Share News

GT vs DC: చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. పేకమేడలా కూలిన గుజరాత్.. లక్ష్యం ఎంతంటే?

ABN , Publish Date - Apr 17 , 2024 | 09:30 PM

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు విజృంభించారు. ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి.. వరుసగా వికెట్లు పడగొట్టారు. దీంతో.. తక్కువ స్కోరుకే గుజరాత్ జట్టు పేకమేడలా కూలింది.

GT vs DC: చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. పేకమేడలా కూలిన గుజరాత్.. లక్ష్యం ఎంతంటే?

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు విజృంభించారు. ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి.. వరుసగా వికెట్లు పడగొట్టారు. దీంతో.. తక్కువ స్కోరుకే గుజరాత్ జట్టు పేకమేడలా కూలింది. 17.3 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రషీద్ ఖాన్ ఒక్కడే 31 పరుగులతో పర్వాలేదనిపించాడంతే. మరో ఇద్దరు ఆటగాళ్లు సాయి సుదర్శన్ (12), రాహుల్ తెవాతియా (10) మాత్రమే రెండెంకల స్కోరుని అందుకోగలిగారు. మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. అందుకే.. గుజరాత్ జట్టు అంత తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప స్కోరు.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టుకి ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. రెండో ఓవర్‌లో ఐదో బంతికి 11 పరుగుల వద్ద కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఔట్ అయ్యాడు. ఆ కొద్దిసేపటికే సాహా కూడా పెవిలియన్ బాట పట్టడంతో.. గుజరాత్ బ్యాటర్లు ఒత్తిడికి గురయ్యారు. అటు.. ఢిల్లీ బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు స్కోరు చేసే ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. కట్టుదిట్టమైన బౌలింగ్ వేస్తూ ముచ్చెమటలు పట్టించారు. ఈ ఒత్తిడిలోనే గుజరాత్ బ్యాటర్లు స్కోరు చేయలేక.. వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ వచ్చారు. ఏ ఒక్కరూ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. వచ్చిన వాళ్లు వచ్చినట్లుగానే వెనుదిరిగారు. స్టార్ బ్యాటర్లు సైతం సత్తా చాటుకోలేకపోయారు. ఒకవేళ రషీద్ ఖాన్ కూడా చేతులెత్తేసి ఉండుంటే.. స్కోరు మరింత దారుణంగా నమోదయ్యేది.

ఇక ఢిల్లీ బౌలర్ల గురించి మాట్లాడుకుంటే.. ముకేశ్ కుమార్ అదరగొట్టేశాడు. 2.3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చిన అతను మూడు వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్ శర్మ, స్టబ్స్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ 90 పరుగులు చేయాల్సి ఉంటుంది. చూడ్డానికి ఈ లక్ష్యం చిన్నదే. కానీ.. ఢిల్లీ బౌలర్ల తరహాలోనే గుజరాత్ బౌలర్లూ విజృంభిస్తే.. మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది.

Updated Date - Apr 17 , 2024 | 09:30 PM