Share News

Instagram Fraud: ఇన్‌స్టాగ్రామ్‌లో కలిశారు.. చెల్లెమ్మా అంటూ దగ్గరయ్యారు.. చివరికి?

ABN , Publish Date - May 15 , 2024 | 07:30 AM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలామందికి వ్యక్తిగత స్నేహాల కన్నా ఆన్‌లైన్ పరిచయాలే ఎక్కువ అయ్యాయి. వాస్తవ లోకంలో కన్నా ఈ సామాజిక మాధ్యమాల్లోనే అత్యధిక సమయం గడిపేస్తున్నారు. ప్రతిరోజూ...

Instagram Fraud: ఇన్‌స్టాగ్రామ్‌లో కలిశారు.. చెల్లెమ్మా అంటూ దగ్గరయ్యారు.. చివరికి?

ప్రస్తుత సోషల్ మీడియా (Social Media) యుగంలో చాలామందికి వ్యక్తిగత స్నేహాల కన్నా ఆన్‌లైన్ పరిచయాలే ఎక్కువ అయ్యాయి. వాస్తవ లోకంలో కన్నా ఈ సామాజిక మాధ్యమాల్లోనే అత్యధిక సమయం గడిపేస్తున్నారు. ప్రతిరోజూ కొత్త వాళ్లతో పరిచయాలు ఏర్పరుచుకొని.. చాటింగ్‌లతోనే కాలం గడిపేస్తున్నారు. ఇదే అదునుగా.. సైబర్ నేరగాళ్లు అమాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. తెలివిగా చాటింగ్ చేస్తూ అవతలి వ్యక్తుల సమాచారాన్ని రాబట్టి.. ఆపై బెదిరింపులకు పాల్పడి డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) చోటు చేసుకుంది. దేవుడిచ్చిన అన్నయ్యలం అంటూ ఓ మహిళని దుండగులు నిండా ముంచేశారు.

ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని ఇందిరానగర్‌కు చెందిన సల్మా (పేరు మార్చబడింది) అనే మహిళకు కొంతకాలం క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) రవికుమార్, రాణా ప్రతాప్ సింగ్, మనోజ్ కుమార్‌ అనే ముగ్గురు వ్యక్తులు పరిచయం అయ్యారు. ఆ ముగ్గురు ఆమెతో తరచూ చాటింగ్ చేస్తూ.. ఆమె నమ్మకాన్ని చూరగొన్నారు. తాము దేవుడిచ్చిన అన్నయ్యలం అంటూ బాధితురాలికి దగ్గరయ్యారు. ఎంతలా అంటే.. ఇరువురి ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు కూడా! ఈ క్రమంలోనే.. సల్మా తన వ్యక్తిగత విషయాలను వాళ్లతో పంచుకుంది. అంతేకాదు.. తనకు పెళ్లి కుదిరిందని, అందరూ తన పెళ్లికి రావాలని ఆహ్వానించింది. అంతే.. ఆమెని దోచుకోవడానికి ఇదే సరైన సమయమని భావించి, కేటుగాళ్లు ఒక పక్కా స్కెచ్ వేశారు.


తమ ప్లాన్‌లో భాగంగా.. రవికుమార్ ఆమెకి ఫోన్ చేసి, పెళ్లి రోజు ఖరీదైన బహుమతి ఇస్తామని చెప్పాడు. అయితే.. షిప్పింగ్ అవసరాల కోసం ఆధార్ కార్డు, ఫోటోలు, ఇతర డాక్యుమెంట్ల ఇవ్వాలని కోరడంతో ఆమె ఆ వివరాలను షేర్ చేసింది. అనంతరం మనోజ్ ఫోన్ చేసి.. ఎయిర్‌పోర్టులో తాము కొన్న ఖరీదైన బహుమతిని అధికారులు పట్టుకున్నారని, దాన్ని విడిపించేందుకు కొంత మొత్తం చెల్లించాలని చెప్పాడు. డబ్బులు ఇచ్చేందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో.. వాళ్లు తమ అసలు రంగు బయటపెట్టారు. తాము చెప్పినట్టు చేయకపోతే.. సీబీఐ, క్రైమ్ బ్రాంచ్ లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల్ని ఇన్వాల్వ్ చేసి.. నిన్ను అరెస్ట్ చేయిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వాళ్లు ఇచ్చిన ఈ ట్విస్ట్‌కు సల్మా ఒక్కసారిగా షాక్‌కి గురైంది.

చివరికి తనకేం చేయాలో పాలుపోక.. ఆ కేటుగాళ్లు బెదిరింపులకు లొంగి, ఆన్‌లైన్‌లో రూ.1.94 లక్షలకు సల్మా బదిలీ చేసింది. తమకు డబ్బులు అందిన తర్వాత వాళ్లు కూడా కాంటాక్ట్‌లో లేకుండా పోయారు. ఫైనల్‌గా తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ముగ్గురిని వెతికి పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో.. ఆన్‌లైన్‌లో పరిచయమయ్యే వ్యక్తుల్ని అంత తేలిగ్గా నమ్మొద్దని, లేకపోతే ఇలాగే నష్టపోవాల్సి వస్తుందని సూచించారు.

Read Latest Viral News and Telugu News

Updated Date - May 15 , 2024 | 07:30 AM