Congress: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, మహేశ్?
ABN , Publish Date - Jan 15 , 2024 | 07:38 AM
ఉప ఎన్నికలు జరగనున్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ స్థానాలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌లను అభ్యర్థులుగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎమ్మెల్యేల కోటాలో దక్కనున్న అవకాశం
పరిశీలనలో చిన్నారెడ్డి, హర్కార వేణుగోపాల్,
బలరాం నాయక్, పటేల్ రమేశ్‌రెడ్డి పేర్లు కూడా
గవర్నర్ కోటాలో కోదండరాం, ఆమెర్ అలీఖాన్!
నేడు ప్రకటించనున్న కాంగ్రెస్ అధిష్ఠానం
హైదరాబాద్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఉప ఎన్నికలు జరగనున్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ స్థానాలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌లను అభ్యర్థులుగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శనివారం టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోపాటు ఇతర అధిష్ఠానం పెద్దలతో ఎమ్మెల్యేల కోటాతోపాటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశంపై చర్చలు జరిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు మహేశ్‌కుమార్‌గౌడ్, అద్దంకి దయాకర్‌తోపాటు టీపీసీసీ ఉపాధ్యక్షుడు హర్కార వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ల పేర్లను అధిష్ఠానం ప్రధానంగా పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే మహేశ్‌కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్‌ల పేర్లనే ఖరారు చేస్తే.. చిన్నారెడ్డి, హర్కార వేణుగోపాల్‌లను ప్రభుత్వ పదవుల్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రేసులో చిన్నారెడ్డిని దింపేందుకూ ఆస్కారం ఉందంటున్నారు. ఇక పటేల్ రమేశ్‌రెడ్డి, బలరాం నాయక్ ఎలాగూ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల రేసులో ఉన్నారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ సీట్లకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సియాసత్ న్యూస్ ఎడిటర్ ఆమెర్ అలీఖాన్‌ల పేర్లను అధిష్ఠానం ప్రధానంగా పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ముస్లిం మైనారిటీ వర్గం వారు ఒక్కరు కూడా లేకపోవడంతో.. నాలుగు ఎమ్మెల్సీల్లో ఒకటి కచ్చితంగా ఆ వర్గానికి కేటాయించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఇందుకోసం మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్‌ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకూడదని పార్టీ పరంగా నియమం ఉండడంతో రేసులో వారిద్దరు వెనుకపడ్డారు. ఒకవేళ ముస్లిం మైనారిటీని ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రివర్గంలోనూ చోటు కల్పించాలని అధిష్ఠానం భావిస్తే మాత్రం.. షబ్బీర్ అలీకి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కవచ్చన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.