమీ ఉపయోగపడడం లేదు. ఇక నిరుడు నైరుతి రుతు పవనాల సీజన్‌ (జూన్‌–సెప్టెంబరు)లో 1,099 మి.మీ వర్షపాతం నమోదైతే ఈ ఏడాది 861 మి.మీ.కు పరిమితమైంది. గత ఏడాది ఈశాన్య రుతు పవనాల సమయంలో (అక్టోబరు–డిసెంబరు) 136 మి.మీ వర్షపాతం ఉండగా ఈ ఏడాది 53 మి.మీ. నమోదైంది. శీతాకాల సమయంలో (జనవరి, ఫిబ్రవరి) 12 మి.మీ సాధారణ వర్షపాతానికి గాను 1.10 మి.మీ. మాత్రమే నమోదైంది. అంటే.. నైరుతి మొదలుకుని ఈశాన్య రుతు పవనాలు, శీతాకాలంలో కురిసే అడపాదడపా వానల వరకు తక్కువే కురిశాయి. ఇదే యాసంగి సాగుకు ప్రతిబంధకంగా తయారైంది. వ్యవసాయ శాఖ తాజా నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి ఆఖరు వరకు భూగర్భ జలాలు సగటున ఉపరితలం నుంచి 8.70 మీటర్ల లోతులోకి వెళ్లిపోయాయి. దీన్నిబట్టే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

వరి కోతలకు వచ్చేది కష్టమే?

ఈ యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 66.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 50.84 లక్షల ఎకరాల్లో వేశారు. 2.09 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2.55 లక్షల ఎకరాల్లో శనగ, 6.48 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగయ్యాయి. భూగర్భ జలాలు పడిపోవడం, ప్రాజెక్టుల్లో నిల్వలు తగ్గిపోతుండడంతో నీటి కొరత ఏర్పడింది. వివిధ జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ప్రధానంగా వరికి సరిపడా అందడం లేదు. ఏప్రిల్‌, మే నెలల్లో వరి కోతకు వస్తుంది. ముందుగా నాట్లు వేసినచోట ఈ నెల రెండో పక్షంలో కోతలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ దశలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాగైతేనే గింజ బలంగా తయారవుతుంది. లేదంటే దిగుబడి గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. గత ఏడాదితో పోలిస్తే యాసంగిలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. నిరుడు 57.09 లక్షల ఎకరాల్లో వరి వేస్తే ఈసారి 50.84 లక్షల ఎకరాల్లో సాగైంది. అన్ని పంటలు కలిపి నిరుడు యాసంగిలో 73.10 లక్షల ఎకరాల్లో సాగైతే ఈసారి 66.30 లక్షల ఎకరాల్లోనే వేశారు. దీంతోనే పంటల ఉత్పత్తి తగ్గిపోతుందని అనుకుంటుంటే.. సాగునీటి కొరతతో దిగుబడి పడిపోయే ప్రమాదం నెలకొంది.

ఖమ్మంలో ఎండిపోయిన 700 చెరువులు

నాగార్జున సాగర్‌ డెడ్‌ స్టోరేజీ (510 అడుగులు)కి చేరువవుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 514.50 అడుగుల మేర నీరుంది. సాగర్‌తో పాటు ఏఎమ్మార్పీ కింద దశాబ్దం తర్వాత క్రాప్‌ హాలిడే ప్రకటించడం గమనార్హం. నల్లగొండ జిల్లాలో ప్రధానమైన బత్తాయి, నిమ్మతోటలు ఎండిపోతున్నాయి. సాగర్‌ నుంచి తాగు నీటి కోసం శనివారం మూడు టీఎంసీలను విడుదల చేయాల్సి వచ్చింది. జూరాల కింద సైతం క్రాప్‌ హాలిడే ప్రకటించారు. కర్ణాటక నుంచి సీపేజ్‌ నీరూ రావడం లేదు. దీంతో జూరాల నీటిని తాగడానికే పరిమితం చేశారు. ఉమ్మడి ఖమ్మంలో తాగునీటికి ఈ ఏడాది తండ్లాట తప్పేలా లేదు. ఈ జిల్లాలో మొత్తం 700 చెరువులు ఎండిపోయాయి. పాలేరు నుంచి ఏటా 2 టీఎంసీలను తాగునీటికి వాడుతుంటారు. అయితే, ఫిబ్రవరిలో సాగర్‌ జలాలు రాలేదు. దీని ద్వారా ఖమ్మం నగరం, జిల్లాలోని 950 గ్రామాలకు తాగునీరివ్వాల్సింది. వారం రోజులుగా ఖమ్మంలో 8 ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో 1.28 లక్షల ఎకరాల్లో వరి సాగైనా సగమైనా కోతలకు వస్తుందా? అనే ఆందోళన నెలకొంది. కొందరు రైతులు మూడేసి బోర్లు తవ్వించినా ఫలితం దక్కలేదు. కరీంనగర్‌ జిల్లాలో ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీరు అందజేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 25 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. పంటలు చివరికి వచ్చేసరికి ఈ నీళ్లు అందవు.

3 జిల్లాల్లో 13 మీటర్ల లోతున జలాలు

మే నెలలో ఎలాంటి వాతారవరణం ఉంటుందో ఇప్పుడు అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. పాలేరు నీరు లేక ఖమ్మం జిల్లాలో భూగర్జ జల మట్టం వేగంగా పడిపోతోంది. జనవరిలో 2 అడుగులు, ఫిబ్రవరిలో 4 అడుగులు పడిపోయుయింది. వరంగల్‌, వికారాబాద్‌ జిలాల్లో మీటరు మేర పడిపోయాయి. ఎండల తీవ్రతతో ఆవిరయ్యే నీటి శాతం కూడా పెరుగుతోంది. 2023 ఫిబ్రవరిలో భూగర్భ జలాలు ఉపరితలం నుంచి 7.34 మీటర్ల లోతులో ఉండగా.. ఈసారి 1.36 మీటర్ల ఎక్కువ లోతుకు వెళ్లిపోయాయి. 2023 మేలో 8.37 మీటర్ల లోతులో ఉండగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే 8.70 మీటర్లకు పడిపోవడం గమనార్హం. దీనికిముందు జనవరిలో 7.72 మీటర్ల లోతులో ఉండగా.. నెల తిరిగేసరికి ఇంకో మీటరు కిందకు వెళ్లిపోయాయి. మార్చిలో 9 మీటర్లకు పడిపోయి ఉంటాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వికారాబాద్‌, కామారెడ్డి, మెదక్‌లో 13 మీటర్లు, రంగారెడ్డి, సంగారెడ్డి మేడ్చల్‌లో 12 మీటర్లు, నాగర్‌కర్నూల్‌, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో 10 మీటర్ల లోతుకు పైగా భూగర్భ జలాలు పడిపోయాయి.

రాష్ట్రంలోని జలాశయాల్లో కూడా నిల్వలు కొడిగడుతున్నాయి. నీటి పారుదల శాఖ నివేదిక ప్రకారం ఈ నెల 6వ తేదీ నాటికి 12 ప్రధాన జలాశయాల్లో 283.41 టీఎంసీల నిల్వలున్నాయి. నిరుటితో పోలిస్తే 155.36 టీఎంసీలు తక్కువ. సాగర్‌లో నిరుడు 196.12 టీఎంసీల నీరుండగా ఇప్పుడు 140.49 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.

Updated Date - Mar 11 , 2024 | 07:33 AM