Share News

AP Politics: వైఎస్ జగన్ రెడ్డికి ఎందుకింత భయం.. ఏమిటీ ఓట్లు..!?

ABN , Publish Date - Jan 11 , 2024 | 05:15 PM

AP Election 2024: అధికారం మనదే.. మనం చెప్పిందే వేదం.. చేసిందే శాసనం..! అడ్డుకునేదెవరు.. ఢీ కొనేదెవరు..? పదండి ముందుకు.. ఏం జరిగినా సరే.. ఇంకేదైనా చేసయినా సరే గెలిచి తీరాలంతే.. అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ (YSRCP) తీరు ఉంది. ఇందుకు ఎన్నికల ముందు మూడో కంటికి తెలియకుండా వైసీపీ చేపడుతున్న కార్యకలాపాలే నిదర్శనం..

AP Politics: వైఎస్ జగన్ రెడ్డికి ఎందుకింత భయం.. ఏమిటీ ఓట్లు..!?

అధికారం మనదే.. మనం చెప్పిందే వేదం.. చేసిందే శాసనం..! అడ్డుకునేదెవరు.. ఢీ కొనేదెవరు..? పదండి ముందుకు.. ఏం జరిగినా సరే.. ఇంకేదైనా చేసయినా సరే గెలిచి తీరాలంతే.. అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ (YSRCP) తీరు ఉంది. ఇందుకు ఎన్నికల ముందు మూడో కంటికి తెలియకుండా వైసీపీ చేపడుతున్న కార్యకలాపాలే నిదర్శనం. ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ అరాచకాలు మితిమీరిపోయాయ్. ఒకటా రెండా లెక్కలేనన్ని ఘటనలు ఈ నాలుగున్నరేళ్లలో మనం కళ్లారా చూసే ఉంటాం. ఇక ఓట్ల విషయంలో అయితే రచ్చ రచ్చగా మారింది. లెక్కలేనన్ని బోగస్ ఓట్లు ఉండటం, ఊరు పేరు లేనివారిని, సంబంధంలేని వ్యక్తులను జాబితాలో చేర్చడంతో అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ, జనసేనల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది.


Voter-Cardss.jpg

అసలేం జరుగుతోంది..?

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే ఎన్నికలు (AP Elections) జరగబోతున్నాయ్. దీంతో ఈ ఏడాది మొదట్నుంచే పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. నేతల జంపింగ్‌లు, అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత.. సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కావట్లేదని, లబ్ధిదారులకు నేరుగా వెళ్లట్లేదని ఇలా వందల సంఖ్యలో వైసీపీపై ఫిర్యాదులున్నాయని ప్రజలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించాల్సిందేనని.. లేకుంటే రాష్ట్రం నామరూపాల్లేకుండా పోతుందని పదే పదే టీడీపీ నేతలు చెబుతూ.. జనాల్లోకి స్ట్రాంగ్‌గా తీసుకెళ్తున్నారు. ఓ వైపు టీడీపీ ఇలా చేస్తూ పోతుంటే.. వైసీపీ మాత్రం ప్రజల్లో ఉన్న వ్యతిరేఖతను ఎలాగో తగ్గించలేమని.. లెక్కలేనన్ని అడ్డదారులు తొక్కుతూ.. అడ్డంగా బుక్కవుతోంది. వైసీపీ చేష్టలన్నీ కేంద్ర ఎన్నికల కమిషన్ (Election commission) ఎండగట్టింది. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికల్లో (Tirupati By Elections) జరిగిన భారీ మోసాలే నిదర్శనం. ఎన్నికల కమిషనర్‌ లాగిన్‌ను అధికార వైసీపీ నేతకు చేరింది. నాటి తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ గిరిషా ఈ లాగిన్ ఇవ్వడంతో ఉప ఎన్నికల్లో భారీగానే డూప్లికేట్‌ ఓట్లు వచ్చిపడ్డాయి. వాస్తవానికి తిరుపతి సిట్టింగ్ ఎంపీ సీటును దక్కించుకోవడానికి నానా యాగీ చేసి చివరాకరికి ఈసీతో మొట్టికాయలు వేయించుకున్న పరిస్థితి. ఇదిగో ఇదంతా ఈసీ బయటపెట్టిందే.. అది కూడా ఏపీ పర్యటనలోనే వైసీపీ హైమాండ్ కంగుతిన్నది. తెలిసినదే ఇంత అయితే.. ఇక ఇంతవరకూ జరిగిన ఎన్నికల్లో ఎన్నెన్ని అవకతవకలు వైసీపీ పాల్పడిందో ఒక్కసారి ఊహించుకోండి. దీన్ని బట్టి చూస్తే.. అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ.. మళ్లీ 2024 ఎన్నికల్లో (2024 Elections) అధికారం దక్కించుకోవడానికి అడ్డదారులు తొక్కుతూనే ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని ప్రతిపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక వ్యూహాత్మక అరాచకం అన్న మాట. వాస్తవానికి.. 2023 మొదటి నుంచీ ఓటరు జాబితాలను అధికార పార్టీ గల్లంతు చేస్తూనేఉంది. ప్రతిసారీ ఈసీ దెబ్బలు పడినా.. ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమ చొరబాట్లను మాత్రం మానుకోలేదు.


Jagan-Vs-Chandrababu.jpg

మారవా.. నువ్ మారవా..?

‘మిర్చి’ సినిమాలో.. ‘మారవా.. నువ్ మారవా’ అనే ఒక డైలాగ్ గుర్తుంది కదా. సరిగ్గా ఇప్పుడు ఇదే డైలాగ్ వైరల్ అవుతోంది. ఎందుకంటే.. ఏపీలో బోగస్ ఓట్లపై టీడీపీ ఏ రేంజ్‌లో యుద్ధం చేస్తోందో టీవీలు, దినపత్రికలు, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇంత జరుగుతున్నా కనీసం ప్రభుత్వం నుంచి ఇసుమంత కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. అందుకే ‘మీరు మారరా జగన్.. మార్పు రాదా’ అంటూ సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు దుమ్మెత్తిపోస్తున్నాయి. సామాన్య ప్రజలు సైతం సీఎం జగన్ రెడ్డిని తిట్టిపోస్తున్న పరిస్థితి. మరోవైపు.. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వందల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లడం.. ఎన్నికలు కూడా దగ్గరపడటంతో ఏపీలో కేంద్ర బృందం పర్యటించింది. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించడంతో అక్రమాలు, మోసాలు బయటికొచ్చాయ్. అది కూడా గెలిచే సీటు విషయంలోనే ఈ రేంజ్‌లో అక్రమాలకు పాల్పడ్డారంటే.. ఇక అధికరాంలోకి రావడానికి ఇంకెన్ని నేరాలు, ఘోరాలకు వైసీపీ పాల్పడుతుందో అని రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. అయితే.. తిరుపతి ఎన్నికలతో బయటపడిన అక్రమాలపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా..? అనేది చూడాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే.. జగన్ ఎందుకో బాగా జంకుతున్నాడన్నది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

Vote.jpg

మరిన్ని రాజకీయ కథనాలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 11 , 2024 | 05:29 PM