Fraud: వైట్‌హౌస్ ఉద్యోగి మావాడే.. సీటు గ్యారెంటీ!
ABN , Publish Date - Jul 28 , 2024 | 04:58 AM
విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విదేశీ విద్యపై ఉన్న మోజును ఉపయోగించుకుని హైదరాబాద్‌కు చెందిన ఓ ఆలుమగలు రూ.కోట్లు కొట్టేశారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో పని చేసే ఉద్యోగి తమకు తెలుసుని, అ కోరుకున్న విశ్వవిద్యాలయంలో అతని ద్వారా సీటు ఇప్పిస్తామని చెప్పి ఓ వ్యక్తికి రూ.3.25 కోట్లకు టోకరా వేశారు.

అమెరికా వర్సిటీలో సీటు పేరిట 3.25 కోట్ల మోసం
హైదరాబాద్‌కు చెందిన దంపతుల అరెస్టు
హైదరాబాద్ సిటీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విదేశీ విద్యపై ఉన్న మోజును ఉపయోగించుకుని హైదరాబాద్‌కు చెందిన ఓ ఆలుమగలు రూ.కోట్లు కొట్టేశారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో పని చేసే ఉద్యోగి తమకు తెలుసుని, అ కోరుకున్న విశ్వవిద్యాలయంలో అతని ద్వారా సీటు ఇప్పిస్తామని చెప్పి ఓ వ్యక్తికి రూ.3.25 కోట్లకు టోకరా వేశారు. చివరికి మోసం బయటపడడంతో కటకటాల పాలయ్యారు. సైబరాబాద్ ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) డీసీపీ కే ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన పాలడుగు రఘురామ్, సునీత దంపతులు అమెరికాలోని వర్సిటీల్లో సీట్లు ఇప్పిస్తామని ప్రచారం చేసుకున్నారు.
వైట్ హౌస్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న సుమంత్ అనే వ్యక్తితో తమకు పరిచయం ఉందని, ఏ వర్సిటీలో కావాలంటే ఆ వర్సిటీలో సీటు ఇప్పిస్తామని నమ్మబలికారు. వీరి మాటలు నమ్మిన చాట్ల సంజీవ్ కుమార్ తన కుమారుడికి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ సీటు ఇప్పించాలని సంప్రదించాడు. సీటుపై భరోసా ఇచ్చిన రఘురామ్ దంపతులు ఫీజుల పేరిట సంజీవ్ నుంచి రూ.3.25 కోట్లు వసూలు చేసి నకిలీ పత్రాలు ఇచ్చారు. అంతేకాక, ఓ కొత్త నెంబర్ ద్వారా అమెరికాలో ఉంటున్న సుమంత్ పేరిట సంజీవ్ కుమార్‌తో వాట్సా్‌పలో చాటింగ్ చేసేవారు.
తాము కూడా సుమంత్‌తో వాట్సా్‌పలో మాట్లాడుతున్నామని సంజీవ్‌కు వాట్సాప్ చాటింగ్‌లు చూపేవారు. ఈ క్రమంలో సీటు విషయమై సుమంత్‌తో స్వయంగా మాట్లాడేందుకు సంజీవ్ అమెరికా వెళ్లాడు. విషయం తెలుసుకున్న రఘురామ్ దంపతులు తాము కూడా అమెరికా వస్తున్నామంటూ సంజీవ్‌కు చెప్పి మైసూరు వెళ్లారు. పని ఒత్తిడి వల్ల సుమంత్ కలవలేకపోతున్నాడని సంజీవ్‌కు చెప్పి ముఖం చాటేశారు. అనంతరం తన వద్ద ఉన్నవి నకిలీ పత్రాలని తెలుసుకున్న సంజీవ్ మోసపోయానని తెలుసుకుని స్వదేశానికి వచ్చి పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు రఘురామ్ దంపతులను అరెస్టు చేశారు.