Share News

IPL 2024: సన్‌రైజర్స్ vs నైట్ రైడర్స్ మ్యాచ్‌లో మైండ్ బ్లోయింగ్ టీ20 రికార్డు నమోదు

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:32 PM

ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో కేకేఆర్‌ను విజయం వరించింది.

IPL 2024: సన్‌రైజర్స్ vs నైట్ రైడర్స్ మ్యాచ్‌లో మైండ్ బ్లోయింగ్ టీ20 రికార్డు నమోదు

కోల్‌కతా: ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో కేకేఆర్‌ను విజయం వరించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌ అభిమానులను అలరించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 208/7 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆండ్రూ రస్సెల్(64), ఫిలిప్ సాల్ట్(54) చెలరేగారు. అనంతరం సన్‌రైజర్స్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఒకానొక దశలో గెలుస్తుందేమో అనిపించింది. కానీ చివరికి 204/7 వద్ద నిలిచిపోయింది. గెలుపుపై ఆశలు వదులుకున్న సమయంలో హెన్రిచ్ క్లాసెన్(63) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 412 పరుగులు చేశాయి. ఈ క్రమంలో ఓ మైండ్ బ్లోయింగ్ టీ20 రికార్డు కూడా నమోదైంది. ఈ మ్యాచ్ 19వ ఓవర్‌లో రెండు జట్లు కలిసి 52 పరుగులు చేశాయి.


మొదట కేకేఆర్ తమ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో 26 పరుగులు చేయగా.. ఆ తర్వాత సన్‌రైజర్స్ కూడా తమ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో 26 పరుగులు చేసింది. దీంతో ఆల్‌టైమ్ టీ20 రికార్డుగా నిలిచిపోయింది. ఓ మ్యాచ్‌లో రెండు జట్లు తమ 19వ ఓవర్‌లో 26 పరుగుల చొప్పున సాధించడం అరుదైన రికార్డుగా చెప్పుకోవాలి. ముందుగా కోల్‌కతా ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌ను సన్‌రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేశాడు. ఆ ఓవర్‌లో రస్సెల్ 2 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. అంతేకాకుండా ఓ నో బాల్, ఓ వైడ్, రెండు సింగిల్స్, ఓ టుడీ రావడంతో 26 పరుగులు వచ్చాయి. అనంతరం సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో కేకేఆర్ బౌలర్ మిచెల్ స్టార్క్ 19వ ఓవర్‌ను బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్‌లో క్లాసెన్ 3 సిక్సులు, షాబాజ్ అహ్మద్ ఓ సిక్సు బాదారు. అలాగే ఓ వైడ్, ఓ సింగిల్ కూడా వచ్చింది. అలా మొత్తం ఆ ఓవర్‌లో 26 పరుగులు వచ్చాయి. దీంతో అప్పటివరకు కేకేఆర్ చేతిలో ఉన్న మ్యాచ్ కాస్త సన్‌రైజర్స్ వైపు తిరిగింది. అయితే చివరి ఓవర్‌లో హర్షిత్ రానా 2 వికెట్లు తీయడంతో కేకేఆర్‌ 4 పరుగుల తేడాతో గెలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 24 , 2024 | 06:58 PM