Share News

TS News: తెలంగాణ రాజకీయాల్లో హైడ్రామా.. కేసీఆర్‌తో ఆరూరి సమావేశం అనంతరం ఏం జరగబోతుంది..?

ABN , Publish Date - Mar 13 , 2024 | 02:53 PM

తెలంగాణ రాజకీయాల్లో హైడ్రామా నెలకొంది. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కోసం చేజింగ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఆరూరి రమేష్ కేంద్రంగా ఉదయం నుంచి హైడ్రామా నెలకొంది. దీంతో ఆరూరి పార్టీ మార్పుపై దాగుడుమూతలు కొనసాగుతున్నాయి.

TS News: తెలంగాణ రాజకీయాల్లో  హైడ్రామా.. కేసీఆర్‌తో ఆరూరి సమావేశం అనంతరం ఏం జరగబోతుంది..?

హనుమకొండ: తెలంగాణ రాజకీయాల్లో హైడ్రామా నెలకొంది. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కోసం చేజింగ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఆరూరి రమేష్ కేంద్రంగా ఉదయం నుంచి హైడ్రామా నెలకొంది. దీంతో ఆరూరి పార్టీ మార్పుపై దాగుడుమూతలు కొనసాగుతున్నాయి. మొదట బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరాలని ఆరూరి రమేష్ నిర్ణయించుకున్నారు. కానీ ఈ విషయం బీఆర్‌ఎస్ హైకమాండ్‌కు దృష్టికి చేరింది. దీంతో ఆరూరిని తెలంగాణ భవన్‌కు పిలిచి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుజ్జగించారు. ఈ క్రమంలో ఆరూరికి వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో మొత్తబడిన ఆరూరి తాను బీఆర్‌ఎస్‌ను వీడడం లేదని మూడు రోజుల క్రితం ప్రకటించారు. కానీ ఇంతలోనే మళ్లీ మనసు మార్చుకున్నారు. మంగళవారం బీజేపీ అగ్రనేత అమిత్ షాతో ఆరూరి సమావేశమయ్యారు. దీంతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం హనుమకొండలో మీడియా సమావేశం పెట్టి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు ఆరూరి రమేష్ సిద్ధమయ్యారు.


ఈ క్రమంలోనే ప్రెస్‌మీట్‌కు సిద్ధమవుతున్న సమయంలో సడంగా మధ్యలో బీఆర్‌ఎస్ నేతలు ఎంట్రీ ఇచ్చారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు మరికొందరు బీఆర్‌ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. ఆరూరిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఆయనను వెంటబెట్టుకుని ఎర్రబెల్లిదయాకర్ రావు హైదరాబాద్ బయల్దేరారు. హైదరాబాద్ చేరుకున్నాక ఆరూరి రమేష్‌తో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమావేశం కానున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కేసీఆర్‌తో భేటీ ముగిసిన తర్వాత పార్టీ మారతారా లేదా అనే విషయంపై ఆరూరి రమేష్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. దీంతో కేసీఆర్‌తో సమావేశం ముగిసిన తర్వాత ఏం జరగనుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 13 , 2024 | 03:02 PM