Share News

PM Modi: అవినీతిపరులను వదలం.. భరతం పడతాం!

ABN , Publish Date - Mar 17 , 2024 | 04:14 AM

ప్రధాని నరేంద్రమోదీ మరోసారి కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సపై విమర్శనాస్త్రాలు సంధించారు.

PM Modi: అవినీతిపరులను వదలం.. భరతం పడతాం!

  • వారి భరతం పట్టి.. ప్రజాధనాన్ని కక్కిస్తాం

  • ఇందుకు తెలంగాణ ప్రజల మద్దతు కావాలి

  • కాంగ్రెస్‌ది 2జీ, బీఆర్‌ఎస్‌ది ప్రాజెక్టుల స్కాం

  • కేంద్రంలో మేం మళ్లీ వస్తే ఇక్కడ కాంగ్రెస్‌ను

  • ఇష్టారాజ్యంగా వ్యవహరించనివ్వం

  • తెలంగాణ కలలను బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌

  • చిదిమేశాయి.. రాష్ట్రం నలిగిపోతోంది

  • అవినీతిని ఇతర రాష్ట్రాలకు విస్తరించాయి

  • దళిత డిప్యూటీ సీఎంను అవమానిస్తున్నారు

  • నాగర్‌కర్నూల్‌ సభలో ప్రధాని మోదీ

నాగర్‌కర్నూల్‌/మహబూబ్‌నగర్‌/హైదరాబాద్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) మరోసారి కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ రెండూ కుటుంబ పార్టీలు అని, కుటుంబ పాలనలో అవినీతి భాగస్వామ్యం బలంగా ఉంటుందని అన్నారు. 70 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌, పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌ ఆర్థిక విధ్వంసం సృష్టించాయని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ 2జీ కుంభకోణం చేస్తే.. ఇక్కడ బీఆర్‌ఎస్‌ సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడిందన్నారు. రెండు పార్టీలు అక్రమ దందాలకు, భూ మాఫియాకు మద్దతిస్తున్నాయని ధ్వజమెత్తారు. వీరి అక్రమాలు రాష్ట్ర సరిహద్దులు కూడా దాటుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్‌ ఇతర రాష్ట్రాలకు వెళ్లి అత్యంత అవినీతిమయమైన పార్టీలతో కలిసిందని, ఆ నిజాలు ఇప్పుడు బయటికొస్తున్నాయని చెప్పారు. అవినీతిపరులను ఏ ఒక్కరినీ వదలబోమని, వారి భరతం పట్టి ప్రజాధనాన్ని కక్కిస్తామని ప్రకటించారు. అందుకు తెలంగాణ ప్రజల సహకారం కావాలన్నారు. శనివారం నాగర్‌ కర్నూల్‌లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొని మాట్లాడారు. ‘‘గత పదేళ్లలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్యలో తెలంగాణ నలిగిపోయింది. రెండు పార్టీలు రాష్ట్ర ప్రజలు కన్న కలలను కూల్చాయి. గత పదేళ్లు రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ లూటీ చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు ఐదేళ్లు చాలు. మేము కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే ఇక్కడ కాంగ్రె్‌సను ఇష్టారాజ్యంగా వ్యవహరించనివ్వం’’ అని ప్రధాని మోదీ అన్నారు. దేశానికి తెలంగాణను ‘గేట్‌వే ఆఫ్‌ సౌత్‌’గా చెబుతారని పేర్కొన్నారు. ‘‘గత పదేళ్లలో రాష్ట్రానికి సహకరించాం. మీకు సేవ చేయాలంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి. మీ ఆశయాలను నెరవేర్చేందుకు నేను రాత్రింబవళ్లు కష్టపడతాను’’ అని మోదీ చెప్పారు.

లూటీ తప్ప కాంగ్రెస్‌ ఏమీ చేయదు..

ఏడు దశాబ్దాల్లో కాంగ్రెస్‌ లూటీ తప్ప దేశానికి ఏమీ చేయలేదని, తెలంగాణను కూడా అభివృద్ధి చేయదని మోదీ అన్నారు. గతంలో గరీబీ హఠావో అని కాంగ్రెస్‌ నినాదం ఇస్తే.. పేదరికం తగ్గిందా? అని ప్రశ్నించారు. పదేళ్ల క్రితం బీజేపీ ప్రభుత్వం రావడంతో పేదలకు బ్యాంకు ఖాతాలు వచ్చాయని, మరుగుదొడ్లు, తాగునీరు, ఇళ్లు, వ్యాక్సినేషన్‌ వచ్చిందని తెలిపారు. తొలిసారి అనేక గ్రామాలు విద్యుత్తును చూశాయని, 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటికి వచ్చారని, ఇలాంటి మార్పు తెలంగాణలోనూ రావాలని అన్నారు. ‘‘మీ ఓట్లతో కుటుంబం కోసం బ్యాంకు బ్యాలెన్స్‌ పెంచుకోను. 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం. ఒక్కరోజు కూడా నేను నా కోసం ఉపయోగించుకోలేదు. దేశ ప్రజల కోసమే కష్టపడుతున్నాను. మోదీ చెప్పాడంటే చేసి చూపిస్తాడు. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామని, అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పాం. చేసి చూపించాం. ఇది మోదీ గ్యారంటీ’’ అని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో పేదల కోసం కోటి మందికి బ్యాంకు ఖాతాలు తెరిచామని, ఏడాదికి రూ.20 నామమాత్ర ప్రీమియంతో కోటి మందికి బీమా కల్పించామని చెప్పారు. 67 లక్షల మంది చిరుద్యోగులకు ముద్రా రుణాలు అందించామని, 80 లక్షల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మాదిగ కులస్తుల అభివృద్ధి కోసం ప్రణాళిక రచిస్తున్నామన్నారు.

దళిత ఉప ముఖ్యమంత్రిని అవమానించారు..

గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో ఎక్కువ లబ్ధి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మహిళలకు చేకూరిందని ప్రధాని తెలిపారు. ఈ పథకాలను ఎక్కువగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లాంటి అవినీతి, కుటుంబ పార్టీలు వ్యతిరేకించాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను రెండు పార్టీలూ అవమానించాయని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ను ఓడించేందుకు, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఓడించేందుకు ప్రయత్నించారని మోదీ ధ్వజమెత్తారు. దేశానికి కొత్త రాజ్యాంగం అవసరముందని కేసీఆర్‌ చెప్పడం అంబేడ్కర్‌ను అవమానించడం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తామన్న కేసీఆర్‌ హామీని నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. దళితబంధు పథకంతో దళితులను మోసం చేశారని, వారి కళ్లలో దుమ్ము కొట్టేందుకే ఈ పథకం తెచ్చారని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కూడా దళితుల పట్ల వివక్ష అలాగే కొనసాగుతోందని విమర్శించారు. ఇటీవలే రాష్ట్రంలోని ఓ ఆలయంలో ఉన్నత వర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేతలను పైన కూర్చోబెట్టి.. దళితుడైన ఉప ముఖ్యమంత్రిని కింద కూర్చోబెట్టి అవమానించారని మండిపడ్డారు. బీఆర్‌ఎ్‌సపై ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉందని, అందుకే గత ఎన్నికల్లో వారికి ఈ దుస్థితి పట్టిందని అన్నారు. ప్రజల అభిమానం చూస్తుంటే రాష్ట్రంలో బీజేపీకి రెండంకెల సంఖ్యలో ఎంపీ స్థానాలు, కేంద్రంలో మూడోసారి మోదీ సర్కార్‌ రావడం ఖాయం అనిపిస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను సర్వనాశనం చేసిందే కాకుండా బీరు, బ్రాండీ వ్యాపారంతో పక్క రాష్ట్రాల్లో కూడా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. గ్యారెంటీల పేరుతో గారడీ చేసిన కాంగ్రెస్‌ అన్ని వర్గాల ప్రజలను వంచించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహబూబ్‌నగర్‌ అభ్యర్థి డీకే అరుణ, ఎంపీ పోతుగంటి రాములు, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ బీజేపీ అభ్యర్థులు భరత్‌ప్రసాద్‌, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ సభ ఊహించిన దాని కంటే ఎక్కువగా విజయవంతమైంది. నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఈ సభ నిర్వహించారు. హాజరైన వారిలో 20 నుంచి 30 ఏళ్ల వయసున్న యువకులు అధికంగా ఉండటం, మోదీ ప్రసంగం పట్ల వారు స్పందించిన తీరుతో ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Mar 17 , 2024 | 07:55 AM