Share News

Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ స్మగ్లర్లు, వాడకందారుల అరెస్టు

ABN , Publish Date - Jan 01 , 2024 | 08:43 AM

ఉన్నత చదువు కోసం వెళ్లి అలవాటుపడిన వారొకరైతే.. కొత్త సంవత్సరాన్ని మత్తుగా ఆహ్వానించాలనుకున్నవారు మరొకరు..! కూలీకి వచ్చి దందా సాగిస్తున్నవారు ఇంకొందరు.. మొత్తం నాలుగు వేర్వేరు ఘటనల్లో హైదరాబాద్‌లో పలువురు డగ్ర్స్‌ విక్రేతలు, వాడకందారులు పోలీసులకు పట్టుబడ్డారు.

Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ స్మగ్లర్లు, వాడకందారుల అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, రాజేంద్రనగర్‌, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ఉన్నత చదువు కోసం వెళ్లి అలవాటుపడిన వారొకరైతే.. కొత్త సంవత్సరాన్ని మత్తుగా ఆహ్వానించాలనుకున్నవారు మరొకరు..! కూలీకి వచ్చి దందా సాగిస్తున్నవారు ఇంకొందరు.. మొత్తం నాలుగు వేర్వేరు ఘటనల్లో హైదరాబాద్‌లో పలువురు డగ్ర్స్‌ విక్రేతలు, వాడకందారులు పోలీసులకు పట్టుబడ్డారు. ఇందులో పెద్దగా చదువుకోని కూలీలు.. ఉజ్వల భవిష్యత్‌ ఉన్న యువత.. మంచి ఉద్యోగం చేస్తున్న యువతి ఉండడం గమనార్హం. అయితే, పోలీసులు వీరి ఆటకట్టించారు. కొత్త ఏడాది వేడుకలను పబ్‌లు, క్లబ్‌లు, రేవ్‌ పార్టీల్లో ‘మత్తు’గా జరుపుకోవాలనేవారికి సరఫరాదారులుగా మారినవారిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో డిసెంబరు చివరి వారం నుంచే న్యూ ఇయర్‌ జోష్‌ మొదలైంది. దీనికోసం డ్రగ్స్‌, గంజాయి స్మగ్లర్లు పలువరు తమ వినియోగదారులను కలుసుకొన్నారు. కొన్ని రోజుల కిందటే ఈవెంట్ల నిర్వాహకులు, స్మగ్లర్లు మాదకద్రవ్యాలను దిగుమతి చేసుకునే పనిలో పడ్డారు. సమాచారం తెలిసి వారం రోజులుగా విక్రయ ముఠాలను పట్టుకోవడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆదివారం ఒక్క రోజే హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ల పరిఽధిలో పలు ముఠాల ఆటకట్టించారు.


పంజాబ్‌ వెళ్లి.. డ్రగ్స్‌కు అలవాటై

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సూరెలీలా నవీన్‌సాయి 2019లో పంజాబ్‌లో బీటెక్‌ చేస్తుండగా స్నేహితుల ద్వారా డ్రగ్స్‌ అలవాటయ్యాయి. వీటికోసం మనీవ్యూ, జస్ట్‌ మనీ, ధని, ట్రూ బ్యాలెన్స్‌, పేటీఎం పోస్టు పెయిడ్‌ వంటి యాప్స్‌లో రుణాలు తీసుకున్నాడు. తిరిగి చెల్లించకపోవడంతో యాప్‌ నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. దీంతో తన వ్యసనం తీరేందుకు, సులభంగా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్‌ అమ్మకమే మార్గమని భావించాడు. గుంటూరుకు చెందిన స్నేహితుడు వీర సాయితేజను కలుపుకొన్నాడు. తమకు విక్రయించే వ్యక్తి ద్వారా ఢిల్లీలోని డ్రగ్‌ పెడ్లర్‌ కాంటాక్టు సంపాదించారు. అక్కడినుంచి తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నారు. న్యూ ఇయర్‌ వేడుకలకు డ్రగ్స్‌ డిమాండ్‌ ఉండటంతో డిసెంబరు 12వ తేదీన రూ.7.50 లక్షల విలువైన ఎండీఎంఏ, కొకైన్‌, బ్రౌన్‌ షుగర్‌ కొన్నారు. ఎండీఏంఏ గ్రాము రూ.2 వేలకు కొని రూ.6-8 వేలకు, కొకైన్‌ గ్రాము రూ.10 వేలకు కొని రూ.17వేలకు, బ్రౌన్‌ షుగర్‌ రూ.5 వేల చొప్పున కొని రూ. 10 వేలకు విక్రయిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని టానిక్‌ లిక్కర్‌ మార్ట్‌ వద్ద కస్టమర్స్‌ కోసం వేచి ఉన్న నవీన్‌సాయి, వీర సాయితేజను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. 100గ్రాముల ఎండీఎంఏ, 11.6గ్రాముల బ్రౌన్‌షుగర్‌, 2గ్రాము ల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.7.50లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు.

డ్రగ్స్‌తో మహిళా ఇంజనీర్‌ ‘విల్లా’సం

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ భవానీ కాలనీ కెన్వర్త్‌ విల్లా్‌సలో నివాసం ఉండే సంధ్య (26) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అదే ప్రాంతానికి చెందిన స్నేహితులు డేవిడ్‌(23), అర్జున్‌ (25)తో కలిసి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బెంగుళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ను తెప్పించుకున్నారు. విషయం తెలిసిన బాలానగర్‌ ఎస్‌వోటీ, రాజేంద్రనగర్‌ పోలీసులతో కలిసి.. సంధ్య నివాసంలో దాడులు నిర్వహించారు. ఆమె నుంచి 8 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.86వేలు ఉంటుందని రాజేంద్రనగర్‌ ఎస్‌ఐ రమేశ్‌ తెలిపారు. డేవిడ్‌, అర్జున్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

100 గ్రాముల గంజాయి రూ.1000

సూర్యాపేటకు చెందిన కానుకుర్తి సాయినవీన్‌ అలియాస్‌ నవీన్‌, చెట్ల వంశీ కూలీలు. కొన్నేళ్లుగా గంజాయి అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా గంజాయికి మంచి డిమాండ్‌ ఉందని తెలిసి విక్రయించడానికి వచ్చారు. హబ్సిగూడలో వీరిద్దరూ 100 గ్రాముల ప్యాకెట్‌ రూ.1000 చొప్పున అమ్ముతుండగా సౌత్‌ఈ్‌స్ట జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, ఓయూ పోలీసులు పట్టుకున్నారు. 2.6 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నవీన్‌పై 6, వంశీపై 3 గంజాయి విక్రయం కేసులున్నాయి.

రాజస్థాన్‌ నుంచి నగరానికి హెరాయిన్‌

కూలీ పనులకు హైదరాబాద్‌ వచ్చిన వ్యక్తి డ్రగ్స్‌ దందాకు తెరతీసిన వైనం ఇది. ఉత్తరప్రదేశ్‌ సుల్తాన్‌పూర్‌కు చెందిన ఉమేష్‌ తివారి (35) హైదరాబాద్‌లోని ఫతేనగర్‌ పైప్‌లైన్‌ రోడ్‌లో ఉంటూ, రాజస్థాన్‌ జాలోర్‌కు చెందిన సురేష్‌ దివాసీ (26), సంచోర్‌ వాసి రౌలా రామ్‌ (22)లు కూకట్‌పల్లిలో ఉంటూ స్టీల్‌ రెయిలింగ్‌ పనులు చేస్తున్నారు. ముగ్గురూ డ్రగ్స్‌కు అలవాటుపడ్డారు. జాలోర్‌కు చెందిన డ్రగ్స్‌ విక్రేతలతో పరిచయం పెంచుకుని అక్కడ కొన్న హెరాయిన్‌ను వీరు తీసుకుంటూ, విక్రయిస్తున్నారు. వీరి దందాపై పక్కా సమాచారమందుకున్న ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు వలపన్ని అరెస్టు చేశారు. 15 గ్రాముల హెరాయిన్‌. 3 సెల్‌ఫోన్లు, బైక్‌, రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jan 01 , 2024 | 10:43 AM