Share News

NRI: సౌదీ యువతి చేయి తాకినందుకు భారతీయ డాక్టర్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష

ABN , Publish Date - Apr 22 , 2024 | 07:33 PM

తన కూతురితో సమానమైన ఒక విద్యార్ధినికి ఆసుపత్రిలో ల్యాబ్‌లో రక్త పరిక్ష నమూనా విధానాన్ని వివరిస్తున్న క్రమంలో కంప్యూటర్ మౌజ్‌పై ఉన్న అమె చేయిపై పొరపాటున చేయి పెట్టినందుకు సౌదీ అరేబియాలో న్యాయస్థానం ఒక భారతీయ డాక్టర్‌కు అయిదేళ్ళ జైలు శిక్ష, లక్షన్నర రియాళ్ల (సుమారు 33.5 లక్షల రూపాయాల) జరిమానాను విధించింది.

NRI: సౌదీ యువతి చేయి తాకినందుకు భారతీయ డాక్టర్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష

  • కంప్యూటర్ మౌజ్‌పై ఉన్న యువతి చేయికి పొరపాటున తగిలిందని డాక్టర్ వాదన

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: తన కూతురితో సమానమైన ఒక విద్యార్ధినికి ఆసుపత్రిలో ల్యాబ్‌లో రక్త పరిక్ష నమూనా విధానాన్ని వివరిస్తున్న క్రమంలో కంప్యూటర్ మౌజ్‌పై ఉన్న అమె చేయిపై పొరపాటున చేయి పెట్టినందుకు సౌదీ అరేబియాలో న్యాయస్థానం ఓ భారతీయ డాక్టర్‌కు (NRI) అయిదేళ్ళ జైలు శిక్ష, లక్షన్నర రియాళ్ల (సుమారు 33.5 లక్షల రూపాయాల) జరిమానా విధించింది. ఈ ఘటన సౌదీ అరేబియాలోని జీజాన్ రాష్ట్రంలో గత నెలలో చోటుచేసుకొంది.

పని ప్రదేశాల్లో మహిళలకు వేధింపుల నిర్మూలన చట్టం కింద దీన్ని పరిగణించిన సౌదీ అరేబియా న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. అయిదేళ్ళ జైలు శిక్ష అనంతరం జరిమాన మొత్తాన్ని చెల్లించిన తర్వాత మాత్రమే ఆయన జైలు నుండి విడుదల అవుతారు.

NRI: కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు!


తాను చేయిని వెంటనే వెనక్కి తీసుకొన్నా సాంపిళ్ళను చూపించడం పేర మరోసారి డాక్టర్ తన చేయిని తాకారని యువతి ఫిర్యాదు చేసింది. రెండవ సారి చేయి తాకిన తర్వాత అమె ల్యాబ్ నుండి బయటకు వచ్చి రిసెపన్షన్ ఏరియాలో కూర్చొగా, కంగారు పడ్డ డాక్టర్ అమె వద్దకు వచ్చి మాట్లాడి ఇతరులతో విషయాన్ని ప్రస్తావించవద్దని కూడా వేడుకొన్నట్లు ప్రాసిక్యూషన్ వాదించింది.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన 57 ఏళ్ళ డాక్టర్ సౌదీ అరేబియాతో పాటు గతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కూడా పని చేసారు. డాక్టర్ కేసు గురించి కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొన్నా ఫలితం లేకపోయింది. జీజాన్ నగరం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి వెళ్ళి కేసు పూర్వాపరాలను పరిశీలించి, అప్పీలుకు వెళ్ళడానికి కూడా భారతీయులు వెనుకంజ వేసే పరిస్థితి ఉంది.


ఈ ఫిర్యాదును ప్రభుత్వంలోని మహిళా వేధింపుల నిర్మూలన విభాగం స్వీకరిస్తూ సదరు మహిళ తన వ్యక్తిగత హక్కు కింద కూడా న్యాయ సహాయం పొందవచ్చని సూచించింది.

దక్షిణాదిన ఉన్న జీజాన్ రాష్ట్రం సువిశాల ఎడారులతో పాటు కొండకొనలతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ఇక్కడ తెలుగు వారితో పాటు పెద్ద సంఖ్యలో భారతీయులు పని చేస్తున్నారు.

సౌదీ అరేబియాలో పని చేసే ప్రదేశంలో మహిళలను ఏ రకమైన సైగలు, మాటలు, భౌతికంగా తాకినా అనుచితంగా ప్రవరిస్తే సౌదీ అరేబియా చట్టాలు కఠినంగా వ్యవహరిస్తాయి. ఈ నేరాల కింద ఇప్పటికే కొందరు తెలుగు వారితో సహా భారతీయులు జైళ్ళల్లో శిక్షలు అనుభవిస్తున్నారు. వాట్స్‌ఆప్ మేసెజ్ లేదా సైగ చేసినట్లుగా రుజువయితే చాలు, నిందితుడికి జైలు తప్పదు.

మరిన్ని ప్రవాస వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 22 , 2024 | 07:55 PM