Share News

Telangana Budget: కీలకమైన విద్య, విద్యుత్, గృహ నిర్మాణానికి బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా..

ABN , Publish Date - Feb 10 , 2024 | 01:52 PM

2024-25 సంవత్సరానికిగాను తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,75,891 కోట్లతో కూడిన బడ్జెట్ పాఠాన్ని ఉప ముఖ్యంత్రి భట్టి విక్రమార్క చదివి వినిపించారు. రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు.

Telangana Budget: కీలకమైన విద్య, విద్యుత్, గృహ నిర్మాణానికి బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా..

హైదరాబాద్: 2024-25 సంవత్సరానికిగాను తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,75,891 కోట్లతో కూడిన బడ్జెట్ పాఠాన్ని ఉప ముఖ్యంత్రి భట్టి విక్రమార్క చదివి వినిపించారు. రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు. కీలకమైన విద్యారంగానికి బడ్జెట్‌లో రూ. 21,389 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ‘‘ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు స్కాలర్ షిప్‌లను సకాలంలో అందజేస్తాం. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం. అందుకోసం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయిస్తున్నాం. ఐటీఐ కాలేజీలకు పూర్వవైభవం తీసుకొస్తాం. వందశాతం ఉద్యోగాలు వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కార్ ఉంది. అందుకోసం గుజరాత్, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాల్లో అధ్యయనానికి అధికారుల బృందం వెళ్లనుంది. ఓయూతోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నాం.’’ అని తెలిపారు.


విద్యుత్ రంగం గురించి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు 24 గంటలపాటు కరెంట్ అందించనున్నట్టు చెప్పారు. గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.2,418 కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు రూ.16,825 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. అలాగే ఈ ఈ బడ్జెట్‌లో గృహనిర్మాణ శాఖకు రూ.7,740 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. గత సర్కార్ పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇస్తామని చెప్పి మోసం చేసిందని, కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇళ్లు లేనివారికి ఇల్లు, స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం చేయనున్నట్టు చెప్పారు. ఇందుకోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇవ్వబోతున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 10 , 2024 | 01:57 PM