Telangana-AP Border: సరిహద్దుల్లో కిక్కు తగ్గింది!
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:02 AM
ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దులో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో మూడు మద్యం దుకాణాలు నిత్యం కిటకిటలాడుతూ ఉండేవి. ఏపీ నుంచి మద్యం ప్రియులు పెద్దఎత్తున ఇక్కడికి వచ్చేవారు.

ఏపీతో సరిహద్దు ఉన్న జిల్లాల్లో తగ్గిన మద్యం ఆదాయం
6 జిల్లాల్లో విక్రయాలపై ప్రభావం
డిసెంబరులో రూ.40 కోట్లు తగ్గిన రాబడి
ఆర్థిక సంవత్సరం లక్ష్యంపైనా ప్రభావం
రూ.300 కోట్ల ఆదాయం తగ్గే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం రావడంతోనే!
హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దులో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో మూడు మద్యం దుకాణాలు నిత్యం కిటకిటలాడుతూ ఉండేవి. ఏపీ నుంచి మద్యం ప్రియులు పెద్దఎత్తున ఇక్కడికి వచ్చేవారు. రద్దీని తట్టుకోలేక, ఉన్న స్టాక్ అందరికీ సర్దాలన్న లక్ష్యంతో రేషన్‌కార్డులు తేవాలన్న నిబంధన కూడా అమలు చేశారు! ఒక్క కార్డుపై ఒక్క బాటిల్ మాత్రమే ఇచ్చేవారు! ఆదివారం, సెలవు రోజుల్లో అయితే రద్దీని నియంత్రించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసేవారు! పక్క రాష్ట్రం నుంచి వచ్చే వారికోసం ఇక్కడి వైన్ షాపుల చుట్టుపక్కల పదుల సంఖ్యలో దాభాలు వెలిశాయంటేనే రద్దీని అంచనా వేయొచ్చు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో రెండు నెలల కిందటి పరిస్థితి ఇది! కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది! సరిహద్దుల్లోని మద్యం షాపులు ఇప్పుడు మందుబాబుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఆయా దుకాణాల్లో విక్రయాలు పెంచుకునేందుకు ఎక్పైజ్‌శాఖ చెమటోడ్చాల్సి వస్తోంది. నాగర్‌కర్నూలు, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని సరిహద్దు మండలాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ ఆరు జిల్లాల్లో ఈ నెల (డిసెంబరు) 23 రోజుల్లోనే రూ.40 కోట్ల ఆదాయం తగ్గిందని ఆబ్కారీ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి.
తెలంగాణ బ్రాండ్లన్నీ ఏపీలో..
గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన మద్యం కోసం మందుబాబులు నానా ఇబ్బందులు పడ్డారు. అక్కడ బ్రాండెడ్ మద్యం అందుబాటులో లేకపోవడంతో తెలంగాణ వైపు వచ్చేవారు. దీంతో గద్వాల, నాగర్‌కర్నూలు, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల సరిహద్దు మండలాల్లోని మద్యం దుకాణాల్లో విక్రయాలు ఎక్కువగా జరిగేవి. రాష్ట్రంలో ఎక్కువ మద్యం విక్రయాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోని మద్యం దుకాణాల్లో జరిగేవి. కానీ, సరిహద్దు జిల్లాల్లోని దుకాణాల్లో మాత్రం గతంలో హైదరాబాద్‌లోని దుకాణాలకు మించి అమ్మకాలు జరిగేవి. దీంతో అక్కడ స్టాక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించేది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లక్ష్యాలను అందుకోవడం వెనక సరిహద్దు జిల్లాలు కీలక పాత్ర పోషించాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడ్డ ఎన్డీయే ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. ఇది అక్టోబరు-15 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పుడు అక్కడ తెలంగాణలో లభించే అన్ని బ్రాండ్ల మందు అందుబాటులో ఉంది. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు బ్రాండెడ్ లిక్కర్ క్వార్టర్ రూ.99కే విక్రయిస్తున్నారు. దీంతో ఏపీ నుంచి మద్యం కోసం తెలంగాణ సరిహద్దుల్లోకి వచ్చే మందుబాబుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. అక్టోబరు నుంచి తెలంగాణ సరిహద్దు మండలాలపై ఈ ప్రభావం కనిపిస్తోంది. నవంబరులో విక్రయాలు తగ్గగా.. డిసెంబరులో తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
మధిర.. రెండో స్థానం నుంచి చివరికి..
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లా మధిరలో ఈ ఏడాది డిసెంబరులో మద్యం అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. మధిర ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో 20 మద్యం దుకాణాలు ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తేఈ ఏడాది 59 శాతం మద్యం విక్రయాలు తగ్గాయి. గత ఏడాది డిసెంబరులో రూ.20.49కోట్ల మద్యం అమ్మకాలతో మధిర ఎక్సైజ్ స్టేషన్ జిల్లాలోనే రెండో స్థానంలో నిల్చింది. అలాంటిది ఈ ఏడాది డిసెంబరులో (25వ తేదీ వరకు) రూ.8.45కోట్ల వ్యాపారమే జరిగినట్లు ఎక్సైజ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఏపీలో మద్యం నాణ్యత లేకపోవడం, అధిక ధరలు ఉండడంతో ఏపీ ప్రజలు ఎక్కువగా తెలంగాణ మద్యం తాగేవారు. తాజాగా ఏపీలో ప్రభుత్వం మారడంతోపాటు మద్యం విధానం కూడా మారింది. అక్కడా నాణ్యమైన మద్యం దొరుకుతోంది. దీంతో ఏపీ నుంచి మందుబాబుల రాక బాగా తగ్గిపోయింది. రెండేళ్ల కిందట మద్యం విక్రయాల్లో ఖమ్మం జిల్లాలోనే రెండో స్థానంలో నిలిచిన మధిర.. ఇప్పుడు చివరి స్థానానికి పడిపోయింది. గతంలో మద్యం అమ్మకాల్లో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఖమ్మం జిల్లా ఈ ఏడాది 28వ స్థానానికి పడిపోయినట్లు సమాచారం.
ఖజానాకు రూ.300 కోట్లు గండి
ఈ నెల 23 వరకు ఆరు సరిహద్దు జిల్లాల పరిధిలో రూ.40 కోట్ల మేర ఆదాయం తగ్గింది. దసరా, నూతన సంవత్సరం వేడుకల సమయంలోనే ఆబ్కారీ శాఖకు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈసారి సరిహద్దుల్లో కొత్త సంవత్సర ఆదాయం కూడా గణనీయంగా తగ్గనుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి సరిహద్దు జిల్లాల్లో రూ.300 కోట్ల ఆదాయం తగ్గే అవకాశాలున్నాయని అంచనా. రాష్ట్ర ఖజానాకు ఎక్సైజ్ శాఖ వెన్నెముక లాంటిది. ఈ శాఖ నుంచి ఏటా ఆశించినదానికంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. 2024-25లో మద్యం విక్రయాల ద్వారా రూ.25617 కోట్లు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు వస్తున్న ఆదాయం ప్రకారం.. మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం నాటికి అంచనా వేస్తే లక్ష్యానికి రూ.2 వేల కోట్ల దూరంగా ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మద్యం ధరలు 5-10 శాతం పెంచాలని ధరల నిర్ణయ కమిటీ సూచించినా ప్రభుత్వం పెంచలేదు. ధరలు పెంచకుండా ఈ లక్ష్యాన్ని సాధించడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో మద్యం విక్రయాలు తగ్గడం ప్రభుత్వాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.