Share News

'Infosys' Sudhamurthy: అద్భుత సేవలతో అత్యున్నత శిఖరాలు.. నిరాడంబరానికి పెట్టింది పేరు

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:12 PM

రచనా వ్యాసంగం అంటే మహాఇష్టం. ఆధ్యాత్మిక సేవలంటే మక్కువ. సామాజిక సేవల గురించి చెప్పాల్సిన పనేలేదు. నిరాడంబరతకు పెట్టింది పేరు. ప్రచార ఆర్భాటాలకు బహుదూరం. వెరసి ఆమె పేరు డాక్టర్‌ సుధామూర్తి(Dr. Sudhamurthy). ఈ అపురూప సేవలే ఆమెను అత్యున్నత శిఖరాలకు చేర్చాయి.

'Infosys' Sudhamurthy: అద్భుత సేవలతో అత్యున్నత శిఖరాలు.. నిరాడంబరానికి పెట్టింది పేరు

- ప్రచార ఆర్భాటాలకు దూరం

- రాష్ట్రం నుంచి రాజ్యసభకు ‘ఇన్ఫోసిస్‌’ సుధామూర్తి

బెంగళూరు: రచనా వ్యాసంగం అంటే మహాఇష్టం. ఆధ్యాత్మిక సేవలంటే మక్కువ. సామాజిక సేవల గురించి చెప్పాల్సిన పనేలేదు. నిరాడంబరతకు పెట్టింది పేరు. ప్రచార ఆర్భాటాలకు బహుదూరం. వెరసి ఆమె పేరు డాక్టర్‌ సుధామూర్తి(Dr. Sudhamurthy). ఈ అపురూప సేవలే ఆమెను అత్యున్నత శిఖరాలకు చేర్చాయి. కేంద్రప్రభుత్వ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం డాక్టర్‌ సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్‌ చేసిన విషయం ప్రధాని నరేంద్రమోదీ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేసిన తక్షణం అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అత్యంత సమర్థురాలైన ఒక మహిళా నేతకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే అత్యున్నత హోదా దక్కడం, ఆమె పార్లమెంటులోని పెద్దలసభలోకి అడుగిడబోతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్‌ సంస్థాపకుడు నారాయణమూర్తి(Narayanamurthy) సతీమణిగా ఆమె తన సామాజిక సేవలతో మంచి గుర్తింపు పొందారు. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలిగా ఆమె చేసిన సేవలు అజరామరం. 1950 ఆగస్టు 19న (ఉమ్మడి ధారవాడ జిల్లా) హావేరి జిల్లాలోని శిగ్గావిలో డాక్టర్‌ ఆర్‌హెచ్‌ కులకర్ణి, విమలా కులకర్ణి దంపతులకు జన్మించారు. సుధామూర్తి హుబ్బళ్లిలోని కేఎల్‌ఈ సంస్థకు చెందిన ఇంజనీరింగ్‌ కళాశాలలో డిగ్రీ చేశారు.

pandu1.3.jpg

అనంతరం ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు. అనంతరం సుధామూర్తి టాటా ఇంజనీరింగ్‌ లోకోమోటివ్‌ (టెల్కో)లో తన కెరీర్‌ను ప్రారంభించారు. భారతదేశంలో అతిపెద్ద వాహనాల తయారీ సంస్థలో తొలి మహిళా ఇంజనీర్‌గా ఆమె సత్తా చాటుకున్నారు. 1970 ఫిబ్రవరి 10న ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణమూర్తిని వివాహమాడారు. ఇన్ఫోసి్‌సను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేదిశలో భర్తతో కలసి అడుగులు వేశారు. 1996లో చారిటబుల్‌ ట్రస్టును ఏర్పాటు చేసి వరదపీడిత బాధితుల కోసం రాష్ట్రంలో 2,300కుపైగా ఇళ్లను నిర్మించారు. విద్యాసంస్థలో 70వేలకు పైగా గ్రంథాలయాలను, 16వేలకు పైగా పబ్లిక్‌ టాయ్‌లెట్‌లను నిర్మించారు. ఈమె సేవలను గుర్తించిన కేంద్రం 2006లో అత్యున్నత ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని, 2023లో ‘పద్మ భూషణ్‌’ పురస్కారాన్ని అందజేసి గౌరవించింది. సుధామూర్తి సేవలను గుర్తించిన ఏపీ ప్రభుత్వం గతంలో టీటీడీ బోర్డు పాలకమండలి సభ్యురాలిగా నియమించిన సంగతి విదితమే. ప్రస్తుతం థాయ్‌లాండ్‌ పర్యటనలో ఉన్న ఆమె తనను రాజ్యసభకు నామినేట్‌ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేసే భాగ్యం దక్కడం సంతోషంగా ఉందన్నారు. సుధామూర్తిని ముఖ్యమంత్రి సిద్దరామయ్యతోపాటు పలువురు ప్రముఖులు అభినందించారు.

pandu1,2.jpg

Updated Date - Mar 09 , 2024 | 01:12 PM