TS NEWS: కుల గణనపై బీఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 16 , 2024 | 06:19 PM
తెలంగాణ అసెంబ్లీలో కుల గణనపై ఈరోజు(శుక్రవారం) కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసిందని.. దీనిపై వెంటనే చట్టం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalkar) డిమాండ్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కుల గణనపై ఈరోజు(శుక్రవారం) కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసిందని.. దీనిపై వెంటనే చట్టం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalkar) డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కమలాకర్ మాట్లాడుతూ... 1938 తర్వాత కుల గణన చేస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందన్నారు. స్థానిక సంస్థల ద్వారా బీసీలకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారని గుర్తుచేశారు. కుల గణన చేసి బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని.. ఎప్పుడు ఆచరణలోకి తీసుకువస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
ఇప్పటికే బీహార్ రాష్ట్రం సర్వే పేరుతో కాలయాపన చేసిందన్నారు. 50 శాతం కంటే ఎక్కువ ఉంటే బీసీలకు ఏం చేస్తారని అడిగారు. బడ్జెట్‌లో బీసీలకు బిల్లు పెడతామన్నారు.. కానీ తీర్మానం చేశారని చెప్పారు. తీర్మానం చేస్తే బిల్లు పెట్టినట్లు కాదని అన్నారు. తీర్మానం చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదన్నారు. బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేయకుండా వెంటనే కుల గణన చేయాలని కోరారు. రాష్ట్రంలో బీసీల వాటా తేల్చాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.