Share News

Medical Education: 281 పీజీ మెడికల్‌ సీట్లు పోయినట్లే!

ABN , Publish Date - Dec 28 , 2024 | 06:00 AM

రాష్ట్రంలో వైద్య విద్య కళాశాలల్లో నిర్వహించే పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో మన విద్యార్థులు సీట్లు కోల్పోతున్నారు. ఇలా కోల్పోయే సీట్ల సంఖ్య వందల్లోనే ఉండనుంది.

Medical Education: 281 పీజీ మెడికల్‌ సీట్లు పోయినట్లే!

  • వైద్య విద్యలో ఈ సీట్లు స్థానికేతరులకు?

  • హైకోర్టు ఆదేశాలతో పీజీ తుది మెరిట్‌ జాబితాలో వీరిని చేర్చిన కాళోజీ ఆరోగ్య వర్సిటీ

  • తెలంగాణ విద్యార్థులకు ఆ మేరకు నష్టమే

  • మెడిసిన్‌ పీజీ ప్రవేశాల ప్రక్రియ షురూ

హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్య విద్య కళాశాలల్లో నిర్వహించే పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో మన విద్యార్థులు సీట్లు కోల్పోతున్నారు. ఇలా కోల్పోయే సీట్ల సంఖ్య వందల్లోనే ఉండనుంది. శుక్రవారం కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ వైద్య విద్య పీజీ తుది మెరిట్‌ జాబితాను విడుదల చేసింది. అందులో మొత్తం 3314 మంది అర్హులున్నారని పేర్కొంది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు తుది జాబితాలో 281 మంది విద్యార్థుల పేర్లను చేర్చుతున్నట్లు వెల్లడించింది. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారైనప్పటికీ తెలంగాణలోనే ఎంబీబీఎస్‌ చదవడం వల్ల జాబితాలో వారి పేర్లు చేర్చారు. అంటే తెలంగాణ స్థానికత లేకపోయినప్పటికీ. వారికి ఇక్కడ సీట్లివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన వారినీ స్థానిక కోటా కింద పరిగణించాలని హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది.


ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎంబీబీఎ్‌సతో పాటు పాఠశాల విద్య కూడా రాష్ట్రంలోనే చదివి ఉండాలి. కానీ, ఆలిండియా, యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద తెలంగాణలో పెద్దసంఖ్యలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ చేశారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో ఎంబీబీఎస్‌ చేసి, తమకు పీజీ ప్రవేశాల్లో అవకాశం కల్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విద్యా సంవత్సరానికి వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీంతో వారంతా స్థానికులయ్యారు. ఆరోగ్య వర్సిటీ జాబితా ప్రకారం 281 మంది ఉండగా.. ఆ మేరకు రాష్ట్ర విద్యార్థులు సీట్లు కోల్పోతారని వైద్యవిద్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో సుమారు 2886 పీజీ సీట్లున్నాయి.


పీజీ ప్రవేశాల ప్రక్రియ షురూ

స్థానికతపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పీజీ వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియను కాళోజీ హెల్త్‌ వర్సిటీ ప్రారంభించింది. పీజీ తుది మెరిట్‌ జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే శనివారం సాయంత్రం 4 గంటలోగా తెలపాలని ఆరోగ్య వర్సిటీ కోరింది. 3314 మందితో కూడిన మెరిట్‌ జాబితాను వర్సిటీ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. తుది జాబితాలో ఉన్నవారే కౌన్సెలింగ్‌కు అర్హులవుతారు. మరోవైపు తెలంగాణలో ఎంబీబీఎస్‌ చదవకుండా పీజీ కోసం దరఖాస్తు చేసిన 34 మంది అభ్యర్థులను వర్సిటీ అనర్హులుగా ప్రకటించింది. వారి వివరాలను కూడా వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అలాగే పీజీ ఆయుష్‌ కోర్సులకు సంబంధించిన ప్రొవిజనల్‌ ఫైనల్‌ మెరిట్‌ జాబితాను కూడా విడుదల చేసింది. కన్వీనర్‌ కోటాలోని ఎండీ ఆయుర్వేద, ఎండీ హోమియో, ఎండీ యునానీ ప్రవేశాలకు సంబంఽధించిన అభ్యర్థుల మెరిట్‌ జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టింది.

Updated Date - Dec 28 , 2024 | 06:00 AM