Share News

IPL 2024: సీఎస్కేకు మరో షాక్.. గాయం కారణంగా స్టార్ బౌలర్ ఔట్!

ABN , Publish Date - Mar 16 , 2024 | 06:16 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ ఎడిషన్ ప్రారంభానికి వారం రోజులు కూడా సమయం లేదు. దీంతో జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. చాంపియన్‌గా నిలవడమే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

IPL 2024: సీఎస్కేకు మరో షాక్.. గాయం కారణంగా స్టార్ బౌలర్ ఔట్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ ఎడిషన్ ప్రారంభానికి వారం రోజులు కూడా సమయం లేదు. దీంతో జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. చాంపియన్‌గా నిలవడమే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నైసూపర్ కింగ్స్ కూడా ఐపీఎల్ 2024పై దృష్టి సారించింది. ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫి గెలిచిన చెన్నై ఈ సారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. దీంతో టైటిల్ నిలబెట్టుకోవాలని ధోని సేన భావిస్తోంది. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా ప్రారంభించింది. కానీ ఇంతలోనే చెన్నైసూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. గతేడాది చెన్నై ట్రోఫి గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రీలంకకు చెందిన యువ పేసర్ మతీష పతిరణ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలుస్తోంది.


21 ఏళ్ల పతిరణ మార్చి 6న బంగ్లాదేశ్‌తో శ్రీలంక ఆడిన రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. తొడ కండరాల గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే జట్టుకు దూరమయ్యాడు. పతిరణ కోలుకోవడానికి కనీసం 4 నుంచి 5 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పినట్టు సమాచారం. ఇదే విషయాన్ని పలు జాతీయ మీడియా కథనాలు కూడా పేర్కొన్నాయి. ఈ సీజన్‌లో చెన్నైసూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 22న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. అప్పటివరకు పతిరణ కోలుకోవడం కష్టమే కాబట్టి ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు ఉన్న పతిరణ గతేడాది 12 మ్యాచ్‌లాడి 19 వికెట్లు తీశాడు. పతిరణ జట్టుకు దూరమైతే అతని స్థానంలో బంగ్లాదేష్ సీనియర్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. కాగా న్యూజిలాండ్‌కు చెందిన డేవాన్ కాన్వే కూడా బొటన వేలి శస్త్ర చికిత్స కారణంగా ఐపీఎల్ 2024 ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గత సీజన్‌లో ఓపెనర్‌గా సీఎస్కే ట్రోఫీ గెలవడంతో కాన్వే కీలక పాత్ర పోషించాడు. తాజాగా పతిరణ కూడా దూరం కావడం చెన్నైకి మైనస్‌గానే చెప్పుకోవాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2024 | 06:16 PM