Share News

Phone Tapping: రాధాకిషన్‌ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. వెలుగులోకి మరో దారుణం..!

ABN , Publish Date - Apr 11 , 2024 | 07:15 AM

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో అరెస్టయిన టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు అండ్‌ కో.. కిరాయి గూండాల్లా కిడ్నా్‌పలు, వసూళ్లు చేయించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల్లో ఎంబీఏ పూర్తిచేసి, హైదరాబాద్‌లో ఓ కంపెనీని స్థాపించి.. ఒక్కోమెట్టు పైకెదుగుతున్న వ్యాపారిని అథఃపాతాళానికి తొక్కేశారు. అతణ్ని కిడ్నాప్‌ చేసి..

Phone Tapping: రాధాకిషన్‌ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. వెలుగులోకి మరో దారుణం..!
Phone Tapping

  • కిడ్నాప్‌ టాస్క్‌.. షేర్ల బదిలీకి ఫోర్స్‌

  • వెలుగులోకి రాధాకిషన్‌ అండ్‌ కో దందా

  • హెల్త్‌కేర్‌ సంస్థ యజమాని అపహరణ..

  • టాస్క్‌ఫోర్స్‌ ఆఫీసులో నిర్బంధం

  • స్వయంగా డీజీపీ ఫోన్‌ చేసినా.. తప్పుదోవ పట్టించిన పోలీసులు

  • బెదిరించి, షేర్లు బదిలీ చేయించిన వైనం

  • 2018 నవంబరులో ఘటన

  • మీడియాకు చెబితే చంపేస్తామని బెదిరింపులు

  • ఫోన్‌ ట్యాపింగ్‌ అరెస్టులతో ధైర్యం తెచ్చుకున్న

  • బాధితుడు.. జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు

  • రాధాకిషన్‌, గట్టుమల్లు, ఎస్సై మల్లికార్జున్‌

  • షేర్లు బదిలీ చేయించుకున్న దుండగులపై కేసు

  • ట్యాపింగ్‌పై ఈడీకి హైకోర్టు లాయర్‌ ఫిర్యాదు

  • ముగిసిన రాధాకిషన్‌రావు పోలీసు కస్టడీ

బంజారాహిల్స్‌, ఏప్రిల్‌ 11: ఫోన్‌ట్యాపింగ్‌(Phone Tapping Case) కేసులో అరెస్టయిన టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు అండ్‌ కో.. కిరాయి గూండాల్లా కిడ్నాప్‌లు, వసూళ్లు చేయించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల్లో ఎంబీఏ పూర్తిచేసి, హైదరాబాద్‌లో ఓ కంపెనీని స్థాపించి.. ఒక్కోమెట్టు పైకెదుగుతున్న వ్యాపారిని అథఃపాతాళానికి తొక్కేశారు. అతణ్ని కిడ్నాప్‌ చేసి.. కంపెనీ షేర్లన్నింటినీ బదలాయించి వదిలిపెట్టారు. ఈ వ్యవహారంలో ఏకంగా డీజీపీనే తప్పుదోవపట్టించారు. విషయాన్ని మీడియాకు చెబితే.. చంపేస్తామని బాధితుణ్ని బెదిరించారు. రాధాకిషన్‌ అరెస్టుతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు బుధవారం జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం.. మణికొండకు చెందిన చెన్నుపాటి వేణుమాధవ్‌ విదేశాల్లో ఎంబీఏ పూర్తిచేసి.. 2011లో జూబ్లీహిల్స్‌ రోడ్‌నంబరు 72లో ‘క్రియా హెల్త్‌కేర్‌’ కంపెనీని నెలకొల్పారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్స్‌ సర్వీసుల నిర్వహణ బాధ్యతను ఈ కంపెనీ నిర్వహించేది. ఇంతింతై.. వటుడింతై.. అన్నట్లు కంపెనీ 250 కోట్ల టర్నోవర్‌కు చేరడంతో, వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు గోపాల్‌, రాజ్‌, నవీన్‌, రవి అనే వ్యక్తులను భాగస్వాములుగా చేర్చుకున్నారు. బాలాజీ అనే వ్యక్తిని సీఈవోగా నియమించుకున్నారు. 2018 వరకు అంతా సవ్యంగానే సాగినా.. క్రియా హెల్త్‌కేర్‌ దినదినాభివృద్ధి చెందుతుండడం.. యూపీలోనూ టెండర్లు వేసేందుకు వేణుమాధవ్‌ సిద్ధమవ్వడంతో భాగస్వాములు మొత్తం కంపెనీని కొట్టేయాలని పథకం వేశారు.

వేణుమాధవ్‌ షేర్లను తమకు అమ్మేయాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఏంచేయాలో తెలియక అయోమయంలో ఉన్న వేణుమాధవ్‌.. గోల్డ్‌ఫిష్‌ అడోబ్‌ సంస్థ సీఈవో చంద్రశేఖర్‌ను సంప్రదించారు. ఆయన ఈ సమస్యను పరిష్కరిస్తానని నమ్మబలికి.. వేణుమాధవ్‌ పేరిట ఉన్న నాలుగు లక్షల షేర్లను తన పేరిట తాత్కాలికంగా బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత భాగస్వాముల ఒత్తిడి, బెదిరింపులు పెరగడంతో.. వేణుమాధవ్‌ పోలీసులను ఆశ్రయించారు. 2018 నవంబరు 22న వేణుమాధవ్‌ ఆఫీసు నుంచి తన కార్లో ఇంటికి వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు ద్విచక్రవాహనాలపై ఆయనను వెంబడించారు. గచ్చిబౌలి సమీపంలో బైక్‌లను అడ్డుపెట్టి.. కారును ఆపారు. ఆ వెంటనే కార్లోకి చొరబడ్డారు. వేణుమాధవ్‌ అరిచేందుకు యత్నించగా.. తాము టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమని చెప్పారు. వారిలో అప్పటి టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై మల్లికార్జున్‌తోపాటు.. మరికొందరు సిబ్బంది ఉన్నారు. నేరుగా సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు గదిలో నిర్బంధించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి క్రియా హెల్త్‌కేర్‌ భాగస్వాములు, సీఈవో బాలాజీ, గోల్డ్‌ఫిష్‌ సీఈవో చంద్రశేఖర్‌ అక్కడికి చేరుకున్నారు.

దాంతో.. చంద్రశేఖర్‌ తన భాగస్వాములతో కలిసిపోయాడని, పోలీసుల సాయంతో తనను బెదిరించే ప్రయత్నంలో ఉన్నట్లు అర్థం చేసుకున్నారు. వేణుమాధవ్‌ను భయపెట్టేందుకు ఎస్సై మల్లికార్జున్‌ పక్కగదిలో వేరేకేసులో తీసుకొచ్చిన ఓ వ్యక్తిని తీవ్రంగా హింసిచారు. ‘‘మాటవిని షేర్లను బదిలీ చేయి.. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి’’ అని బెదిరించారు. ఆ తర్వాతి రోజు సాయంత్రం వరకు టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలోనే నిర్బంధించారు. ఆ తర్వాత గట్టుమల్లు, ఎస్సై మల్లికార్జున్‌, మిగతా వారితోపాటు.. వేణుమాధవ్‌ను అప్పటి టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌ దగ్గరకు తీసుకెళ్లారు. రాధాకిషన్‌ కూడా అదే తరహాలో బెదిరించారు. దీంతో బాధితుడు తన మిత్రుడు, లహరీ రిసార్ట్స్‌ ఎండీ సంజయ్‌కి ఫోన్‌లో విషయం చెప్పారు. సంజయ్‌ హుటాహుటిన డీజీపీని కలిసి, పరిస్థితిని వివరించారు. డీజీపీ రాధాకిషన్‌కు ఫోన్‌ చేయగా.. తప్పుడు సమాచారమిచ్చి, ఏమార్చారు. ‘‘వేణుమాధవ్‌ను మనీలాండరింగ్‌, మరికొన్ని కేసుల్లో తీసుకొచ్చాం’’ అని బుకాయించారు. ఆ తర్వాత వేణుమాధవ్‌ ఫోన్‌ను లాక్కొన్నారు. అక్కడికక్కడే వేణుమాధవ్‌ షేర్లను అతని భాగస్వాముల పేరిట బదిలీ చేయించారు. అందుకు ప్రతిఫలంగా రాధాకిషన్‌ అండ్‌ కో.. వేణుమాధవ్‌ భాగస్వాముల నుంచి రూ.10లక్షలు తీసుకున్నారు. ‘‘నిన్ను వదిలేస్తున్నాం. బయటకు వెళ్లాక మీడియాకు గానీ.. ఇంకెవరికైనా విషయం చెబితే చంపేస్తాం’’ అని బెదిరించి పంపారు. ప్రాణభయంతో తాను ఇంత వరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని, తాజాగా ఫోన్‌ ట్యాపింగ్‌లో రాధాకిషన్‌ అరెస్టవ్వడంతో ధైర్యం తెచ్చుకుని, పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు జూబీహిల్స్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఐపీసీలోని సెక్షన్లు 386, 365, 341, 120(బి) ఐపీసీ రెడ్‌విత్‌ 34 కింద కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించినట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులు వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 11 , 2024 | 07:15 AM