ధాన్యం నిల్వ చేసేదెలా..?
ABN , Publish Date - Nov 25 , 2024 | 10:32 PM
జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ధాన్యాన్ని మిల్లుల్లో నిల్వ చేసేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతు న్నారు. సీఎంఆర్ పెండింగులో ఉన్న రైస్‌మిల్లులపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో సివిల్ సప్లయిస్ అధికారులు వానాకాలం సీజన్‌లో ధాన్యం దించేందుకు కేవలం 13 మిల్లులను మాత్రమే ఎంపిక చేసి జియో ట్యాగింగ్ ఇచ్చారు.
మంచిర్యాల, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ధాన్యాన్ని మిల్లుల్లో నిల్వ చేసేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతు న్నారు. సీఎంఆర్ పెండింగులో ఉన్న రైస్‌మిల్లులపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో సివిల్ సప్లయిస్ అధికారులు వానాకాలం సీజన్‌లో ధాన్యం దించేందుకు కేవలం 13 మిల్లులను మాత్రమే ఎంపిక చేసి జియో ట్యాగింగ్ ఇచ్చారు. జిల్లాలో మొత్తం 54 రైస్‌మిల్లులు ఉండగా వాటిలో బాయిల్డ్-19, రా రైస్ మిల్లులు 35 ఉన్నాయి. సీఎంఆర్ పెండింగు కారణంగా అధికారులు 12 మిల్లులపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించగా, మరో రెండు మిల్లులపై కేసులు నమోదు చేశారు. దీంతో అభియోగాలు ఎదుర్కొంటున్న మిల్లర్లకు ఈసారి ధాన్యం ఇవ్వవద్దన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు వాటిని పక్కన బెట్టారు. అయితే కేసులు ఎదుర్కొంటున్న 14 మిల్లులతోపాటు జియో ట్యాగింగ్ ఇచ్చిన 13 పోను మిగతా 27 మిల్లులకు కూడా అధికారులు అనుమతులు ఇవ్వడం లేదు.
నిలువ చేయడంలో ఇబ్బందులు
జిల్లాలో 13 మిల్లులకు అధికారులు ధాన్యం ఇవ్వాలని నిర్ణయించడంతో ధాన్యం నిలువ చేసేందుకు స్థలాలు వెతుకుతున్నారు. జిల్లాలో 1,60,605 ఎకరాల్లో ఈ సీజన్‌లో 3,68,140 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందులో ప్రైవేటులో అమ్మకాలు, పంట నష్టాలు పోను కనీసం 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాల్సి ఉంది. అయితే అధికారులు ఎంపిక చేసిన ప్రకారం 13 మిల్లుల సామర్థ్యం కేవలం 64 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే. ఈ క్రమంలో మిగతా 1,36,000 మెట్రిక్ టన్నులను ఎక్కడ దించాలో తెలియని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. మిగతా ధాన్యం నిలువ చేసేందుకు ప్రైవేటు భవనాలు ఏర్పాటు చేస్తుండగా, ఇంకా మిగిలిన దాన్ని ఇతర జిల్లాలకు తరలించి నిలువ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అన్ని జిల్లాలోనూ సీఎంఆర్ పెద్ద మొత్తంలో పెండింగులో ఉంది. ఈ క్రమంలో ఇతర జిల్లాల్లో ధాన్యం ఎలా నిలువ చేస్తారో అధికారులకే తెలియాలి.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం....
ధాన్యాన్ని నిలువ చేసేందుకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొనుగోళ్లు చేపడితే సమస్య జఠిలం అవుతుందనే ఉద్దేశ్యంలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తున్నట్లు సమాచారం. వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో ధాన్యం సేకరణకు మొత్తం 326 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో ఇప్పటి వరకు 303 సెంటర్లు ప్రారంభించారు. మిగతావి ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలంటే ముందుగా నిలువ చేసేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు చేర్చి అక్కడే ఆరబెడుతున్నారు. రోజుల తరబడి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో అకాల వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటనే ఆందోళనలో రైతులు ఉన్నారు. తక్షణమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి కేసులు లేని 27 మిల్లులను కూడా ఎంపిక చేయాలని రైస్‌మిల్లర్లు కోరుతున్నారు. మిల్లుల సామర్థ్యాన్ని బట్టి ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం దింపుకుంటారో దాని విలువ ప్రకారం బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నారు. సివిల్ సప్లయిస్ శాఖతో అగ్రిమెంట్ పూర్తిచేస్తే నిబంధనల మేరకు ధాన్యం దించుకుంటామని చెబుతున్నారు.