Share News

AV Ranganath: మూసీని ఆక్రమిస్తే ప్రాసిక్యూట్‌ చేస్తాం!

ABN , Publish Date - Dec 29 , 2024 | 05:17 AM

‘మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైడ్రాకు సంబంధం లేదు. అదే సమయంలో నది పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలకు పాల్పడే వారిని వదలం.

AV Ranganath: మూసీని ఆక్రమిస్తే ప్రాసిక్యూట్‌ చేస్తాం!

  • నది పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైడ్రాకు సంబంధం లేదు

  • చెరువులు, ప్రభుత్వ స్థలాల కబ్జాదారులనూ వదలం

  • చెరువుల ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ తర్వాత మళ్లీ కూల్చివేతలు

  • వాతావరణ సమాచారం తెలిపేలా ఎఫ్‌ఎం రేడియో

  • హైడ్రా నివేదికను వెల్లడించిన రంగనాథ్‌

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైడ్రాకు సంబంధం లేదు. అదే సమయంలో నది పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలకు పాల్పడే వారిని వదలం. మట్టితో నింపినా.. అక్రమ నిర్మాణాలు చేపట్టినా.. కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్‌ చేస్తాం’ అని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ హెచ్చరించారు. మూసీ వెంట ఇప్పటికే నోటీసులు జారీ చేసిన ఇళ్లకు సంబంధించి కూల్చివేతలను హైడ్రా చేపట్టదని స్పష్టం చేశారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జా వెనుక పెద్ద మాఫియా ఉందని, పేదలను ముందు పెట్టి ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక పోలీ్‌సస్టేషన్‌ ఏర్పాటయ్యాక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైడ్రా ఏర్పాటు అనంతరం సాధించిన విషయాలు, కొత్త సంవత్సరంలో చేయాల్సిన పనులకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ను బుద్ధభవన్‌లోని కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రంగనాథ్‌ వెల్లడించారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఉన్న ప్లాట్లు, నిర్మాణాలకు సంబంధించి సంస్థ ఏర్పాటు అనంతరం ప్రజల్లో అవగాహన వచ్చిందని, వారిని మరింత చైతన్యవంతం చేస్తామన్నారు. రిజిస్ట్రేషన్‌ జరగని, నోటరీ స్థలాలు/భవనాలు, అక్రమ నిర్మాణాలను కొనుగోలు చేయొద్దని సూచించారు.


తమ ప్రాంతంలోని పార్కులు, ఖాళీ స్థలాలు, రహదారుల ఆక్రమణలపై కాలనీ సంఘాలపై అప్రమత్తంగా ఉండాలని, హైడ్రాకు సమాచారమివ్వాలని కోరారు. మున్ముందు ఆక్రమణలు రాకుండా కఠినంగా వ్యవహరిస్తామని, చెరువుల ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ పూర్తయిన అనంతరం కూల్చివేతలు ఉంటాయని స్పష్టం చేశారు. జూలై 19 తర్వాత అనుమతి లేకుండా నిర్మించిన భవనాలపై చర్యలుంటాయన్నారు. అక్రమంగా నిర్మించిన నివాసేతర నిర్మాణాలను కటాఫ్‌ తేదీతో సంబంధం లేకుండా తొలగిస్తామన్నారు. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి దిశానిర్దేశం చేసేలా వ్యవహరిస్తామన్నారు. మెరుగైన విపత్తుల నిర్వహణకు ఖచ్చితమైన వాతావరణ సమాచారం ముందు తెలిసేలా.. అదనపు డాప్లర్‌ వెదర్‌ రాడార్‌ ఏర్పాటు చేయాలన్న వినతికి వాతావరణ శాఖ సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్ల సంఖ్య పెంచాలని కోరామన్నారు. ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నది ముందే తెలుసుకోవడం ద్వారా వరద నీటి నిర్వహణ, ముంపు ఇబ్బందులు తగ్గించే అవకాశముంటుందన్నారు. ఈ సమాచారం ప్రజలకు తెలిపేందుకు ఎఫ్‌ఎం రేడియో చానల్‌ ఏర్పాటు లేదా లీజుకు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.


  • 12 చెరువుల పునరుజ్జీవానికి చర్యలు

జూలై 19, 2023లో హైడ్రా ఏర్పాటు అనంతరం ఇప్పటి వరకు 200 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకున్నట్టు రంగనాథ్‌ వెల్లడించారు. ఇందులో ఎనిమిది పార్కులు, 12 చెరువులు, నాలుగు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయన్నారు. హైడ్రా అంటే కూల్చివేతలు మాత్రమే అనేలా కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆక్రమణదారులు, కబ్జాలకు పాల్పడే వారు ఈ తరహ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఆక్రమణలు తొలగించిన 12 చెరువుల పునరుజ్జీవానికి చర్యలు తీసుకుంటున్నామని, ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్టు చెప్పారు. కొత్త సంవత్సరంలో ప్రతి సోమవారం ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తామని రంగనాథ్‌ తెలిపారు.


మతపరమైన నిర్మాణాలపై..

రోడ్డు, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మతపరమైన నిర్మాణాలు రావడంపై రంగనాథ్‌ స్పందించారు. ఇలాంటి సున్నిత విషయాల్లో సమగ్ర పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకోవాలని, మతపరమైన నిర్మాణాల జోలికి వెళ్లకుండా చుట్టూ ఉన్న ఆక్రమణలు తొలగిస్తామన్నారు. హైడ్రాకు ఇప్పటి వరకు 5800లకుపైగా ఫిర్యాదులు వచ్చాయని, ప్రజలకు కలిగే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. కాలనీ, బస్తీ అసోసియేషన్లు, సామూహికంగా స్థానికులు ఇచ్చే ఫిర్యాదులను మొదట పరిశీలిస్తున్నామన్నారు. విపత్తుల నిర్వహణకు ప్రస్తుతం 30 బృందాలున్నాయని, ఔటర్‌ వరకు సేవలు విస్తరించేలా వీటి సంఖ్య త్వరలో 72కు పెంచనున్నట్టు తెలిపారు. నాగోల్‌లోని విపత్తుల నిర్వహణ శిక్షణ కేంద్రాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. 100 మంది డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి శిక్షణనిచ్చి ట్రాఫిక్‌ నిర్వహణ కోసం కేటాయించామన్నారు. డీఆర్‌ఎ్‌ఫకు చెట్లు కూలాయని 3428, వరద నీరు నిలిచిందని 912, 199 రెస్క్యూ కాల్స్‌, 133 అగ్నిప్రమాదాలతో కలిపి మొత్తం 4684 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్‌ వివరించారు.

Updated Date - Dec 29 , 2024 | 05:17 AM