Share News

ప్రజలకు అండగా ఉండడమే పోలీసుల కర్తవ్యం

ABN , Publish Date - Dec 18 , 2024 | 10:26 PM

ప్రజలకు అండగా ఉండడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం వేమనపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆవరణలో నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.

ప్రజలకు అండగా ఉండడమే పోలీసుల కర్తవ్యం

వేమనపల్లి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు అండగా ఉండడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం వేమనపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆవరణలో నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వెయ్యి మందికి పైగా ప్రజలు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి పోలీసు శాఖ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ మందులను ఉచితంగా అందిస్తుందన్నారు. వేమనపల్లి మారుమూల మండలం కావడంతో ఇక్కడి ప్రజలు నిరక్షరాస్యులుగానే ఉంటున్నారని పేర్కొన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాదని , ప్రతీ ఒక్కరు చదువుకోవాలని సూచించారు. చదువుకోవడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలను సమకూర్చుతుందని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు.

ఆదివాసీలు ప్రగతి మార్గం వైపు పయనించేలా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవించేలా చూడడమే పోలీసుల ధ్యేయమని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని, మావోయిస్టులకు సహాయ సహాకారాలు అందించవద్దని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలుంటే స్ధానిక పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు, యువకులకు వాలీబాల్‌ కిట్‌లను అందజేశారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు భోజన సదుపాయం కల్పించారు. రూ. 2 లక్షలకు పైగా విలువైన మందులను ప్రజలకు అందించారు. అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ రాజు, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్‌ సీఐ సుధాకర్‌, చెన్నూరు, నీల్వాయి, కోటపల్లి, జైపూర్‌ ఎస్‌ఐలు రవీందర్‌, శ్యామ్‌ పటేల్‌, రాజేందర్‌, శ్రీధర్‌, మాజీ జెడ్పీటీసీ సంతోష్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సాబీర్‌, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2024 | 10:26 PM