Share News

T20 World Cup 2024: షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?

ABN , Publish Date - Jan 05 , 2024 | 07:40 PM

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి ఐసీసీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఈ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, అమెరికా, ఐర్లాండ్, కెనడా ఉండగా.. గ్రూప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది.

T20 World Cup 2024: షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?

ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి ఐసీసీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఈ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 1 నుంచి 29 వరకు మెగా టోర్నీ జరగనుంది. ఇప్పటికే గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, అమెరికా, ఐర్లాండ్, కెనడా ఉండగా.. గ్రూప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం జూన్ 9న న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. జూన్ 12న ఆతిథ్య అమెరికాతో న్యూయార్క్‌లోనే భారత్ తన మూడో మ్యాచ్ ఆడనుంది. జూన్ 15న ఫ్లోరిడా వేదికగా కెనడాతో టీమిండియా ఆడనుంది.

schedule 1.jpg

కాగా ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడనుండగా నాలుగు గ్రూపులుగా విడిపోనున్నాయి. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్-8కి అర్హత సాధిస్తాయి. గ్రూప్ మ్యాచ్‌లు జూన్ 1 నుంచి 18 వరకు.. సూపర్-8 మ్యాచ్‌లు జూన్ 19 నుంచి 24 వరకు జరుగుతాయి. సూపర్-8లో టాప్-4 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. జూన్ 26న తొలి సెమీఫైనల్, జూన్ 27న సెకండ్ సెమీఫైనల్ జరగనున్నాయి. జూన్ 29న బార్బడోస్ వేదికగా ఫైనల్ జరగనుంది. నాకౌట్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేలు ఉంటాయని తన షెడ్యూల్‌లో ఐసీసీ వెల్లడించింది.

గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా ఉన్నాయి. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ ఉన్నాయి. గ్రూప్-సిలో న్యూజిలాండ్, ఆప్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఉగాండ, పపువా న్యూగినియా ఉన్నాయి. గ్రూప్-డిలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, నేపాల్ ఉన్నాయి.

schedule.jpg


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 05 , 2024 | 07:52 PM