Share News

Elections 2024: ఓటెయ్యండి.. బంపరాఫర్ కొట్టేయండి!

ABN , Publish Date - May 12 , 2024 | 10:52 AM

ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటింగ్‌ డే(Voting day)ను నగరవాసి హాలీడేగా భావిస్తున్నాడు. పోలింగ్‌ బూత్‌ మొహమే చూడని వారి కోసం పలు సంస్థలు ఆఫర్లను ప్రకటించాయి.

Elections 2024: ఓటెయ్యండి.. బంపరాఫర్ కొట్టేయండి!

- ఊరెళ్లటానికి టికెట్‌పై ఆఫర్‌ ఇస్తున్న ట్రావెల్‌ యాప్‌లు

- సిటీలో పోలింగ్‌స్టేషన్‌కు ఉచిత రైడ్‌

- ఆస్పత్రిలో ఉచిత కన్సల్టేషన్స్‌

- అమ్యూజ్‌మెంట్‌ పార్కుల్లో డిస్కౌంట్లు

హైదరాబాద్‌ సిటీ: ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటింగ్‌ డే(Voting day)ను నగరవాసి హాలీడేగా భావిస్తున్నాడు. పోలింగ్‌ బూత్‌ మొహమే చూడని వారి కోసం పలు సంస్థలు ఆఫర్లను ప్రకటించాయి. ట్రావెల్‌ మొదలు ఆస్పత్రుల వరకూ, హోటల్స్‌ మొదలు అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ల వరకూ పలు సంస్థలు ఆఫర్లు అందిస్తున్నాయి. పోలింగ్‌కు ఒక్క రోజే ఉండటంతో మరికొన్ని సంస్థలు చివరి నిమిషంలో ఆఫర్లను ప్రకటించనున్నాయి. ఆఫర్ల వెనుక ఆ సంస్థల ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది నిజమే అయినా ఓటింగ్‌ పెంచడం కోసం ఆఫర్లు ప్రకటించాల్సి రావడం దురదృష్టకరమని పరిశీలకులు చెబుతున్నారు. గతంలో ఆఫర్లు అందించినా నగరంలో ఓటింగ్‌ శాతం పెరగలేదని, ఈసారి ఎలా ఉంటుందో చూడాలంటున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి..

సంస్థలు అందిస్తున్న ఆఫర్లు

....................................

డాక్టర్‌ కన్సల్టేషన్‌ ఉచితం..

ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్న వారికి డాక్టర్‌ కన్సల్టేషన్‌ ఉచితంగా అందించడంతో పాటు ల్యాబ్‌ పరీక్షల్లో 50 శాతం రాయితీ ఇస్తామంటోంది ఏఐజీ హాస్పిటల్స్‌. ట్రావెల్‌ కంపెనీల్లా ఆఫర్‌పై ఎలాంటి పరిమితీ లేదు.

ఫుడ్‌పై రాయితీ పొందండి..

దేశవ్యాప్తంగా పలు రెస్టారెంట్స్‌ అసోసియేషన్లు ఓటింగ్‌ పెంచడం కోసం ఆఫర్లను ఇవ్వాల్సిందిగా హోటల్స్‌, రెస్టారెంట్లకు సూచించాయి. స్పందించిన కొన్ని రెస్టారెంట్‌ చైన్స్‌ ఇప్పటికే పలు నగరాల్లో 20 శాతం వరకూ ఆఫర్‌ను అందించాయి. ఇంప్రెసారియో ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ హాస్పిటాలిటీ సంస్థ 20 శాతం రాయితీ అందిస్తామని వెల్లడించింది. ఓటేసిన మార్కు చూపితే టికెట్‌పై మాత్రమే కాకుండా ఫుడ్‌, డ్రింక్స్‌పై రాయితీ అందించనున్నారు.

ఊరెళ్లే వారి కోసం..

ఓటేయడానికి ఇప్పటికే చాలామంది ఊరెళ్లిపోయారు. మరికొంతమంది ఆ ప్రయత్నంలో ఉన్నారు. పలు రాజకీయ పార్టీల నాయకులు ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెడ్‌బస్‌, అభిబస్‌ లాంటి సంస్థలు టికెట్లపై దాదాపు 20 శాతం రాయితీ అందిస్తామని చెబుతున్నాయి.

ఇదికూడా చదవండి: CM Revanth: ఫుట్‌బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి

విమానం టికెట్‌పై రాయితీ

తొలిసారి ఓటేసే యువకులకు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఆఫర్‌ ప్రకటించింది. చదువు కోసం లేదంటే ఉద్యోగం కోసం వేర్వేరు నగరాలకు వెళ్లిన యువత సొంతూరులో ఓటేయడానికి వెళ్లాలనుకుంటే టికెట్లపై 19 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. ఏప్రిల్‌ 19న ఆఫర్‌ ప్రకటించగా సంస్ధ వెబ్‌సైట్‌లో జరుగుతున్న ప్రతి 20 బుకింగ్‌లలో ఒకటి ఫస్ట్‌ టైమ్‌ ఓటర్‌దే కావడం విశేషం! ఓటరు గుర్తింపు కార్డును ఎయిర్‌పోర్ట్‌లోనే చూపాల్సి ఉంటుంది.

పోలింగ్‌ బూత్‌ వద్దకు సవారీ ఫ్రీ..

రాపిడో సంస్ధ హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు నగర ఓటర్లకు పోలింగ్‌స్టేషన్‌ వరకూ బైక్‌ రైడ్‌ను ఉచితంగా అందిస్తుంది. దివ్యాంగులు క్యాబ్‌, ఆటోలను ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఆ రోజు అందిస్తామంటుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి ఆఫర్‌నే ఈ సంస్ధ అందించింది.

ఉదయం ఓటేయండి..

రాత్రికి డైనింగ్‌పై 50శాతం రాయితీ అందుకోండి

డైనింగ్‌ ఔట్‌ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ, ఓటర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. ఓటు వేసిన తరువాత సిరా గుర్తు చూపితే చాలుహైదరాబాద్‌లో కొన్ని ప్రముఖ రెస్టారెంట్‌లలో డైనింగ్‌పై 50శాతం రాయితీ ని తమ డైనవుట్‌ ద్వారా అందిస్తామంటుంది. ఈ రెస్టారెంట్‌లలో అంటేరా కిచెన్‌ అండ్‌ బార్‌, పాపాయ, ఎయిర్‌ లైవ్‌, నోవోటెల్‌, లీ మెరిడియన్‌, రెడ్‌ రైనో, కాఫీ కప్‌ వంటివి ఉన్నాయి.

ఇదికూడా చదవండి: Secunderabad: ప్రయాణ కష్టాలు.. స్వగ్రామాలకు వెళ్లేందుకు పడరానిపాట్లు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 12 , 2024 | 11:06 AM