Share News

Elephant: కొమురంభీం జిల్లాలో ఏనుగు అలజడి.. రైతు బలి..

ABN , Publish Date - Apr 04 , 2024 | 06:56 AM

కొమురంభీం: జిల్లాలో ఏనుగు అలజడి సృష్టించింది. చింతల మానేపల్లి మండలం, బూరెపల్లి శివారులో ఏనుగు దాడిలో రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లాలోకి ఏనుగు ప్రవేశించింది.

Elephant: కొమురంభీం జిల్లాలో ఏనుగు అలజడి..  రైతు  బలి..

కొమురంభీం: జిల్లాలో ఏనుగు (Elephant) అలజడి సృష్టించింది. చింతల మానేపల్లి మండలం, బూరెపల్లి శివారులో ఏనుగు దాడిలో రైతు (Farmer) మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర (Maharastra) అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లా (Komurambhim District) లోకి ఏనుగు ప్రవేశించింది. రైతును హతమార్చిన తర్వాత లంబాడీ హెటీ, గంగాపూర్ వైపు ఏనుగు వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. తిరిగి మహారాష్ట్ర అడవుల్లోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఏగు దాడిలో మృతి చెందిన రైతు శంకర్ కుటుంబానికి మంత్రి కొండా సురేఖ రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

మంద నుంచి విడిపోయిన ఏనుగు దారి తప్పింది... తోటి వాటి కోసం వెతుకుతూ వెర్రెత్తింది... ప్రాణహిత నది దాటి మిర్చి తోటలోకి వచ్చింది... అదిలించబోయిన రైతును కాళ్లతో తొక్కి చంపింది. కుమ రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో ఆ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. చింతలమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో బుధవారం ఈ ఘటన జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చింతలమానేపల్లి అటవీ ప్రాంతం నుంచి బూరెపల్లి గ్రామ శివారులోకి వచ్చిన ఏనుగు అక్కడే ఉన్న మిర్చి తోటలోకి ప్రవేశించింది. ఆ సమయంలో అల్లూరి శంకర్‌(56) అనే రైతు, అతడి భార్య అక్కడ పనుల్లో ఉన్నారు. ఏనుగును గమనించిన శంకర్‌ దాన్ని తరిమేందుకు ప్రయత్నించగా అతడిపై దాడి చేసింది. కాళ్లతో తొక్కగా తీవ్రగాయాలైన శంకర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. శంకర్‌ భార్య విషయం గ్రామస్థులకు చెప్పడంతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, అటవీశాఖ అధికారులూ చేరుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లాలో ఇటువంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ... తెలంగాణలో ఏనుగుల సంచారం లేదన్నారు. ప్రాణహిత నదికి అవతలవైపు మహారాష్ట్రలోని గడ్చరోలి జిల్లాలో 70 నుంచి 75 ఏనుగుల మంద సంచరిస్తోందని తెలిపారు. వీటిలో ఒక మగ ఏనుగు దారి తప్పి నది దాటి ఇవతలికి వచ్చిందని వెల్లడించారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ శంకర్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

కొము రంభీం జిల్లా: ఏనుగు దాడిలో మరో రైతు మృతి చెందాడు. పెంచికల్ పేట్ మండలం, కొండపల్లి గ్రామ శివారు పంట పొలంలో పోచయ్య అనే రైతును ఏనుగు హతమార్చింది. దీంతో అటవీ గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Apr 04 , 2024 | 11:07 AM