Share News

MI vs RR: ముంబైని వణికించిన బౌల్ట్.. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు గోల్డెన్ డకౌట్!

ABN , Publish Date - Apr 01 , 2024 | 08:16 PM

ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరిగాడు. తన పేస్ పదునుతో ఏకంగా ముగ్గురు ముంబై బ్యాటర్లను గోల్డెన్ డకౌట్ చేశాడు. అది కూడా 4 బంతుల వ్యవధిలోనే కావడం గమనార్హం.

MI vs RR: ముంబైని వణికించిన బౌల్ట్.. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు గోల్డెన్ డకౌట్!

ముంబై: ఐపీఎల్ 2024లో (IPL 2024) భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) నిప్పులు చెరిగాడు. తన పేస్ పదునుతో ఏకంగా ముగ్గురు ముంబై బ్యాటర్లను గోల్డెన్ డకౌట్ చేశాడు. అది కూడా 4 బంతుల వ్యవధిలోనే కావడం గమనార్హం. ట్రెంట్ బౌల్ట్ దెబ్బకు ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ను తొలి ఓవర్లోనే బౌల్ట్ దారుణంగా దెబ్బకొట్టాడు. తొలి ఓవర్‌లోనే ఐదు, ఆరో బంతికి రోహిత్ శర్మ, నమన్ ధీర్‌ను గోల్డెన్ డకౌట్లు చేశాడు. దీంతో ఒక్క పరుగుకే ముంబై 2 వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే తన రెండో ఓవర్ రెండో బంతికే మరో బ్యాటర్ డేవాల్డ్ బ్రెవిస్‌ను గోల్డెన్ డకౌట్ చేశాడు. దీంతో 14 పరుగులకే ముంబై 3 వికెట్లు కోల్పోయింది. ముగ్గురు బ్యాటర్లు కూడా గోల్డెన్ డకౌట్ అయ్యారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ముగ్గురు టాప్ బ్యాటర్లు గోల్డెన్ డకౌట్ అయిన చెత్త రికార్డును ముంబై మూటగట్టుకుంది. నాలుగో ఓవర్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్‌(16)ను బర్గర్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 20 పరుగులకే టాప్ 4 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది.


తుది జట్లు

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, జస్ప్రీత్ బుమ్రా, క్వేనా మఫాకా

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్/కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాండ్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్

Updated Date - Apr 01 , 2024 | 08:36 PM