Share News

IRCTC Alert: ట్రైన్ ఎక్కేటప్పుడు ఆ పని చేస్తున్నారా? డైరెక్ట్ జైలుకే ఇక..!

ABN , Publish Date - Mar 20 , 2024 | 04:39 AM

రైలు ఎక్కుతున్నపుడు, దిగే సందర్భంలో సెల్‌ఫోన్‌ వాడుతున్నారా..? రైల్వే ట్రాక్‌ల దగ్గర నడుస్తున్నప్పుడు ఫోన్‌లో మాట్లాడటం లేదా మొబైల్‌ చూడటం వంటివి చేస్తున్నారా..?

IRCTC Alert: ట్రైన్ ఎక్కేటప్పుడు ఆ పని చేస్తున్నారా? డైరెక్ట్ జైలుకే ఇక..!
Indian Railways

  • పట్టాల పరిసరాల్లో సెల్ఫీ దిగినా అదే శిక్ష

  • ట్రాక్‌ పక్కన నడుస్తూ ఫోన్‌ మాట్లాడొద్దు

  • భద్రత దృష్ట్యా అధికారుల నిషేధాజ్ఞలు

హైదరాబాద్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): రైలు ఎక్కుతున్నపుడు, దిగే సందర్భంలో సెల్‌ఫోన్‌(Mobile Phone) వాడుతున్నారా..? రైల్వే ట్రాక్‌ల(Railway Track) దగ్గర నడుస్తున్నప్పుడు ఫోన్‌లో మాట్లాడటం లేదా మొబైల్‌ చూడటం వంటివి చేస్తున్నారా..? అయితే తస్మాత్‌ జాగ్రత్త.. ఇకపై ఇలాంటివి చేస్తే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా తప్పదని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. రైల్వే ట్రాక్‌ కనబడగానే స్మార్ట్‌ఫోన్‌ బయటికి తీసి సెల్ఫీలు దిగినా.. లొకేషన్‌ బాగుందని రైలు పట్టాల వెంబడి షార్ట్‌ ఫిల్మ్‌లు, ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లు, ఇతర ఫొటోగ్రఫీలు తీసినా.. కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. రైల్వే ట్రాక్‌ల పరిసరాల్లో గుమికూడటం, మరే ఇతర కార్యకలాపాల్లోనూ పాల్గొనడం వంటివి చేయకూడదని స్పష్టం చేశారు. పౌరులు రైల్వే ట్రాక్‌ను దాటకూడదని, కదులుతున్న రైళ్లలో ఎక్కడానికి, దిగడానికి ప్రయత్నించే సందర్భాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని హెచ్చరించారు. రైళ్లు ఎక్కేటప్పుడు ప్లాట్‌ఫాంను ఉపయోగించాలని, నిషేధిత ప్రాంతం నుంచి రైలులోకి ప్రవేశించరాదని తెలిపారు. స్టేషన్లలో రైల్వే ట్రాక్‌లను దాటడానికి ప్రయత్నించవద్దని.. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, సబ్‌వేలు, రోడ్‌ ఓవర్‌/అండర్‌ బ్రిడ్జ్‌లు, రైల్‌ క్రాసింగ్‌లను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2024 | 11:17 AM