Share News

TG: 6 గ్యారెంటీలు అమలైనట్లు నిరూపిస్తే.. పోటీ నుంచి తప్పుకొంటా: బండి సంజయ్

ABN , Publish Date - Apr 28 , 2024 | 04:43 AM

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే తాను పోటీ నుంచి తప్పుకొంటానని, నిరూపించకపోతే ఆ పార్టీ అభ్యర్థులంతా వైదొలుగుతారా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ సవాల్‌ విసిరారు.

TG: 6 గ్యారెంటీలు అమలైనట్లు నిరూపిస్తే.. పోటీ నుంచి తప్పుకొంటా: బండి సంజయ్

  • లేదంటే కాంగ్రెస్‌ అభ్యర్థులు వైదొలుగుతారా?.. రోజు, వేదిక మీరే నిర్ణయించండి

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలవన్నీ డ్రామాలు.. నన్ను ఓడించేందుకు చీకటి ఒప్పందాలు

  • ఓటుకు వెయ్యి ఇచ్చి గెలవాలని కాంగ్రెస్‌ యత్నం.. హిందువులను కేసీఆర్‌ కించపరిచారు

  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ వ్యాఖ్యలు

కరీంనగర్‌/సిరిసిల్ల, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే తాను పోటీ నుంచి తప్పుకొంటానని, నిరూపించకపోతే ఆ పార్టీ అభ్యర్థులంతా వైదొలుగుతారా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ సవాల్‌ విసిరారు. శనివారం కరీంనగర్‌లో పలువురు బీజేపీలో చేరిన సందర్భంగా, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు (సోమవారం)లోపు నిరూపిస్తే తాను పోటీ నుంచి తప్పుకొంటానని, ఎన్నికలలోపు నిరూపిస్తే తాను స్వయంగా కాంగ్రెస్‌ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తాననన్నారు. మేనిఫెస్టోను బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతలా భావిస్తామన్న మాటకు కాంగ్రెస్‌ కట్టుబడితే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. తేదీ, సమయం, వేదిక వారే నిర్ణయించవచ్చని, అమరవీరుల స్తూపం, సర్దార్‌ పటేల్‌ విగ్రహం, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం.. వీటిలో ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధమన్నారు. ఆరు గ్యారెంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని ఒకాయన అంటుంటే.. నిజంగా చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మరొకరు అంటున్నారన్నారు. రుణమాఫీపై వారు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ బ్రేకింగుల కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని అన్ని మతాలు, వర్గాలను


సమానంగా చూడాలన్నదే బీజేపీ విధానమన్నారు. బీజేపీ ఏది మాట్లాడినా మతతత్వమనే ముద్ర వేసే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇతర మతస్థుల ముందు హిందూమతాన్ని హేళన చేసేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతీ సంప్రదాయాలను కించపరిచే వాళ్లు హిం దువులేనా అని ప్రశ్నించారు. అయోధ్య అక్షింతలను, ప్రసాదాన్ని కూడా కించపరుస్తున్నారని, అసలు వారికి రాముడంటే ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. కేసీఆర్‌ లాంటి వాడు ప్రధాని అయితే పాకిస్థాన్‌లో టోపీలను చూసి... భారత్‌ను ఆ దేశంలో కలుపుతానంటాడేమోనని ఎద్దేవా చేశారు. హిందూగాళ్లు, బొందూగాళ్లు అ న్నందుకు కరీంనగర్‌లో ఆయన పార్టీని బొంద పెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ‘దేవుడిని నమ్మని నీ కొడుకు (కేటీఆర్‌) దేవుడిని కించపరిచేలా మాట్లాడి తే హిందువులు అతని అహంకారాన్ని దించి గుడిమె ట్ల ముందు మోకరిల్లేలా చేశార’ని వ్యాఖ్యానించారు.


కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బొమ్మా బొరుసులాంటి వాళ్లు!

కరీంనగర్‌ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కేసీఆర్‌ అనే నాణేనికి బొమ్మా బొరుసు లాంటి వాళ్లని, ఇద్దరూ చీకటి ఒప్పందాలు చేసుకుని తనను ఓడించాలని కుట్ర చేస్తున్నారన్నారు. ఓడిపోతాననే భయంతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటుకు వెయ్యి రూపాయలు పంచి గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ తిట్లను దీవెనలుగా భావిస్తున్నానని అన్నారు. ‘వెధవ’ అని పొన్నం తనను దూషించారని, వెధవ అంటే తన దృష్టిలో ‘వెయ్యేళ్లు ధనికుడిగా వర్థిల్లు’ అని అర్థమన్నారు.

‘పోరాటాలతో బీజేపీ కార్యకర్తలు గల్లా ఎగరేసుకునేలా చేశాను. కేసీఆర్‌ ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడలేదు. దేశంలో ఏ ఎంపీపైనా లేనన్ని కేసులు నాపై పెట్టినా వెనుకంజ వేయలేదు. ఫాంహౌ్‌సలో ఉన్న కేసీఆర్‌ను గల్లా పట్టి ధర్నా చౌక్‌కు గుంజుకొచ్చాను. నన్ను రెండుసార్లు జైలుకు పంపినా కేసీఆర్‌ గద్దె దిగే వరకు పోరాడాన’ని చెప్పారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ చేసిన మోసాలను, పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ చేసిన ద్రోహాన్ని వివరించాలని, బీజేపీకి ఓటేయించాలని నాయకులు, కార్యకర్తలను కోరారు.

Updated Date - Apr 28 , 2024 | 10:01 AM