Share News

Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డ్ సొంతం

ABN , Publish Date - May 26 , 2024 | 03:12 PM

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పవర్ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే! అడవిలో ఆకలితో ఉన్న సింహం వేటాడితే ఎలా ఉంటుందో.. సరిగ్గా అలాగే కోహ్లీ మైదానంలో దిగితే పరుగుల మోత మోగించేస్తాడు.

Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డ్ సొంతం

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాటింగ్ పవర్ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే! అడవిలో ఆకలితో ఉన్న సింహం వేటాడితే ఎలా ఉంటుందో.. సరిగ్గా అలాగే కోహ్లీ మైదానంలో దిగితే పరుగుల మోత మోగించేస్తాడు. బ్యాట్ పట్టుకొని క్రీజులో అడుగుపెడితే చాలు.. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా పరుగుల సునామీ సృష్టిస్తాడు. అందుకే.. అతని పేరిట దాదాపు ప్రతి రికార్డ్ ఉంది. గతంలో దిగ్గజ క్రికెటర్లు నమోదు చేసిన ఎన్నో రికార్డులను కూడా అతను బద్దలుకొట్టేశాడు. ఇప్పుడు తాజాగా ఐపీఎల్ (IPL) చరిత్రలో మరెవ్వరికీ సాధ్యం కాని సంచలన రికార్డును నమోదు చేశాడు.


ఐపీఎల్-2024లో (IPL 2024) 15 మ్యాచెస్ ఆడిన విరాట్ కోహ్లీ.. మొత్తంగా 741 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అందులో ఒక సెంచరీతో పాటు ఐదు అర్థశతకాలు ఉన్నాయి. ఇతర బ్యాటర్లెవ్వరూ ఇంతవరకూ 600 పరుగుల మైలురాయిని కూడా అందుకోలేదు కాబట్టి, కోహ్లీ స్కోరుని అధిగమించే ఆస్కారమే లేదు. దీంతో.. ఈ సీజన్‌లో కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. కోహ్లీ ఇలా ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2016లో 973 పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్ సాధించాడు. దీంతో.. ఐపీఎల్ చరిత్రలో రెండు ఆరెంజ్ క్యాప్‌లను సొంతం చేసుకున్న ఏకైక భారతీయ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్రపుటలకెక్కాడు.

ఇదే క్రమంలో కోహ్లీ మరో ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో 8000 పరుగుల మైలురాయిని దాటిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 252 ఐపీఎల్ మ్యాచెస్ ఆడిన కోహ్లీ.. 38.67 సగటు, 131.97 స్ట్రైక్ రేట్‌తో 8004 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీన్ని బట్టి.. కోహ్లీ ఈ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఎంత నిలకడగా తన ప్రదర్శన కొనసాగిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. మరో విశేషం ఏమిటంటే.. కోహ్లీ రికార్డ్‌కి దరిదాపుల్లో ఏ ఇతర బ్యాటర్ లేడు. శిఖర్ ధావన్ 6769 పరుగులతో (222 మ్యాచెస్) రెండో స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 6628 పరుగులతో (257 మ్యాచెస్) మూడో స్థానంలో ఉన్నాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 26 , 2024 | 03:25 PM