Share News

Telangana: ఉద్యోగాల్లో వసూళ్ల ‘సోర్సింగ్‌’!

ABN , Publish Date - Apr 12 , 2024 | 09:05 AM

నిరుద్యోగుల(Un Employement) ఆశలను అవకాశంగా మలచుకొని కొన్ని ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు(Out Sourcing Jobs) దందాలకు పాల్పడుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో(Departments) ఏర్పడిన ఖాళీల్లో ప్రభుత్వం నేరుగా నియామకాలు చేపట్టకుండా ఏజెన్సీల మాటున శ్రమ దోపిడీకి తెర తీస్తే.. ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి అక్రమంగా..

Telangana: ఉద్యోగాల్లో వసూళ్ల ‘సోర్సింగ్‌’!
Telangana Jobs

  • నిరుద్యోగుల ఆశలే అవకాశంగా ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల అక్రమ దందా

  • శాఖాధిపతులతో కలిసి వసూళ్లు?

  • నోటిఫికేషన్‌ లేకుండా నియామకాలు

  • భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో.. ఒక్కొక్కరి నుంచి 2 లక్షల వసూలు

  • 11 నెలలకే ఉద్యోగం పోతుండడంతో రోడ్డున పడుతున్న నిరుద్యోగులు

భూపాలపల్లి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగుల(Un Employement) ఆశలను అవకాశంగా మలచుకొని కొన్ని ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు(OutSourcing Jobs) దందాలకు పాల్పడుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో(Departments) ఏర్పడిన ఖాళీల్లో ప్రభుత్వం నేరుగా నియామకాలు చేపట్టకుండా ఏజెన్సీల మాటున శ్రమ దోపిడీకి తెర తీస్తే.. ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి అక్రమంగా డబ్బులు గుంజుతూ వారి జీవితాలతో ఆటలాడుతున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొంతకాలంగా సాగుతున్న ఈ అక్రమ వసూళ్ల పర్వం తాజాగా తారాస్థాయికి చేరింది. శాఖను బట్టి, ఉద్యోగాన్ని బట్టి ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల దాకా ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఏజెన్సీలే కాకుండా ఆయా శాఖలకు చెందిన శాఖాధిపతులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, నేతల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో గత ఏడాది కాలంలో ఇలా 600మందికిపైగా ఔట్‌సోర్సింగ్‌ నియామకాలు దొడ్డిదారిన జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఏజెన్సీల ముసుగులో కొంతమంది నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముడుపులు ముట్టజెప్పి ఇష్టారీతిన నియామకాలు జరిపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టరేట్లు కేంద్రంగా సాగుతున్న ఈ అనైతిక దందాలో కొంత మంది ఉద్యోగులే కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జిల్లా పాలనలో కీలక స్థానంలో ఉన్న ఓ ఉన్నతోద్యోగి పాత్ర ఉందంటున్నారు. ఆ ఉద్యోగి ఏకంగా బినామీ పేరుతో ఓ ఏజెన్పీనే నిర్వహిస్తున్నారనే ఆరోపణన్నాయి. ఏ శాఖల్లో ఖాళీలు ఏర్పడుతున్నాయో ముందుగానే సంబంధిత విభాగాధిపతులు, ఏజెన్సీలకు సమాచారమిస్తూ ఈ వసూళ్ల పర్వంలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా తమ బినామీ ఏజెన్సీల సహాయంతో శాఖాధిపతుల దన్నుతో వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. శాఖాధిపతుల వ్యక్తిగత సహాయకులు కూడా ఈ అక్రమ వసూళ్ల పర్వంలో భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది.

వసూళ్ల దందా సాగుతోందిలా..

భూపాలపల్లి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు, ఆస్పత్రుల్లో సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికపై నియమిస్తున్నారు. ఇందుకుగాను స్థానికంగా నిరుద్యోగులై ఉండి మ్యాన్‌పవర్‌ సప్లై అనుభవం కలిగిన సంస్థలను ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలుగా ఎంప్యానల్‌ చేస్తోంది. ఇలా ఎంప్యానల్‌ అయిన ఏజెన్సీల్లో టెండర్‌ ప్రక్రియ ద్వారా ఎవరు తక్కువ కమిషన్‌ కోట్‌ చేస్తే వారికి.. సిబ్బంది నియామకాల కోసం ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. అయితే ఒకటి రెండు ఖాళీలు ఉన్న శాఖలకు సంబంధించి మాత్రం ఆయా విభాగాధిపతులు నేరుగా భర్తీ చేసుకుంటున్నారు. దీంతో ఈ తరహా నియామకాల్లోనే భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం దక్కించుకుంటే భవిష్యత్తులో ఉద్యోగం పర్మినెంట్‌ అవుతుందని నిరుద్యోగులకు నిర్వాహకులు ఆశ చూపిస్తున్నారు. దీంతో ఏజెన్సీలు అడిగిన సొమ్మును ముట్టజెప్పి నిరుద్యోగులు ఉద్యోగం పొందుతున్నారు. తీరా 11 నెలలకు ఒప్పందం ముగియగానే రూ.లక్షలు ముట్టజెప్పిన నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారు. అటు ఏజెన్సీల కాంట్రాక్టు వ్యవధి కూడా ముగుస్తుండడం, కొత్తగా వచ్చే ఏజెన్సీలు తిరిగి పాతవారిని విధుల్లోకి తీసుకునేందుకు మళ్లీ ముడుపులు కోరడం, లేదంటే రెండు మూడు నెలల పాటు వేతనాలను మినహాయించుకొని ఇవ్వడం చేస్తున్నాయి.

శాఖాధిపతులు నియమించినా..

చాలా శాఖల్లో శాఖాధిపతులే నేరుగా సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికపై నియమించుకొని వారి పేర్లను ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. అయితే ఈ సిబ్బంది తమకు మామూలు చెల్లించలేదనే సాకుతో వివిధ కారణాలు చూపుతూ వారికి ఏజెన్సీ ద్వారా చెల్లించాల్సిన వేతనాలను ఐదారు నెలలపాటు చెల్లించకుండా వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో నిరుద్యోగులు చేసేదేమీలేక ఏజెన్సీలు అడిగిన మొత్తాన్ని సమర్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్య కళాశాలకు అవసరమైన తాత్కాలిక సిబ్బంది నియామకాలలోనూ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి సహా ఆయన అనుచరులుగా చెప్పుకొంటున్న మరికొందరు కూడా ముడుపులు పుచ్చుకొని తమకు అనుకూలంగా ఉన్న ఏజెన్సీలతో బేరసారాలాడుతున్నట్లు తెలిసింది. అయితే ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల పనితీరుపై అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఉల్లంఘనలు, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. భూపాలపల్లి జిల్లాలో మొత్తం 53 ఏజెన్సీలు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, ఇందులో 33 ఏజెన్సీలు ఎంప్యానల్‌లో చోటు దక్కించుకున్నాయి. ఇందులో ఒకటి రెండు మినహా మిగతా ఏజెన్సీలన్నీ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందినవే. నిబంధనల ప్రకారం పొరుగు జిల్లాలకు చెందిన ఏజెన్సీలు వాటికి సంబంధించిన కార్యాలయాలను స్థానికంగా ఏర్పాటు చేయాల్సి ఉండగా అధికారుల అండదండలతో కేవలం కాగితాలపై తప్పుడు చిరునామాలు సృష్టించి ఉద్యోగుల నియామకాలు జరుపుతున్నాయి. ఏజెన్సీలకు సంబంధించి ఎంప్యానల్‌మెంట్‌ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్‌, మెంబర్‌ కన్వీనర్‌గా జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి వ్యవహరిస్తున్నారు. ఏజెన్సీల లావాదేవీలు, వేతనాలు, పీఎఫ్‌ చెల్లింపుల లాంటి కార్యకలాపాలను ఈ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2024 | 09:05 AM