Share News

ఊపందుకున్నశ్మశాన వాటిక పనులు

ABN , Publish Date - Dec 14 , 2024 | 10:42 PM

జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన హిందూ శ్మశాన వాటిక పనులు వేగం పుంజుకున్నాయి. గోదావరి సమీపంలోని భూధాన్‌ యజ్ఞ బోర్డు భూముల్లో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.4 కోట్ల అంచనాతో నిర్మాణం చేపట్టగా, అక్టోబర్‌ 3న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు శంకుస్థాపన చేశారు.

ఊపందుకున్నశ్మశాన వాటిక  పనులు

మంచిర్యాల, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన హిందూ శ్మశాన వాటిక పనులు వేగం పుంజుకున్నాయి. గోదావరి సమీపంలోని భూధాన్‌ యజ్ఞ బోర్డు భూముల్లో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.4 కోట్ల అంచనాతో నిర్మాణం చేపట్టగా, అక్టోబర్‌ 3న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు శంకుస్థాపన చేశారు. శ్మశాన వాటికకు ప్రహరీ, ఇతర నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రజల సౌకర్యార్థం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. శ్మశాన వాటిక నిర్మాణం పూర్తయితే ఇంతకాలం ప్రజలు దహన సంస్కారాలకు పడుతున్న బాధలు తీరే అవకాశాలు ఉన్నాయి.

శ్మశాన వాటికలో వసతులు ఇలా....

హిందూ సాంప్రదాయం ప్రకారం దహన సంస్కా రాలకు అవసరమైన అని వసతులు కల్పించే విధంగా నిర్మాణాన్ని చేపట్టారు. ఒకేసారి ఎనిమిది మృతదేహాలను దహనం చేసే విధంగా ప్లాట్‌ఫాం నిర్మాణం చేపడు తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు వీక్షించేలా గ్యాలరీ ఏర్పాటు చేయనున్నారు. బాత్రూంలు, టాయిలెట్ల నిర్మాణం చేపడుతున్నారు. శ్మశాన వాటిక మధ్యలో గ్రీనరీతో కూడిన పార్క్‌ను నిర్మిస్తున్నారు. శ్మశాన వాటిక ఆవరణలో 20 ఫీట్ల ఎత్తైన శివ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక ప్లాట్‌ఫాంను నిర్మిస్తున్నారు. అలాగే వాహనాల పార్కింగ్‌ కోసం గోదావరి రోడ్డు నుంచి 30 మీటర్ల మేర ఏర్పాట్లు చేస్తున్నారు. దహన సంస్కారాల అనంతరం స్నానాలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

కిరాయిదారులకు ప్రత్యేక వసతి....

ఉపాధి కోసం జిల్లా కేంద్రానికి వచ్చి కిరాయికి ఉంటున్న స్థానికేతరుల కోసం శ్మశాన వాటికలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కిరాయికి ఉండేవారి కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని యజమానులు ఇంట్లోకి అనుమతించడం లేదు. దహన కార్యక్రమాల అనంతరం 11 రోజుల పాటు జరిగే కర్మలు పూర్తయ్యే వరకు కూడా వారిని యజమానులు ఇళ్లలోకి రానివ్వడం లేదు. దీంతో అంత్యక్రియలు నిర్వహించిన నాటి నుంచి కార్యక్రమాలు ముగిసే వరకు గోదావరి పరిసర ప్రాంతాల్లో మహిళలు, పిల్లలతోపాటు ఉండాల్సి వస్తోంది. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని శ్మశాన వాటిక నిర్మాణంలో వారికి ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. వారి కోసం ప్రత్యేకంగా గదుల నిర్మాణం చేపడుతున్నారు. ఆ గదుల్లో కార్యక్ర మాలు పూర్తయ్యే వరకు ఉండేలా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నారు. హిందూ మతస్థులు దహన సంస్కారాలు, కర్మకాండల కోసం దశాబ్దాలుగా పడు తున్న ఇబ్బందులు నూతనంగా నిర్మించే శ్మశాన వాటికతో తొలగిపోనున్నాయి.

Updated Date - Dec 14 , 2024 | 10:42 PM