Share News

మందగించిన ప్లాట్ల అమ్మకాలు

ABN , Publish Date - Dec 27 , 2024 | 10:25 PM

జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మందగించింది. భూముల క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. వేసిన లేఅవుట్లలో ప్లాట్లు అమ్ముకోవడానికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నానా పాట్లు పడుతున్నారు. కొంత మంది రియల్టర్లు పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారు.

మందగించిన ప్లాట్ల అమ్మకాలు

మంచిర్యాల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ఆ రంగంపై ఆధారపడ్డ వ్యాపారులు, మధ్యవర్తుల పరిస్థితి దయనీయంగా మారింది. వెంచర్లు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు అప్పులు చేసి స్థలాలు కొనుగోలు చేసినప్పటికీ, సబ్‌ డివిజన్ల రిజిస్ట్రేషన్లు జరుగకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రాకపోవడంతో చేసిన అప్పుల వడ్డీలు తీర్చేందుకు కొత్త అప్పులు చేస్తూ అప్పుల ఊబిలో మునిగిపోయారు. ముఖ్యంగా నాన్‌ లే అవుట్‌ వెంచర్లు ఏర్పాటు చేసిన వ్యాపారుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం చతికిల పడటంతో దాని ప్రభావం ఇతర వ్యాపారాలపై పడింది. రియల్‌ ఎస్టేట్‌ రంగం వెలవెలబోవడంతో వాహనాల షోరూంలు, భవన నిర్మాణ రంగం, వస్త్ర, జువెల్లరీ, తదితర రంగాలపైనా దాని ప్రభావం పడింది.

అసెంబ్లీ ఎన్నికలతో మొదలు..

అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కోడ్‌ ఎత్తివేసినా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంచుకోవడం లేదు. భూముల క్రయ, విక్రయాలు పూర్తిగా నిలిచిపోగా, వినియోగదారులు లేక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఎన్నికల కోడ్‌ రాకముందు నిత్యం సగటున వంద వరకు రిజిస్ట్రేషన్లు జరుగగా కోడ్‌ అమల్లోకి వచ్చిన తరువాత వాటి సంఖ్య సగానికి పడిపోయింది. రిజిస్ట్రేషన్ల సమ యంలో భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం కాగా, కోడ్‌ కారణం గా వాటిని తీసుకెళ్లడం కష్టసాధ్యంగా మారింది. నగదు తరలించే సమయంలో పోలీసులకు దొరికితే డబ్బంతా సీజ్‌ అయ్యే అవకాశం ఉండడంతో స్థిరాస్తి వ్యాపారులు భూముల క్రయ, విక్రయాల జోలికి వెళ్లలేదు. ఎన్నికల ప్రక్రియ ముగిసి పరిస్థితులు అనుకూలంగా మారినప్పటికీ బిజినెస్‌ ఊపందుకోలేదు.

తగ్గిన రిజిస్ట్రేషన్లు..

రియల్‌ వ్యాపారం కుదేలవడంతో రిజిస్ట్రేషన్లు తగ్గి ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపుతోంది. సగటున నిత్యం 80 డాక్యుమెంట్ల వరకు రాగా, కోడ్‌ అమలులో ఉన్న సమయంలో వాటి సంఖ్య సగానికి పడిపోయింది. అక్టోబరులో కోడ్‌ రాకముందు వారం రోజుల్లో రూ. కోటి 4 లక్షల పై చిలుకు ఆదాయం సమకూరింది. కాగా కోడ్‌ అమల్లోకి వచ్చిన తరువాత రూ.67 లక్షలకు పడిపో యింది. ఎన్నికల ప్రక్రియ ముగిసి ఏడాది కావస్తున్నా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు కానరావడం లేదు.

నిలిచిన నిర్మాణాలు..

భూముల అమ్మకాలు నిలిచిపోవడంతో ఇప్పుడు భవన నిర్మాణాలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లో సింహభాగం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయ నాయకులతో సంబంధాలు కలిగి ఉన్నారు. నగదు చలామణిపై ఆధారపడి ఉన్న రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ పూర్తిగా మందగించింది. సాధారణంగా యేటా నవంబరు నుంచి జూన్‌ మధ్యకాలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపుమీద ఉంటుంది. అయితే గత ఏడాది నవంబరు 30న ఎన్నికలు జరగడంతో దాదాపుగా రెండు నెలల ముందు, ఆ తరువాత మరో రెండు నెలలపాటు రియల్‌ ఎస్టేట్‌ రంగంపై దాని ప్రభావం పడింది. అలా గత సంవత్సరం రియల్‌ ఎస్టేట్‌ రంగం స్తంభించింది. ఈ ఏడాదైనా వ్యాపారం పుంజుకుంటుం దని ఆశించిన వ్యాపారులకు మళ్లీ గడ్డు పరిస్థితులే ఎదురయ్యాయి. లే అవుట్‌ లేని వెంచర్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగక రియల్‌ ఎస్టేట్‌ రంగం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెండు, మూడు ఎకరాల తక్కువ విస్తీర్ణంలో వెంచర్లు ఏర్పాటు చేసే వ్యాపారులు లే అవుట్‌కు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించవు. లే అవుట్‌కు వెళితే 10 శాతం భూమి స్థానిక సంస్థల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాల్సి ఉంటుంది. తక్కువ విస్తీర్ణం కావడం, అందులోని కొంత భూమి గ్రామ పంచాయ తీలు, మున్సిపాలిటీల పేరిట మార్చాల్సి వస్తోంది. దీంతో వచ్చే లాభాలు కాస్త ఆ భూమి రూపంలో కోల్పోవలసి వస్తుంది. వ్యాపారులు లే అవుట్‌ లేకుండానే వెంచర్లు ఏర్పాటు చేసి, పరిచయం ఉన్న వారితో ప్లాట్లు కొనుగోలు చేయిస్తుంటారు. ప్రస్తుతం లే అవుట్‌ లేని వెంచర్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో చిన్న వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది.

Updated Date - Dec 27 , 2024 | 10:25 PM