Share News

ఓట్ల శాతం వెంటనే చెప్పాలని.. ఈసీని ఆదేశించలేం

ABN , Publish Date - May 25 , 2024 | 06:39 AM

ఓట్ల శాతంపై తుది డేటాను వెంటనే వెల్లడించాల్సిందిగా ఎన్నికల కమిషన్‌(ఈసీ)ను ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరో వారం రోజుల్లో ఎన్నికలు ముగుస్తాయని, ఈ మధ్యలో జోక్యం చేసుకోలేమని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌చంద్రతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ శుక్రవారం స్పష్టంచేసింది.

ఓట్ల శాతం వెంటనే చెప్పాలని..  ఈసీని ఆదేశించలేం

సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

న్యూఢిల్లీ, మే 24 (ఆంధ్రజ్యోతి): ఓట్ల శాతంపై తుది డేటాను వెంటనే వెల్లడించాల్సిందిగా ఎన్నికల కమిషన్‌(ఈసీ)ను ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరో వారం రోజుల్లో ఎన్నికలు ముగుస్తాయని, ఈ మధ్యలో జోక్యం చేసుకోలేమని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌చంద్రతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ శుక్రవారం స్పష్టంచేసింది. ఈ అంశంపై లోక్‌సభ ఎన్నికల తర్వాత విచారిస్తామని తెలిపింది. 2019లో కూడా ఇదే అంశంపై పిటిషన్‌ వేశారని, అది పెండింగ్‌లో ఉన్నదని గుర్తుచేశారు. వేసవి తర్వాత రెగ్యులర్‌ బెంచ్‌ ఈ కేసును విచారిస్తుందని స్పష్టం చేశారు.

లోక్‌సభ ఎన్నికల ప్రతి దశ పోలింగ్‌ పూర్తయిన 48 గంటల్లోపు ఎన్నికల కమిషన్‌ తమ వెబ్‌సైట్‌లో పోలింగ్‌ స్టేషన్‌ వారీగా ఓట్ల శాతాన్ని అప్‌లోడ్‌ చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఏడీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.

ఓటర్ల మనసుల్లో ఎన్నికల కమిషన్‌పై అనుమానాలు రేకెత్తించేందుకే దురుద్దేశంతో ఇలాంటి పిటిషన్‌ దాఖలు చేశారని, కేవలం అనుమానాలతో పిటిషన్‌ దాఖలు చేయడం సరైంది కాదని ఈసీ వాదించింది. పోటీ చేసిన అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు తప్ప ఓట్ల శాతాన్ని ఏ వ్యక్తికైనా ఇవ్వడం చట్టపరంగా తప్పనిసరి కాదని ఈసీ తెలిపింది. పారదర్శకత, ప్రజల సౌకర్యం కోసమే ఓట్ల శాతంపై డేటాను స్వచ్చందంగా వెల్లడిస్తున్నామని పేర్కొంది.

అయితే మొదటి రెండు దశల్లో ప్రకటించిన ఓట్ల శాతం భారీగా వ్యత్యాసం ఉండటాన్ని ఏడీఆర్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.

Updated Date - May 25 , 2024 | 06:45 AM