Share News

Respiratory Health: ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌కు చూపించుకోండి..

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:19 PM

మెదడు, గుండె, కిడ్నీలు, లివర్ శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే ఊపిరితిత్తులను కూడా వయస్సు ప్రభావితం చేస్తాయి. వయసు పెరిగే కొద్ది శరీరంలోని అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది. ఆధునిక జీవనశైలి, నిరంతర శ్రమ కారణంగా చాలా మంది తమ ఆరోగ్య సమస్యలను విస్మరిస్తుంటారు.

Respiratory Health: ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌కు చూపించుకోండి..
Respiratory Health

Respiratory Health: మెదడు, గుండె, కిడ్నీలు, లివర్ శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే ఊపిరితిత్తులను కూడా వయస్సు ప్రభావితం చేస్తాయి. వయసు పెరిగే కొద్ది శరీరంలోని అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది. ఆధునిక జీవనశైలి, నిరంతర శ్రమ కారణంగా చాలా మంది తమ ఆరోగ్య సమస్యలను విస్మరిస్తుంటారు. అది చివరికి తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తుంది. ఊపిరితిత్తుల విషయంలోనూ అదే జరుగుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన ఏమైనా సమస్యలుంటే ముందే కొన్ని సంకేతాలను మన శరీరం తెలియజేస్తుంది. వాటిని గ్రహించి.. అవసరమైన చికిత్స తీసుకోవాలి. లేదంటే సమస్య తీవ్రమవుతుంది. మరి ఊపిరితిత్తులకు సంబంధించిన వార్నింగ్ సంకేతాలేంటో ఓసారి చూద్దాం..

వార్నింగ్ సంకేతాలు..

ఛాతిలో నొప్పి: చాలా మంది ఛాతిలో నొప్పి వస్తుందని చెబుతుంటారు. అయితే, ఈ ఛాతి నొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. సూదిపోట్ల మాదిరి నొప్పి నుంచి తీవ్రమైన నొప్పి వరకు ఫేస్ చేస్తుంటారు. ఈ నొప్పి కొన్ని రోజులు.. కొన్నివారాలు ఉంటుంది. మరికొన్నిసార్లు నెల రోజుల పాటు ఉంటుంది. అయితే, ఈ నొప్పి వచ్చినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా.. దగ్గుతున్నప్పుడు ఇబ్బంది కలిగిస్తున్నా.. వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి.

శ్వాస సమస్యలు: శ్వాస ఆడకపోవడం ఊపిరితిత్తుల వ్యాధికి సంకేతం కావచ్చు. ఊపిరితిత్తులలో కణితి లేదా గాలి మార్గాన్ని అడ్డుకునే కార్సినోమా నుండి ద్రవం ఏర్పడటం వంటి అనేక కారణాలు ఉన్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లయితే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

నిరంతర దగ్గు: నెలల తరబడి నిరంతర దగ్గుతో బాధపడుతున్నారా? ఆస్తమా, బ్రోన్కైటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వివిధ కారణాల వల్ల దీర్ఘకాలిక దగ్గు వస్తుంది. అలాగే, దీర్ఘ కాలంగా దగ్గు వస్తూ.. ఆ దగ్గుతో రక్తం కూడా వస్తున్నట్లయితే.. ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు ఉన్నట్లే. ఇలాంటి సంకేతం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి.

దీర్ఘకాలిక శ్లేష్మం: శ్లేష్మం, కఫం.. అంటువ్యాధులు లేదా ఇతర అలెర్జీ నుంచి పోరాడటానికి వాయుమార్గాల ద్వారా ఉత్పత్తి అవుతుంది. అయితే, శరీరంలో శ్లేష్మం ఉత్పత్తి ఒక నెల కంటే ఎక్కువ కాలం ఉంటే.. ఊపిరితిత్తులకు సంబంధించి సమస్య ఉన్నట్లుగా భావించొచ్చు. ఇలాంటి సమయంలో వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స పొందాలి.

Updated Date - Jan 09 , 2024 | 04:21 PM