Share News

TS News: త్వరలో ఎస్ఎల్‌బీసీ సొరంగం తవ్వకం

ABN , Publish Date - May 15 , 2024 | 03:28 AM

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం త వ్వకం పనులను పునఃప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెలాఖరు

  TS News: త్వరలో ఎస్ఎల్‌బీసీ సొరంగం తవ్వకం
NLG-Water

నెలాఖరున పునఃప్రారంభిస్తామన్న నిర్మాణ సంస్థ

శ్రీశైలం వైపు నుంచి సీపేజీ కట్టడికి చర్యలు ముమ్మరం

నవంబరులో రెండు వైపులా ఏకకాలంలో టన్నెలింగ్‌

ప్రాజెక్టు పనుల కోసం ఇప్పటికే 50 కోట్లు విడుదల

త్వరలో సవరణ అంచనాలకు ప్రభుత్వ ఆమోదం

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం త వ్వకం పనులను పునఃప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెలాఖరు నుంచి టన్నెల్‌ తవ్వకం చేపట్టనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. తవ్వకానికి ప్రతిబంధకంగా ఉన్న సీపేజీ కట్టడికి జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎ్‌సఐ) సహకారంతో పనులు చేపడుతున్నారు. సీపేజీ కొంత దూరం దాకా ఉంటుందని గుర్తించి, దానిని కట్టడి చేసే పనులు ప్రస్తుతం పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. సీపేజీ కట్టడి పూర్తికాగానే ఇన్‌లెట్‌ (శ్రీశైలం జలాశయం వైపు) నుంచి టన్నెల్‌ తవ్వకం చేపడతామని నీటిపారుదల అధికారులకు నిర్మాణ సంస్థ సమాచారం ఇచ్చింది. ఇక టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌లో బేరింగులు పాడైపోవడంతో కొత్త బేరింగులు తెప్పించారు. వీటిని బిగింపు పూర్తయ్యాక నవంబరులో ఔట్‌లెట్‌ వైపు (మన్నెవారిపల్లి-అచ్చంపేట) నుంచి టన్నెల్‌ తవ్వకం చేపట్టనున్నారు. మరోవైపు సీపేజీతోపాటు బేరింగ్‌ల కోసం నిర్మాణ సంస్థకు రూ.50 కోట్ల నిధులను ప్రభుత్వం ఇదివరకే విడుదల చేసింది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈఎన్‌సీ (జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. చేసిన ప్రతిపాదన మేరకు ఈ నిధులను విడుదల చేశారు. దీంతోపాటు ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను రూ.3150 కోట్ల నుంచి రూ.4468 కోట్లకు సవరించాలని ప్రభుత్వానికి కమిటీ ప్రతిపాదించిన విష యం తెలిసిందే. ఈ సవరణ ప్రతిపాదనలకు ప్రభుత్వం త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. కాగా, రెండువైపులా నవంబరు నుంచి టన్నెల్‌ తవ్వకం ప్రారంభిస్తే.. నెలకు 300 మీటర్ల చొప్పున 33 నెలల్లో టన్నెల్‌ పూర్తి చేయగలమని నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి సంకేతాలిచ్చింది. అనుకున్నవిధంగా ఈ ప్రాజెక్టు పూర్తయి.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు 516 ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు తాగునీరు గ్రావిటీతో చేరనుంది.

Updated Date - May 15 , 2024 | 09:09 AM