GHMC: కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ వంతెనలు,అండర్‌పాస్‌లు
ABN , Publish Date - Dec 28 , 2024 | 05:50 AM
కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఆరు జంక్షన్లలో ఆరు స్టీల్ వంతెనలు, ఆరు అండర్‌పా్‌సలు నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది.

వేగంగా పూర్తి చేసేందుకు స్టీల్‌తో నిర్మాణం
1090 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం
వచ్చే వారం టెండర్లకు జీహెచ్‌ఎంసీ సిద్ధం
303 ఆస్తుల సేకరణకు మార్కింగ్.. వాటిలో బాలకృష్ణ, చిరంజీవి, జానారెడ్డి ఇళ్లు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఆరు జంక్షన్లలో ఆరు స్టీల్ వంతెనలు, ఆరు అండర్‌పా్‌సలు నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. ఇందుకోసం రోడ్ నంబర్ 12 ప్రారంభమయ్యే విరించి ఆసుపత్రి నుంచి ఒమేగా ఆసుపత్రి, బాలకృష్ణ ఇల్లు మీదుగా జూబ్లీ హిల్స్ చెక్‌పోస్టు వరకు ఆరున్నర కిలోమీటర్ల పొడవున రోడ్డును విస్తరించనున్నారు. విరించి ఆసుపత్రి నుంచి బీఆర్‌ఎస్ భవన్ కూడలి వరకు 100 అడుగుల మేర విస్తరిస్తారు. అక్కడి నుంచి చెక్‌పోస్ట్ వరకు 120 అడుగుల మేర విస్తరిస్తారు. చెక్‌పోస్ట్ వద్ద మెట్రో రైల్‌కు ఇబ్బంది కలగకుండా చూడటానికి ఏకంగా 150 అడుగుల మేర విస్తరిస్తారు. విస్తరణకు సంబంధించి ఇప్పటికే 303 ఆస్తులను మార్కింగ్ చేశారు.
తొలిదశలో 97 ఆస్తులకు సంబంధించి సర్వేను పూర్తి చేసి, భూసేకరణ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆరు జంక్షన్లలో వంతెనలు, అండర్‌పా్‌సల నిర్మాణానికి రూ.1090 కోట్లు అవుతాయని అంచనా వేశారు. మొదటి ప్యాకేజీలో కేబీఆర్ పార్కు, జూబ్లీచెక్ పోస్టు జంక్షన్ల వద్ద రూ.580 కోట్లతో, ప్యాకేజీ-2లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-45, ఫిల్మ్‌నగర్, అగ్రసేన్, కేన్సర్ ఆస్పత్రి జంక్షన్ల వద్ద రూ.510 కోట్లతో గ్రేడ్ సెపరేటర్లుగా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తారు. వచ్చే వారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఇంజనీరింగ్ విభాగం సిద్ధమవుతుంది. 15 రోజుల గడువుతో బిడ్‌లను ఆహ్వానిస్తారు. ఏజెన్సీలు ముందుకు వస్తే సాంకేతిక, ప్రైస్ బిడ్‌లు పరిశీలిస్తారు. రాకపోతే మరో దఫా టెండర్ ఉంటుంది. అన్ని విభాగాల ఆమోదం తర్వాత ఒప్పందం కుదుర్చుకుంటారు. హెచ్-సిటీలో భాగంగా రూ.7032 కోట్లతో వివిధ ప్రాంతాల్లో వంతెనల నిర్మాణం, రహదారుల విస్తరణ పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హెచ్-సిటీ మొదటి దశలో రూ.3446 కోట్ల పనులు చేపడతారు.
ప్రముఖుల ఆస్తులు
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎ్‌సఆర్‌డీపీ)లో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ వంతెనలు, అండర్‌పా్‌సలు నిర్మిస్తున్నారు. ఇది గత ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టు. వందల చెట్లు తొలగించాల్సి ఉంటుందని పర్యావరణ ప్రేమికులు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో బ్రేక్ పడింది. దాంతో పార్క్‌ను ముట్టుకోకుండా రెండో వైపు ఉండే ఆస్తులను సేకరించాలని నిర్ణయించారు. రహదారి విస్తరణలో పలువురు ప్రముఖుల ఆస్తులు సేకరించనున్నారు. మాజీ మంత్రి జానారెడ్డి, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, అపోలో చౌరస్తా వద్ద ఉన్న చిరంజీవి పాత ఇల్లు, భవ్య సంస్థలకు చెందిన భవనం, రోడ్ నెంబర్ 45 చౌరస్తా వద్ద ప్రముఖ నటుడు బాలకృష్ణ నివాసం విస్తరణతో ప్రభావితం కానున్నాయి. విరించి నుంచి బీఆర్‌ఎస్ ఆఫీస్ జంక్షన్ వరకు రోడ్ నంబరు 12లో ప్రస్తుతం 50-60 అడుగుల మేర రహదారి ఉంది.
దీనిని 100 అడుగులకు విస్తరిస్తారు. అక్కడి నుంచి చెక్‌పోస్టు వరకు ప్రస్తుతం 80-100 అడుగులు ఉంది. దాన్ని 120 అడుగులకు విస్తరిస్తారు. ఖాళీ స్థలాలున్న వారు విస్తరణకు సానుకూలంగా స్పందిస్తున్నారు. భవనాలున్న వారు ముందుకు రాలేదు. దీంతో చట్ట ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసి, ప్రజాభిప్రాయ సేకరణతో సేకరిస్తారు. కనీసం ఆరు నెలలు పడుతుందని అంచనా. ఎవరైనా కోర్టుకు వెళితే మరింత ఆలస్యమవుతుంది. అత్యంత రద్దీగా ఉండే ఈ రోడ్ల మీద సిమెంట్ నిర్మాణాలయితే ఎంత వేగంగా చేసినా రెండేళ్లకు పైగా పడుతుంది. నిర్మాణ కార్యక్రమాలకు చోటు కూడా లేదు. ట్రాఫిక్‌ను పూర్తిగా బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అందుకే, స్టీల్ వంతెనల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దాంతో ఏడాదిన్నరలోపే పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. మొదట రూ.826 కోట్లతో ఆరు జంక్షన్లను ప్రతిపాదించారు. స్టీల్ వంతెనల వల్ల అంచనా వ్యయం 31 శాతం పెరిగి రూ.1090 కోట్లు అయ్యింది.