Share News

Kavitha: కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్న అధికారులు

ABN , Publish Date - Mar 16 , 2024 | 07:54 AM

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. హైదరాబాద్‌లోని ఆమెను అరెస్టు చేసి ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.

Kavitha: కవితను  రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్న అధికారులు

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam)లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ (KCR) కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు (Arrest) చేసింది. హైదరాబాద్‌లోని ఆమెను అరెస్టు చేసి ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. శనివారం ఉదయం 10:30 గంటలకు కవితను రౌజ్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) ముందు ఈడి అధికారులు హాజరు పరచనున్నారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ కుమార్ (Anil Kumar), న్యాయవాది మొహిత్ రావు ఉన్నారు. కాగా కాసేపటి క్రితమే ఈడీ కార్యాలయంలో కవితకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.

కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితను డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం అనూహ్య పరిణామాల మధ్య ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. లిక్కర్‌ కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌ కోణంలో పీఎంఎల్‌ఏ యాక్ట్‌ ప్రకారం అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఊహించని విధంగా శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన ఈడీ బృందం సుమారు నాలుగు గంటలపాటు కవిత నివాసంలో సోదాలు నిర్వహించిన అనంతరం ఆమెను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. లిక్కర్‌ స్కాం కేసులో తనపై ఎటువంటి చర్యలు చేపట్టవద్దంటూ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో ఉన్నందున.. ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉండదని, ఈడీ బృందం సోదాలు నిర్వహించి ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకుని వెళ్తారని అంతా భావించినా.. అందుకు భిన్నంగా జరిగింది. ఈడీ అధికారులు కవిత నివాసంలోకి ప్రవేశించిన వెంటనే ఆమెతోపాటు ఇంట్లోని సిబ్బంది ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడంతో లోపల ఏం జరుగుతుందనే విషయం బయటకు వచ్చేందుకు కొంత సమయం పట్టింది. కాగా, కవిత అరెస్టును బీఆర్‌ఎస్‌ తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది. అరెస్టును సవాలు చేస్తూ కవిత తరపు న్యాయవాదులు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది.

ఇంట్లోకి ఎవరినీ రానివ్వకుండా..

శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ఈడీ ప్రత్యేక బృందం.. మధ్యాహ్నం 1.30 గంటలకు కవిత ఇంటికి చేరుకుంది. ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ భానుప్రియ మీనా నేతృత్వంలో 12 మంది అధికారుల ప్రత్యేక బృందంలో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. కవితతోపాటు ఇంట్లో ఉన్న సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు.. కేంద్ర బలగాల సహాయంతో గేటు వద్ద పహారా ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న కవిత తరఫు న్యాయవాదులు అక్కడికి వచ్చి.. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారు అడ్డుకున్నారు. కాగా, ఈడీ అధికారుల రాకను ఏమాత్రం ఊహించని కవిత.. ఒకింత షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత తేరుకుని దర్యాప్తు అధికారులకు సహకరించారు. వారి సూచన మేరకు తాను ఉపయోగిస్తున్న రెండు సెల్‌ఫోన్లను అప్పగించారు. ఈడీ బృందం అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సుమారు నాలుగు గంటలపాటు ఈడీ అధికారులు తనిఖీలు, విచారణ నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5.20 నిమిషాలకు కవితను అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో మనీలాండరింగ్‌ కోణంలో పీఎంఎల్‌ఏ యాక్ట్‌ ప్రకారం కవితను అరెస్ట్‌ చేసినట్లు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేందర్‌.. అరెస్ట్‌ ఆర్డర్‌లో పేర్కొన్నారు. ఈసీఐఆర్‌/హెచ్‌ఐయూ -2/14/2022లో మనీలాండరింగ్‌ అభియోగాలపై అరెస్ట్‌ చేస్తున్నట్లు తెలిపారు.

మొత్తం కారణాలు పొందుపరిచిన 14 పేజీలను కవిత భర్త అనిల్‌కుమార్‌కు ఈడీ అధికారులు అందజేశారు. కవిత అరెస్టును ధ్రువీకరిస్తూ ఈడీ సిబ్బంది ఇంటి గేటు వద్దకు వచ్చి చెప్పివెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కవిత అరెస్ట్‌ సమయంలో ఆమె సోదరుడు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు పలువురు బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు ఆమె నివాసంలోనే ఉన్నారు. ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారని కేటీఆర్‌ ఈడీ అధికారుల్ని ప్రశ్నించారు. ఈడీ అధికారిణి భానుప్రియ మీనా తనిఖీలు పూర్తయినట్లు చెప్పారని, ఆ తర్వాత అరెస్ట్‌ చేస్తున్నట్లు చెప్పారని, ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా అరెస్ట్‌ చేస్తే... చట్టప్రకారం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈడీ అధికారుల్ని కేటీఆర్‌ హెచ్చరించారు. ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు అవకాశం లేదంటూనే.. అరెస్టు అని చెప్పడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఈడీ అధికారులు శుక్రవారం వచ్చారని, ఇది సరికాదని అన్నారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా కుటుంబసభ్యులను ఇంట్లోకి రావద్దంటూ హుకుం జారీ చేయడమేంటని అధికారులను ప్రశ్నించారు. పార్టీ నాయకులను, కుటుంబ సభ్యులను ఇంటి లోపలికి రానివ్వకపోవడంతో స్థానిక పోలీసులపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏ మాత్రం హడావిడి లేకుండా..

గతంలో కేంద్ర దర్యాప్తు అధికారులు కవితను విచారించేందుకు వచ్చిన సమయంలో ఆమె ఇంటి వద్ద ఎంతో హడావిడి ఉండేది. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకోవడం, భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసేవారు. కవిత నివాసానికి దారితీసే రోడ్డును చాలా దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసి.. అనుమతి లేని వారి రాకపోకల్ని అడ్డుకునేవారు. కానీ, శుక్రవారం అలాంటి పరిస్థితులు కనిపించలేదు. ఈడీ బృందం కవిత ఇంటికి చేరుకున్నా పోలీసుల హడావిడి కనిపించలేదు. సాయంత్రం అరెస్టుపై ఈడీ ప్రకటన వెలువడ్డ తర్వాత వెస్ట్‌ జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ నేతృత్వంలో ఏసీపీ, కొంత మంది సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కవితను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లే సమయంలో ఎస్కార్ట్‌ సదుపాయం కల్పించారు. శంషాబాద్‌ విమానాశ్రయంలోనూ ముందుజాగ్రత్త చర్యగా కొంత భద్రతా ఏర్పాట్లు చేశారు.

Updated Date - Mar 16 , 2024 | 10:29 AM