Share News

IPL 2024: ఒక్కటైన వరల్డ్ కప్ హీరోలు.. గంభీర్-ధోనీ స్పెషల్ వీడియో ఇదిగో!

ABN , Publish Date - Apr 09 , 2024 | 04:36 PM

గౌతం గంభీర్-మహేంద్ర సింగ్ ధోని. ఈ రెండు పేర్లు వినగానే అందిరికీ గుర్తొచ్చేది 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో వీరిద్దరు ఆడిన ఆట ఇప్పటికీ క్రికెట్ అభిమానుల కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది.

IPL 2024: ఒక్కటైన వరల్డ్ కప్ హీరోలు.. గంభీర్-ధోనీ స్పెషల్ వీడియో ఇదిగో!
MS Dhoni, Gautam Gambhir hug

చెన్నై: గౌతం గంభీర్-మహేంద్ర సింగ్ ధోని(Gautam Gambhir-MS Dhoni). ఈ రెండు పేర్లు వినగానే అందిరికీ గుర్తొచ్చేది 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో వీరిద్దరు ఆడిన ఆట ఇప్పటికీ క్రికెట్ అభిమానుల కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది. అభిమానుల గుండెల్లో గంభీర్-ధోని ఇన్నింగ్స్‌ చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ మ్యాచ్‌లో భారత్ 275 పరుగుల లక్ష్య చేధనకు దిగింది. కానీ దురదృష్టవశాత్తూ 31 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో గంభీర్ భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మొదట విరాట్ కోహ్లీ, ఆ తర్వాత జట్టు కెప్టెన్ ధోనితో కలిసి అద్భుత భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ముఖ్యంగా ధోని, గంభీర్ కలిసి నెలకొల్పిన సెంచరీ భాగస్వామ్యమే టీమిండియాకు ప్రపంచకప్‌ను అందించింది. ఆ మ్యాచ్‌లో గంభీర్ 97, ధోని 91 పరుగులు చేశారు. ఆ తర్వాత కూడా వీరిద్దరు కలిసి టీమిండియాకు అనేక విజయాలు అందించారు. ఐపీఎల్‌లో తమ తమ జట్లకు కెప్టెన్లుగా ప్రత్యర్థులుగానూ తలపడ్డారు.


కానీ ఆ తర్వాత పలు కారణాలతో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. ముఖ్యంగా ధోనీపై గంభీర్ ఆగ్రహంతో ఉండేవాడు. దీంతో ఇద్దరి మధ్య చాలా కాలంగా సరైన సంబంధాలు లేవని చెప్పుకోవాలి. ఇక ప్రస్తుతం గంభీర్ అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ధోని కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ ఐపీఎల్‌లో చెన్నైసూపర్ కింగ్స్ తరఫున సాధారణ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం కోల్‌కతానైట్ రైడర్స్, చెన్నైసూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ దిగ్గజ ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అంతేకాకుండా నవ్వుతూ ఇద్దరు కాసేపు ముచ్చటించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు వీడియో ఆఫ్ ది డే అని రాసుకొస్తున్నారు. అలాగే ధోనీ, గంభీర్ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని ఆశిస్తున్నారు. ఐపీఎల్ వేదికగా వరల్డ్ కప్ హీరోలు ఒకటి కావడంపై అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతానైట్ రైడర్స్ 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(34) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే మూడేసి వికెట్లతో చెలరేగారు. ముస్తాఫిజుర్ రహ్మాన్ 2, మహేష్ తీక్షణ ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యాన్ని చెన్నైసూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలోనే చేధించింది. దీంతో కోల్‌కతాపై చెన్నై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 9 ఫోర్లతో 58 బంతుల్లో 67 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఈ సీజన్‌లో చెన్నైకి ఇది మూడో విజయం కాగా.. కోల్‌కతాకు ఇదే తొలి ఓటమి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్‌కతానైట్ రైడర్స్ రెండో స్థానంలో, చెన్నైసూపర్ కింగ్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024 Watch: ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదే.. పక్షిలా గాల్లోకి ఎగిరి..

IPL 2024: ముంబై, లక్నో విజయాలతో పాయింట్ల పట్టికలో జరిగిన మార్పులు ఇవే!

IPL 2024: ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన ధోని.. జడేజా రికార్డును బద్దలు కొట్టి మరి..

Updated Date - Apr 09 , 2024 | 04:37 PM