Share News

Hayathnagar: నాన్నా.. లే నాన్నా.. ఇంటికెళ్దాం!

ABN , Publish Date - May 31 , 2024 | 04:24 AM

పాలప్యాకెట్‌ తెచ్చేందుకు రెండేళ్ల కుమారుడిని బైక్‌ మీద ముందు కూర్చోబెట్టుకొని బయలుదేరిన ఆ వ్యక్తి, మరో నిమిషంలో తిరిగి ఇంటికి చేరేవాడే! అయితే రోడ్డు దాటుతుండగా బైక్‌ను ఓ ఢీకొట్టింది. ఆ వ్యక్తి బైక్‌ నుంచి ఎగిరి పడి.. తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు! మరోచోట పడి గాయపడ్డ ఆ పసివాడు మృతదేహం వద్దకొచ్చి.. ‘నాన్నా.. లే నాన్నా.. ఇంటికెళ్దాం’ అంటూ వచ్చీరాని మాటలత్తో పైకి లేపేందుకు ప్రయత్నించాడు.

Hayathnagar: నాన్నా.. లే నాన్నా.. ఇంటికెళ్దాం!

  • తండ్రి మృతదేహం వద్ద రెండేళ్ల కుమారుడి రోదన

  • బైక్‌ను ఢీకొన్న వ్యాన్‌.. తండ్రి మృతి, బాబుకు గాయాలు

హయత్‌నగర్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): పాలప్యాకెట్‌ తెచ్చేందుకు రెండేళ్ల కుమారుడిని బైక్‌ మీద ముందు కూర్చోబెట్టుకొని బయలుదేరిన ఆ వ్యక్తి, మరో నిమిషంలో తిరిగి ఇంటికి చేరేవాడే! అయితే రోడ్డు దాటుతుండగా బైక్‌ను ఓ ఢీకొట్టింది. ఆ వ్యక్తి బైక్‌ నుంచి ఎగిరి పడి.. తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు! మరోచోట పడి గాయపడ్డ ఆ పసివాడు మృతదేహం వద్దకొచ్చి.. ‘నాన్నా.. లే నాన్నా.. ఇంటికెళ్దాం’ అంటూ వచ్చీరాని మాటలత్తో పైకి లేపేందుకు ప్రయత్నించాడు. ఈ విషాదకరమైన దృశ్యాన్ని చూసి ద్రవించని మనసు ఉంటుందా? తండ్రి చనిపోయాడని తెలియక ఆ చిన్నారి ఏడుస్తుండటాన్ని స్థానికులతో పాటు ఆవైపు వచ్చీపోయే జనం చూసి కన్నీరు పెట్టుకున్నారు. గురువారం ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఇనాంగూడ కమాన్‌ వద్ద ఓ రోడ్డు ప్రమాదం చిమ్మిన విషాదమిది!


ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం అత్తివడులు గ్రామానికి చెందిన షెట్టి కనకప్రసాద్‌ (30), భార్య షెట్టి మౌనిక (22), కుమారుడు శివ (2)తో కలిసి మూడు నెలల క్రితం నగరానికి వలసొచ్చాడు. ఇనాంగూడలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. రెండు నెలల క్రితం కనక ప్రసాద్‌-మౌనిక దంపతులకు మరో బాబు పుట్టాడు. కనక ప్రసాద్‌ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం ఉదయం 7 గంటలకు పాలప్యాకెట్‌ తెచ్చేందుకు కనక ప్రసాద్‌ ఇంట్లోంచి బయటకొచ్చాడు. కుమారుడు శివ వెంటరాగా.. బాబును బైక్‌పై ముందు కూర్చోబెట్టుకొని అబ్దుల్లాపూర్‌మెట్‌ చౌరస్తాకు వచ్చాడు. అక్కడ పాలప్యాకెట్‌ కొని, భార్య కోసం టిఫిన్‌ తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇనాంగూడ కమాన్‌ వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా బైక్‌ను కూకట్‌పల్లి నుంచి చిట్యాలకు అట్ట పెట్టెల లోడుతో వెళుతున్న వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో కనక ప్రసాద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. శివకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భార్య మౌనిక అక్కడికి చేరుకుని భర్త మృతదేహంపై పడి రోదించింది.

Updated Date - May 31 , 2024 | 04:24 AM