Share News

Greenfield Expressway: గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేకు నిరసన రంగు!

ABN , Publish Date - Jul 18 , 2024 | 04:03 AM

నాగపూర్‌-విజయవాడ గ్రీన్‌ ఫీల్డ్‌ ఫోర్‌లైన్‌ కంట్రోల్డ్‌ యాక్సెస్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి భూములిచ్చేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. తమవి ఏడాదికి రెండు పంటలు పండే నల్లరేగడి భూములని, భూములిచ్చేస్తే తమ బతుకుదెరువు ఏం కావాలి?

Greenfield Expressway: గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేకు నిరసన రంగు!

  • నాగపూర్‌-విజయవాడ హైవేకు భూములిచ్చేది లేదు

  • అలైన్‌మెంట్‌ మార్చండి.. లేదంటే మార్కెట్‌ ధర ఇవ్వండి

  • రైతుల డిమాండ్‌.. భూపాలపల్లిలో సర్వే పనుల అడ్డగింత

భూపాలపల్లి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): నాగపూర్‌-విజయవాడ గ్రీన్‌ ఫీల్డ్‌ ఫోర్‌లైన్‌ కంట్రోల్డ్‌ యాక్సెస్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి భూములిచ్చేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. తమవి ఏడాదికి రెండు పంటలు పండే నల్లరేగడి భూములని, భూములిచ్చేస్తే తమ బతుకుదెరువు ఏం కావాలి? అని ప్రశ్నిస్తున్నారు. ఎలైన్‌మెంట్‌ను మార్చాలని కొందరు డిమాండ్‌ చేస్తుంటే.. మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లిస్తే భూములిచ్చేందుకు అభ్యంతరం లేదని ఇంకొందరు చెబుతున్నారు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లో మొత్తం 14 గ్రామాల్లోని 200 మంది రైతులకు చెందిన 130 హెక్టార్ల భూసేకరణకు అధికారులు సర్వేకు ప్రయత్నించగా రైతులు అడ్డు తగులుతున్నారు.


భారత్‌ మాల పరియోజన పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఈ గ్రీన్‌ ఫీల్డ్‌, బ్రౌన్‌ ఫీల్డ్‌ హైవేను హైబ్రీడ్‌ యాన్యుటీ మోడల్‌(హామ్‌)లో నిర్మించనున్నారు. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం నర్వ నుంచి మహబూబాబాద్‌ జిల్లా వెన్నారం వరకు 216.57 కిలోమీటర్ల నిడివిలో గ్రీన్‌ఫీల్డ్‌ ఫోర్‌ లైన్‌ రోడ్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ అదికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. మంచిర్యాల నుంచి ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం వరకు మొత్తం 1,157 హెక్టార్ల భూమి అవసరమవుతుందని నిర్ధారించారు. మంచిర్యాల నుంచి వరంగల్‌ వరకు మొత్తం 108.34. కిలోమీటర్ల నిడివికి గానూ 589 హెక్టార్లు అవసరమవుతుండగా ఆ భూమిని సేకరించేందుకు అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చి సంబంధిత భూ యజమానులైన రైతులకు నోటీసులు జారీ చేశారు.


భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లోని రైతులు భూములిచ్చేది లేదని చెబుతున్నారు. ‘పెద్దంపల్లిలో నాకు 1.20 ఎకరాలుంది. ఇందులోంచి 18 గుంటలు ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కోసం తీసుకుంటోంది. వ్యవసాయం తప్ప వేరే జీవనాధారం లేని మేం ఉన్న భూమి కాస్తా పోతే ఎట్లా బతికేది? ప్రభుత్వం ఎకరానికి రూ.4.20 ధర కల్పిస్తామనడం చాలా భాదకరం. మార్కెట్‌ ధరకు అదనంగా 10 శాతం కలిపి పరిహారం ఇవ్వాలి. లేదంటే అంతే భూమి మరో చోటైనా ఇప్పిస్తే ఈ భూమి ఇచ్చేస్తా’ అని పెద్దంపల్లికి చెందిన శాస్త్రాల కిరణ్‌ పేర్కొన్నారు.


20.jpg

మార్కెట్‌ ధర కల్పిస్తేనే భూమిస్తా

నాకు ఆశిరెడ్డిపల్లిలో 3.20 ఎకరాల సాగు భూమి ఉంది. గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో రెండెకరాలు పోతోంది. ప్రభుత్వం ఎకరానికి రూ.4.20 లక్షలు ఇస్తా అంటోంది. రెండెకరాల్లో 2 పంటలు పండిస్తే రూ.2లక్షల వరకు లాభమొస్తది. అలాంది నేను రూ.4లక్షలకు భూమిని ఎట్లా ఇయ్యాలే. మార్కెట్‌ ధర ఎకరానికి రూ.30లక్షల వరకు ఉంది. దానికి అనుగుణంగా ధర కల్పిస్తేనే ప్రభుత్వానికి భూమిచ్చేస్తా.

-బండారి మల్లయ్య, ఆశిరెడ్డిపల్లి


అర్బిట్రేషన్‌ కోరుతూ కేసు ఫైల్‌ చేయలేదు

గ్రీన్‌ పీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల్లో ఎవ్వరూ అర్బిట్రేషన్‌ కోరుతూ మా వద్ద ఎలాంటి కేసు ఫైల్‌ చేయలేదు. ప్రభుత్వం ఇస్తున్న పరిహారం సరిపోకపోతే కలెక్టర్‌ వద్ద కేసు ఫైల్‌ చేస్తే విచారణ చేసి పరిహారం పెంచే ప్రయత్నం చేస్తాం. అప్పటికీ మేం పెంచే పరిహారం భూనిర్వాసితులకు సరిపోకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూసేకరణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సంబంధిత అధికారులతో ఈ నెల 15న సమీక్ష నిర్వహిస్తున్నాం.

-భవేశ్‌ మిశ్రా, జయశంకర్‌భూపాలపల్లి కలెక్టర్‌

Updated Date - Jul 18 , 2024 | 04:03 AM