Share News

MI vs DC: దుమ్ములేపిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీపై సూపర్ విక్టరీ

ABN , Publish Date - Apr 07 , 2024 | 07:35 PM

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ బోణీ చేసింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చిన ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో తొలి విజయం నమోదు చేసింది.

MI vs DC: దుమ్ములేపిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీపై సూపర్ విక్టరీ

ముంబై: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ బోణీ చేసింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చిన ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో తొలి విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టారు. రోహిత్ శర్మ(49), టిమ్ డేవిడ్ (45), ఇషాన్ కిషన్(42), రొమారియో షెపర్డ్(39), హార్దిక్ పాండ్యా (39) అదరగొట్టడంతో మొదట బ్యాటింగ్‌లో ముంబై ఇండియన్స్ 234/5 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా బాగానే పోరాడింది. ట్రిస్టన్ స్టబ్స్(71), పృథ్వీ షా(66) హాఫ్ సెంచరీలతో పోరాడిన ఫలితం లేకపోయింది. 3 ఫోర్లు, 7 సిక్సులతో 25 బంతుల్లోనే అజేయంగా 71 పరుగులు చేసిన స్టబ్స్ చివరలో ఆశలు రేపిన విజయాన్ని అందుకోలేకపోయింది. కీలక సమయంలో వికెట్లు తీసిన ముంబై బౌలర్లు ఢిల్లీని కట్టడి చేశారు. ముంబై బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ (4/34), జస్ప్రీత్ బుమ్రా (2/22) చెలరేగారు. మొత్తంగా పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఓడిపోయింది.


235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 22 పరుగులకే కీలకమైన డేవిడ్ వార్నర్(10) వికెట్ కోల్పోయింది. వార్నర్‌ను షెపార్డ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత అభిషేక్ పోరేల్‌తో మరో ఓపెనర్ పృథ్వీ షా చెలరేగాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 49 బంతుల్లో 88 పరుగులు జోడించారు. దీంతో జట్టు స్కోర్ 100 పరుగులు దాటింది. ఈ క్రమంలో పృథ్వీ షా తన ఐపీఎల్ కెరీర్‌లో 14వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ భాగస్వామ్యాన్ని 12వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా విడదీశాడు. 8 ఫోర్లు, 3 సిక్సులతో 40 బంతుల్లో 66 పరుగులు చేసిన షాను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ కాసేపటికే మరోసారి చెలరేగిన బుమ్రా 5 ఫోర్లతో 31 బంతుల్లో 41 పరుగులు చేసిన అభిషేక్ పోరెల్‌ను కూడా ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్(1)ను సింగిల్ డిజిట్‌కే గెరాల్డ్ కోయెట్జీ ఔట్ చేశాడు. దీంతో 16 ఓవర్లలో 153 పరుగులకు ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయింది.

ఢిల్లీ గెలవాలంటే చివరి 4 ఓవర్లలో ఏకంగా 82 పరుగులు అవసరమయ్యాయి. ఇలాంటి సమయంలో వరుసగా ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడిన స్టబ్స్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో స్టబ్స్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ. ఆకాష్ మద్వాల్ వేసిన 17వ ఓవర్లో 19 పరుగులు రాగా.. బుమ్రా వేసిన 18వ ఓవర్లో 8 పరుగులే వచ్చాయి. కానీ స్టబ్స్ మాత్రం పట్టు వదలకుండా పోరాడాడు. షెపార్డ్ వేసిన 19వ ఓవర్లో స్టబ్స్ 3 సిక్సులు బాదడానికి తోడు 3 సింగిల్స్ కూడా రావడంతో ఆ ఓవర్లో 21 పరుగులొచ్చాయి. గెరాల్డ్ కోయెట్జీ వేసిన చివరి ఓవర్లో 34 పరుగులు అవసరం అయ్యాయి. కానీ ఆ ఓవర్లో స్టబ్స్‌కు ఒక బంతి కూడా ఆడే అవకాశం రాలేదు. 4 పరుగులే ఇచ్చిన కోయెట్జీ 3 వికెట్లు తీశాడు. ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులే చేయగల్గింది. దీంతో 29 పరుగుల తేడాతో ముంబై గెలిచింది. ముంబై బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ 4, బుమ్రా 2, షెపార్డ్ ఒక వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మంచి ఆరంభాన్నిచ్చారు. ధాటిగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరు తొలి వికెట్‌కు 7 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. ముఖ్యంగా పవర్‌ప్లేలో రోహిత్ శర్మ చెలరేగాడు. ఇషాంత్ శర్మ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు బాదిన రోహిత్.. రిచర్డ్సన్ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా 2 సిక్సులు బాదాడు. అక్షర్ పటేల్ వేసిన ఐదో ఓవర్లో ఓ సిక్సు, ఫోర్ కొట్టాడు. లలిత్ యాదవ్ వేసిన ఆరో ఓవర్లో 3 ఫోర్లు బాదాడు. దీంతో పవర్‌ప్లేలోనే ముంబై జట్టు 75 పరుగులు చేసింది. అయితే 7వ ఓవర్లో ఈ భాగస్వామ్యాన్ని స్పిన్నర్ అక్షర్ పటేల్ విడదీశాడు. హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో ఉన్న రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేయడంతో 80 పరుగుల వద్ద ముంబై మొదటి వికెట్ కోల్పోయింది. 27 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 6 ఫోర్లు, 3 సిక్సులతో 49 పరుగులు చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే సూర్యకుమార్ యాదవ్‌ను అన్రిచ్ నోర్జే డకౌట్ చేశాడు.


అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి ముంబై స్కోర్‌ను కిషన్ 100 పరుగులు దాటించాడు. 11వ ఓవర్‌లో మరోసారి చెలరేగిన అక్షర్ పటేల్ ఇషాన్ కిషన్‌ను పెవిలియన్ చేర్చాడు. 23 బంతులు ఎదుర్కొన్న కిషన్ 4 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేసి బౌలర్ అక్షర్‌కే స్ట్రెట్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ కాసేపటికే తిలక్ వర్మ(6)ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. దీంతో 121 పరుగులకు ముంబై 4 వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై జట్టు 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అనంతరం టిమ్ డేవిడ్‌తో కలిసి కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై స్కోర్‌ను 180 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 31 బంతుల్లోనే 60 పరుగులు జోడించారు. మరోసారి చెలరేగిన నోర్జే ఈ భాగస్వామ్యాన్ని 18వ ఓవర్లో విడదీశాడు. 3 ఫోర్లు, ఓ సిక్సుతో 33 బంతుల్లో 39 పరుగులు చేసిన హార్దిక్‌ను ఔట్ చేశాడు.

ఇషాంత్ వర్మ వేసిన 19వ ఓవర్లో టిమ్ డేవిడ్ ఓ ఫోర్, ఓ సిక్సు, షెపార్డ్ ఓ ఫోర్ బాదడానికి తోడు మరో 3 పరుగులు రావడంతో 19 పరుగులు వచ్చాయి. దీంతో ముంబై స్కోర్ 200 దాటింది. ఇక నోర్జే వేసిన చివరి ఓవర్లో షెపర్డ్ రెచ్చి పోయాడు. ఏకంగా 4 సిక్సులు, 2 ఫోర్లు బాదడంతో ఆ ఓవర్లో 32 పరుగులు వచ్చాయి. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. డేవిడ్, షెపార్డ్ విధ్వంసంతో చివరి 5 ఓవర్లలో ముంబై 96 పరుగులు చేసింది. వీరిద్దరు చివరి 13 బంతుల్లోనే 53 పరుగులు జోడించారు. 3 ఫోర్లు, 4 సిక్సులతో 10 బంతుల్లోనే 39 పరుగులు చేసిన షెపార్డ్, 2 ఫోర్లు, 4 సిక్సులతో 21 బంతుల్లో 45 పరుగులు చేసిన టిమ్ డేవిడ్ నాటౌట్ గా నిలిచారు. ఢిల్లీ బౌలర్ నోర్జే రెండు వికెట్లు తీసినప్పటికీ ఏకంగా 62 పరుగులు సమర్పించుకున్నాడు. అక్షర్ పటేల్ కూడా 2 వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SRH vs CSK: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. సీఎస్కే ఓడిపోయిందని ఏకంగా..

SRH vs CSK: ధోని క్రీజులోకి రాకుండా కమిన్స్ వ్యూహం పన్నాడా..? అందుకే రివ్యూకు వెళ్లలేదా..?

Updated Date - Apr 07 , 2024 | 07:42 PM