Share News

Lok Sabha Elections: కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతుపై మమత కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - May 15 , 2024 | 06:19 PM

విపక్ష 'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పశ్చిమబెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తమ మద్దతుపై స్పష్టత ఇచ్చారు. ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించారు.

Lok Sabha Elections: కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతుపై మమత కీలక వ్యాఖ్యలు

కోల్‌కతా: విపక్ష 'ఇండియా' (I.N.D.I.A.) కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పశ్చిమబెంగాల్ (West Bengal) లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తమ మద్దతుపై స్పష్టత ఇచ్చారు. హుగ్లీ జిల్లాలోని చిన్‌సురహ్‌లో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, బీజేపీ 400 సీట్లు గెలుస్తామని చెబుతున్నప్పటికీ ఈసారి అది జరగదని ప్రజలు చెబుతున్నారని అన్నారు., కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు 'ఇండియా' కూటమికి బయట నుంచి తాము మద్దతిస్తామని తెలిపారు.


ఈసీపై మండిపాటు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో ఎన్నికల కమిషన్ ఒక కీలుబొమ్మలా పనిచేస్తోందని మమతా బెనర్జీ విమర్శించారు. రెండున్నర నెలల పాటు ఎన్నికల షెడ్యూల్ ఉండటాన్ని తప్పుపడుతూ కాషాయం పార్టీకి అనుకూలంగా ఈసీ వ్యవహరించిందన్నారు. మండుటెండల్లో ప్రజలు పడే కష్టాలు ఎన్నికల అధికారులకు తెలియవా అని ప్రశ్నించారు.

Lok Sabha Elections: మోదీని సాగనంపడం ఖాయం.. అఖిలేష్‌తో సంయుక్త సమావేశంలో ఖర్గే


ఎంసీసీ ఉల్లంఘనకు పాల్పడిన మోదీ

లోక్‌సభ ఎన్నికలు మధ్యలో ఉండగా ఆయుష్మాన్ భారత్ యోజనను 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లకు వర్తింపజేసే ఆలోచన ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడాన్ని మమతా బెనర్జీ తప్పుపట్టారు. ఓవైపు ఎన్నికలు జరుగుతుండగా మోదీ కీలక ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్‌సీ), ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని అమలు చేసే ప్రసక్త లేదని, ఇందుకు తాము కట్టుబడి ఉంటామని బెనర్జీ పునరుద్ఘాటింటారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 15 , 2024 | 06:35 PM