Share News

Bhatti Vikramarka: రైతు భరోసా ఎవరికి?

ABN , Publish Date - Dec 30 , 2024 | 03:15 AM

కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలున్న భూములను వదిలేసి... సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇద్దామా? ఆదాయపు పన్ను చెల్లింపుదారుల్లో ఏయే వర్గాలను మినహాయించాలి? ఎవరికి ఇవ్వాలి?

Bhatti Vikramarka: రైతు భరోసా ఎవరికి?
Rythu Bharosa

  • సాగు చేసిన మొత్తం విస్తీర్ణానికి ఇద్దామా?

  • ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంగతేంటి?

  • సింగరేణి, 4వ తరగతి ఉద్యోగులకు ఇవ్వాల్సిందే

  • కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలుంటే ఇవ్వొద్దు

  • కటాఫ్‌ను ఏ ప్రాతిపదికన నిర్ణయిద్దాం?

  • భట్టి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ

  • మరికొన్ని సార్లు సమావేశం కావాలని నిర్ణయం

  • సమగ్ర అధ్యయనం తర్వాతే క్యాబినెట్‌కు సిఫారసు

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలున్న భూములను వదిలేసి... సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇద్దామా? ఆదాయపు పన్ను చెల్లింపుదారుల్లో ఏయే వర్గాలను మినహాయించాలి? ఎవరికి ఇవ్వాలి? సింగరేణి ఉద్యోగులకు, నాలుగో తరగతి ఉద్యోగులకు ఇవ్వొచ్చా? ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వంటి పలు అంశాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం సుదీర్ఘంగా చర్చించింది. సమావేశంలో తొలుత రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం, ఉపసంఘం పలు అంశాలపై చర్చలను ప్రారంభించింది. గతంలో ఉమ్మడి జిల్లాలవారీగా నిర్వహించిన సదస్సుల్లో వ్యక్తమైన అభిప్రాయాలు, అధికారులు తయారుచేసిన నివేదికలపై చర్చించారు.


ఉపసంఘం చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటనల్లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రైతుభరోసా ఇవ్వొద్దనే అభిప్రాయాలు వ్యక్తమైన విషయం ప్రస్తావనకు వచ్చింది. అయితే, ఐటీ చెల్లించే సింగరేణి ఉద్యోగులు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో సుమారు 4 లక్షల మంది ఉన్నారని, వీరందరికి ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం- కిసాన్‌ పథకం మార్గదర్శకాలు కూడా ఉపసంఘం భేటీలో చర్చకు వచ్చాయి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లు, ఐదేళ్లలో మూడుసార్లు లేదా వరుసగా రెండేళ్లు ఐటీ చెల్లించినవారు, వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, సీఏలు, ఆర్కిటెక్టులు వంటి వృత్తి నిపుణులకు పీఎం- కిసాన్‌ పథకాన్ని వర్తింపచేయటం లేదు. అయితే, దీనిని రాష్ట్రంలో పూర్తిగా అనుసరించలేమని, కొన్ని వర్గాలను మినహాయించి మిగిలిన వర్గాలకు రైతుభరోసా ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అందులో తప్పనిసరిగా సింగరేణి ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులు ఉండేలా చూడాలని భావించారు.


కటాఫ్‌ పెట్టినా.. అందరికీ వర్తించేలా!

గడిచిన ఆరేళ్లలో పెట్టుబడి సాయం పొందిన రైతుల సంఖ్య, సాగవుతున్న భూ విస్తీర్ణం, బడ్జెట్‌ కేటాయింపులపైనా చర్చించారు. మొత్తం కలిపి రూ.80,453 కోట్లు చెల్లించగా... ఇందులో సాగు చేయని భూములకు రూ.21,284 కోట్లు చెల్లించినట్లు వ్యవసాయశాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ అంశంపై ఉపసంఘం సభ్యులు దృష్టి సారించారు. సాగుకు యోగ్యంకాని భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతుభరోసా ఇవ్వొద్దని తీర్మానించారు. కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, స్థిరాస్తి వెంచర్లు, రహదారుల భూసేకరణలో పోయిన భూములకు కూడా గత ప్రభుత్వంలో ఇచ్చారని, ఇలాంటి జాబితాలో ఉన్న భూములకు రైతుభరోసా ఇవ్వకూడదని ఏకాభిప్రాయానికి వచ్చారు. సాగు చేసిన భూములకు మాత్రమే రైతుభరోసా ఇచ్చే పక్షంలో... సంపన్నులకు, భూస్వాములకు ఇవ్వాలా? వద్దా? అనే చర్చ కూడా వచ్చింది. పదుల ఎకరాల్లో భూములున్న వారి సంగతేంటి? కటాఫ్‌ పెట్టాలా? కటాఫ్‌ పెడితే ఎన్ని ఎకరాలకు? తదితర అంశాలపైనా చర్చించారు. 10 ఎకరాల వరకు కటాఫ్‌ పెడితే.. 12 ఎకరాలున్న రైతులకు 10 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి మిగిలిన రెండెకరాలకు మినహాయించాలనే ప్రతిపాదన వచ్చింది.


విధివిధానాల ఖరారు తర్వాతే బడ్జెట్‌ లెక్కలు

కాగా, వ్యవసాయశాఖ అధికారులు స్లాబుల వారీగా రూపొందించిన నివేదికపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఐదు, ఆరు, ఏడున్నర, పది ఎకరాల వారీగా కటాఫ్‌ నిర్ణయించి.. ఒక్కోదానికి ఎంత బడ్జెట్‌ అవుతుంది? అనే గణాంకాలు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చారు. ఇందులో 20 లక్షల మందిని తొలగిస్తే ఎలా ఉంటుంది? ఎంత బడ్జెట్‌ తగ్గుతుంది? అన్న వివరాలనూ వ్యవసాయశాఖ అధికారులు ఉపసంఘం ముందు తెలియజేశారు. దీనిపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనే చర్చించి, తుది నిర్ణయం తీసుకుందామని మంత్రివర్గ ఉపసంఘం భావించింది. విధివిధానాలు పూర్తిగా ఖరారైన తర్వాతే బడ్జెట్‌ లెక్కలు తేలనున్నాయి. కాగా మంత్రివర్గ ఉపసంఘం మరికొన్ని సార్లు సమావేశం కావాలని కూడా నిర్ణయించింది. రైతులకు సంబంధించిన అంశం కావటం, ప్రతిపక్షాలు అవకాశం దొరికితే విమర్శలు గుప్పించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని చర్చించినట్లు తెలిసింది. మరిన్ని భేటీలు నిర్వహించి సమగ్రంగా చర్చించిన తర్వాతే ప్రతిపాదనలు సిఫార్సు చేయాలని ఉపసంఘం సభ్యులు నిర్ణయించారు.

Updated Date - Dec 30 , 2024 | 07:32 AM